రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు
* జిల్లాలో 128 కేంద్రాల్లో నిర్వహణ
* ప్రతిచోటా గట్టి బందోబస్తు
* 144 సెక్షన్ విధింపు
* 0883-2473430తో హెల్ప్‌డెస్క్
కంబాలచెరువు (రాజమండ్రి) : జిల్లాలో బుధవారం నుంచి ఇంటర్మీడియేట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 128 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు అధికారులు సన్నాహాలు చేశారు. ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభం కానుండగా, ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం మొదలవుతాయి.
ప్రథమ సంవత్సరం పరీక్షలను 48,330 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం పరీక్షలను 49,178 మంది విద్యార్థులు రాయనున్నారు. వీరిలో వృత్తి విద్యాకోర్సుల పరీక్షలకు ప్రథమ సంవత్సరంలో 5,892 మంది, ద్వితీయ సంవత్సరంలో 5,237 మంది హాజరు కానున్నారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా 8.30 గంటలకే విద్యార్థులంతా పరీక్షాకేంద్రానికి చేరుకోవాలని, 8.45 గంటలకు కచ్చితంగా పరీక్ష హాలులో ఉండాలని ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎ.వెంకటేష్ చెప్పారు. ప్రతి కేంద్రం వద్దా 144 సెక్షన్ విధించి, గట్టిబందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
8 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించి, మరింత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో అడ్డతీగల, కూనవరం కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే సమస్యాత్మకంగా ఉన్న రంపచోడవరం, రాజోలు కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని జిల్లా ఇంటర్‌బోర్డు అధికారులు ఉన్నతాధికారులను కోరారు. పరీక్షలు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. ఈ ఏడాదినుంచి జీపీఆర్‌ఎస్ విధానాన్ని పూర్తిగా అమలు చేయనున్నారు. దీనివల్ల పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్ పరికాలు తీసుకు వస్తే సులువుగా గుర్తించవచ్చు.
పరీక్షల నిర్వహణకు మొత్తం 128 మంది డిపార్ట్‌మెంట్స్ ఆఫీసర్లు, 128 మంది చీఫ్ సూపరింటెండెంట్లతో పాటు ఐదు ఫ్లైయింగ్ స్క్వాడ్లు, నాలుగు సిట్టింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశారు. ఈసారి పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతాల్లోని అన్ని జిరాక్స్ సెంటర్ల విధిగా మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే సహాయం కోసం ఆర్‌ఐవో కార్యాలయం వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. సహాయం కావాల్సిన వారు నేరుగా లేక 0883- 2473430 నంబర్‌కు ఫోన్ ద్వారా తెలియజేయవచ్చు.