
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తొలిసారిగా ఉన్నత విద్యాకోర్సుల్లో అవుట్ కమ్ బేస్డ్ సిలబస్ ప్రవేశపెడుతున్నామని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. 2020–21 నుంచి ఇది అమల్లోకి వస్తుందన్నారు. సోమవారం ఉన్నత విద్యామండలి రూపొందింపచేసిన చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్)కు సంబంధించిన అంశాలను ఆయన మీడియాకు వెల్లడించారు.
► యూజీసీ సూచనల మేరకు 2015–16 నుంచి సీబీసీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టారు. పేరుకు సీబీసీఎస్ సిలబస్ అయినా క్రెడిట్ ట్రాన్సఫర్ చాయిస్‌ను విద్యార్థులకు కల్పించలేదు. గత ఐదేళ్లలో ఈ సిలబస్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు.
► 2020–21 విద్యాసంవత్సరానికి కొత్త సిలబస్ ప్రవేశపెట్టాలని నిర్ణయించి ఉన్నత విద్యామండలి ద్వారా రూపకల్పన చేశాం. వివిధ వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని దీన్ని రూపొందించారు.
ఈ సిలబస్‌లో ముఖ్యాంశాలు..
► ఫౌండేషన్ కోర్సుల స్థానంలో లైఫ్ స్కిల్ కోర్సులను ప్రవేశపెట్టడం.
► లైఫ్ స్కిల్ కోర్సులను ఎంపిక చేసుకొనే అవకాశం విద్యార్థులకే కల్పించడం.
► నైపుణ్యాభివృద్ధిని పెంపొందించే దిశగా స్కిల్ డెవలప్‌మెంట్, స్కిల్ ఎన్‌హేన్స్‌మెంటు కోర్సులకు రూపకల్పన.
► సీఎం జగన్ సూచనల మేరకు తొలిసారి విద్యార్థులందరికీ 10 నెలల నిర్బంధ అప్రెంటీస్‌షిప్, ఇంటర్న్‌షిప్ (ఉద్యోగావకాశాల మెరుగుకు) ఈ సిలబస్ ప్రత్యేకత.