భూ కబ్జాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ
కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ డిమాండ్
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో వెలుగు చూసిన భూకబ్జాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేంద్రప్రభుత్వ మాజీ కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ వల్ల బాధితులకు ఎలాంటి న్యాయం జరగదన్నారు. ‘‘విశాఖలో రాజకీయ నేతలు, రెవెన్యూ అధికారులు, బ్యాంకు ఉద్యోగులు కుమ్మక్కై వేల ఎకరాలు కబ్జా చేశారు.. ఇంత భారీ కుంభకోణంపై విచారణ నిష్పక్షపాతంగా ఉండాలి. విచారణ సంస్థలపై ప్రభుత్వ నియంత్రణ ఉండకూడదు. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపితేనే వాస్తవాలు వెల్లడవుతాయి’’ అని ఆయన స్పష్టం చేశారు. శర్మ మంగళవారమిక్కడ ‘సాక్షి’తో మాట్లాడారు.
రెవెన్యూ రికార్డులు తారుమారవుతున్న విషయాన్ని సరిగ్గా ఏడాది క్రితమే తనతోపాటు మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోపాలరావు, రవికుమార్ కలసి గుర్తించామని తెలిపారు. విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో పది కేసుల్లో ఇలా రికార్డులు ట్యాంపర్ అయినట్టుగా గుర్తించామన్నారు. ఈ విషయాన్ని అప్పటి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని చెప్పారు. వెబ్‌ల్యాండ్ పేరుతో ల్యాండ్ రికార్డులను ఆన్‌లైన్‌తో పొందుపర్చే ప్రక్రియ సమయంలోనే ఈ భూబాగోతం జరిగిందని, ఈ భూకబ్జాలకు అమరావతిలో బీజం పడిందని శర్మ అన్నారు.