
ఐఓబీ కొత్త రుణ పథకాలు
కొత్తపేట, న్యూస్‌లైన్ : మత్స్యకారులు, రైతులకు సాగరలక్ష్మి, భూలక్ష్మి పథకాల్లో పెద్ద మొత్తంలో రుణసౌకర్యం కల్పిస్తున్నట్టు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ)ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఏడీఎం చావలి తెలిపారు. మందపల్లి ఐఓబీ బ్రాంచిని ఏనుగులమహల్ వంతెన వద్ద నూతనభవనంలోకి మార్చారు. ఆ శాఖను ఈడీ చావలి దీపారాధన చేసి శుక్రవారం ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమ బ్యాంక్ దేశవ్యాప్తంగా 3090 శాఖల ద్వారా రూ.3.86 లక్షల కోట్ల టర్నోవర్‌తో నడుస్తోందన్నారు. విదేశాలకు కూడా తమ సేవలను విస్తరించామన్నారు. మత్యకారులకు సాగర లక్ష్మి పథకంలో రూ. లక్ష వరకూ, రైతులకు భూలక్ష్మి పథకంలో రూ. 10 లక్షల వరకూ రుణ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.
ఐఓబీ విశాఖపట్నం రీజియన్ పరిధిలోని శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరిజిల్లా వరకూ 4 జిల్లాల్లో 59 శాఖలు, 54 ఏటీఎంలు ఉన్నాయన్నారు. త్వరలో జిల్లాలో యానాం, రాజోలులో నూతన శాఖలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ రీజియన్‌లో సుమారు రూ. 3700 కోట్ల డిపాజిట్లు ఉన్నాయన్నారు. వ్యవసాయ రంగానికి సుమారు రూ. 850 కోట్లు, చిన్న,సూక్ష్మ తరహా వ్యాపారులకు రూ. 374 కోట్లు రుణాలుగా అందజేసినట్టు చావలి తెలిపారు. విశాఖ సీఆర్‌ఎం కె. జగ్గారావు, మందపల్లి బ్రాంచ్ మేనేజర్ రాయుడు సూర్యప్రకాశరావు, ఐఓబీ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీరామకృష్ణ, మందపల్లి సర్పంచ్ కొల్లి వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.