
వాడరేవు సముద్ర తీరంలో బోట్లపైనే గొడవ పడుతున్న మత్స్యకారులు
సాక్షి, ఒంగోలు: సముద్రంలో చేపలు, రొయ్యల విషయంలో చీరాల మండలంలోని పలు గ్రామాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో రెండు గ్రూపులుగా విడిపోయిన పలు గ్రామాల మత్స్యకారులు సముద్రంలో పలుమార్లు చేపల వేట చేసుకుంటూనే గొడవలకు దిగుతూ వచ్చారు. అది కాస్తా చిలికి చిలికి గాలివానలా మారి ఒక గ్రామం మత్స్యకారుల వలలను, బోట్లను మరో గ్రామానికి చెందిన మత్స్యకారులు తీసుకెళ్లడంతో ఘర్షణలు తారస్థాయికి చేరాయి. ఆ తరువాత తీసుకెళ్లిన బోట్లు, వలలకు చెందిన గ్రామస్తులు ఇతర గ్రామాలకు చెందిన బోట్లను, వలలను తీసుకెళ్లడంతో మత్స్యకారుల మధ్య గొడవ కాస్తా గ్రామాల మధ్య గొడవగా మారింది.
దీంతో గ్రామాల వారీగా ఒకరిపై ఒకరు చీరాల, ఈపూరుపాలెం పోలీస్‌స్టేషన్‌లలో కేసులు పెట్టుకునే స్థాయికి చేరుకుంది. దీంతో గ్రామాల మధ్య నెలకొన్న ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో ఆ గ్రామాల మధ్య పంచాయతీ జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయానికి చేరుకుంది. దీంతో బుధవారం ఒంగోలులోని మత్స్యశాఖ జేడీ కార్యాలయంలో ఓడరేవు గ్రామానికి చెందిన మత్స్యకారులను, రెండవ వర్గానికి చెందిన కఠారివారిపాలెం, రామచంద్రపురం, పొట్టిసుబ్బయపాలెం గ్రామాలకు చెందిన మత్స్యకారులతో మత్స్యశాఖ అధికారులు, పోలీసులు సంప్రదింపులు జరిపారు. ఒక గ్రామానికి చెందిన పడవలు, వలలు మరో గ్రామానికి చెందిన వారు తీసుకెళ్లడం, మరో గ్రామాలకు చెందిన పడవలు, వలలను ఇంకొక గ్రామానికి చెందిన మత్స్యకారులు తీసుకెళ్లడం మానుకోవాలని అధికారులు ఆయా గ్రామాల మత్స్యకారులకు సూచించారు.
ఘర్షణ వాతావరణం లేకుండా సయోధ్యగా ఉండాలని కూడా ఆయా గ్రామాల మత్స్యకారులకు నచ్చజెప్పారు. అర అంగుళం సైజు కంటే తక్కువ కన్ను ఉన్న వలలను వాడటంతో సముద్రంలో ఉన్న గుడ్లుతో సహా వలల్లో వస్తున్నాయని దీంతో మత్స్యసంపద నశించిపోతుందన్న ఉద్దేశంతో ఘర్షణ వాతావరణం నెలకొందనే ఉద్దేశమని అధికారులు నిర్ధారణకొచ్చారు. దీనిపై మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ ఆవుల చంద్రశేఖరరెడ్డి ఆయా గ్రామాల్లో వాడుతున్న వలలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని ఈలోగా గొడవలు లేకుండమత్స్యకారులు కలిసిమెలిసి ఉండాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment