సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజారవాణా వ్యవస్థ ఇక నిఘా నీడలోకి వెళ్లనుంది. ప్రయాణాల్లో యువతులు, మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరించడం, వెకిలిచేష్టలు లాంటి ఘటనలు నిత్యం ఏదో ఒకచోట వెలుగు చూస్తున్నాయి. వీటిని నివారించి మహిళలు, బాలికలకు రక్షణ కల్పించేందుకు రవాణాశాఖ ఆపరేషన్ ‘అభయ’ అనే కార్యక్రమానికి రూపకల్పన చేసింది. దీనిద్వారా ద్వారా క్యాబ్, ఆటో, టూరిస్ట్ బస్, ప్రైవేట్ ట్రావెల్స్, విద్యా సంస్థల బస్సులు ఇలా ఒకటేమిటి.. చివరకు ఆర్టీసీ బస్సు కూడా ఎక్కడెక్కడ తిరుగుతుందో.. ఏ ప్రాంతానికి వెళ్లనుందో.. ట్రాక్ అండ్ ట్రేస్ ద్వారా రవాణా శాఖ ఇట్టే పసిగడుతుంది. ఈమేరకు రవాణా వాహనాలన్నింటికీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) పరికరాలను తప్పనిసరి చేస్తూ అతి త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి. రెండేళ్ల క్రితమే రవాణా శాఖ ‘అభయ’ ప్రాజెక్టు రూపొందించింది. నీతి ఆయోగ్ ఆమోదంతో ఈ ప్రాజెక్టుకు కేంద్రం రూ.138 కోట్లను విడుదల చేసింది.
తొలుత ఆటోలు, క్యాబ్‌లకు...
ఏపీలో 12.15 లక్షల వరకు రవాణా వాహనాలున్నాయి. వీటికి దశలవారీగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాలు అమర్చేందుకు రవాణాశాఖ ఇప్పటికే ఐటీ కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులు కోరింది. ఈనెల 20న దీనికి సంబంధించిన టెండర్లను ఖరారు చేయనుంది. తొలిదశలో అక్టోబరు నుంచి క్యాబ్‌లు, ఆటోలకు ఐవోటీ పరికరాల్ని బిగించనున్నారు.
ఆపరేషన్ ‘అభయ’ అంటే..?
మహిళల భద్రత కోసం ‘అభయ’ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు కేంద్ర ఉపరితల రవాణాశాఖకు ఏపీ రెండేళ్ల క్రితమే నివేదిక సమర్పించింది. ప్రయాణంలో అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) ఆధారంగా పోలీస్, రవాణాశాఖలకు సమాచారం చేరవేసేలా దీన్ని రూపొందించారు. కేంద్రం కేటాయించిన నిధులతో పోలీస్‌శాఖకు అత్యాధునిక టెక్నాలజీతోపాటు రవాణాశాఖలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేస్తారు. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు, ట్యాక్సీల్లో మహిళలు స్వేచ్ఛగా ప్రయాణించేలా ఐవోటీ పరికరాలు అమరుస్తారు.
జీపీఎస్ పరికరాలు కలిగిన ఈ బాక్సుపై ‘పానిక్’ బటన్ ఉంటుంది. వేధింపులు ఎదుర్కొనే మహిళలు దీన్ని నొక్కిన వెంటనే కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సమాచారం చేరవేసి అప్రమత్తం చేస్తుంది. వాహనం ఎక్కడ ప్రయాణిస్తుందనే సమాచారాన్ని చేరవేస్తుంది. పానిక్ బటన్ నొక్కకున్నా ప్రతి 20 సెకన్లకు వాహనం కదలికలు కంట్రోల్ రూంకు చేరతాయి. ఐవోటీ బాక్స్ పక్కన క్యూఆర్ కోడ్ షీటు కూడా ఉంటుంది. అభయ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఐవోటీ బాక్స్ పక్కన ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసినా ప్రయాణించే వాహనం ఎటు వైపు వెళుతుందో, ఎక్కడుందో తెలుస్తుంది.
విజయవాడ, విశాఖలో ప్రయోగాత్మక పరీక్ష
‘అభయ’ ప్రాజెక్టు ద్వారా మహిళలకు పూర్తి భద్రత కల్పిస్తాం. 22 ఐటీ కంపెనీలు ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లలో పాల్గొన్నాయి. ఈనెల 20న టెండర్లు ఖరారు చేస్తాం. ఎంపికైన సంస్ధ విజయవాడ, విశాఖపట్టణంలలో ఆటోలపై ప్రయోగాత్మకంగా అమలు చేసి చూపాలి.
– ఎం.పురేంద్ర (రవాణాశాఖ ఐటీ విభాగం డిప్యూటీ కమిషనర్)
రాష్ట్రంలో ఆపరేషన్ ‘అభయ’
Published Tue, Aug 7 2018 4:12 AM | Last Updated on Tue, Aug 7 2018 5:21 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment