సాక్షి, మచిలీపట్నం : సార్.. రోడ్డు పక్కన ఒక మృతదేహం రక్తపు మడుగులో ఉంది.. ఏదైనా వాహనం ఢీకొట్టిందో.. ఎవరైనా చంపేసి పడేశారో.. అంతా అయోమయంగా ఉంది.. అంటూ ఎస్.ఐ. తన పైఅధికారికి ఫోన్‌లో సమాచారం అందించారు.
ఎందుకయ్యా అంత టెన్షన్ పడతావ్.. 174 కేసు కట్టు.. శవాన్ని పోస్టుమార్టానికి పంపించి.. పంచనామా నిర్వహించు.. దర్యాప్తులో అతడు ఎలా చనిపోయిందీ తెలుసుకుని కేసు సెక్షన్ మార్పుచేస్తే సరిపోతుంది.. అంటూ ఆ అధికారి ముక్తాయింపు.
..ఇది పోలీస్ శాఖలో మృతుల కేసుల నమోదులో తరచు జరుగుతున్న రచ్చ. అనేక మరణాలపై మిస్టరీ వీడకపోవడంతో ఏం చేయాలో పాలుపోని పోలీస్ శాఖకు ఐపీసీ సెక్షన్ 174 (అనుమానాస్పద మృతి) అభయ అస్త్రంగా ఉపయోగపడుతోంది. మృతికి కారణాలు తెలియకపోయినా.. సంఘటన జరిగిన తీరు కాస్త క్లిష్టంగా మారినా ఏమాత్రం కంగారుపడకుండా పోలీస్ తంత్రం పనిచేస్తోంది. ఇలా ప్రతిదానికీ అదే తారకమంత్రంగా మారిపోయింది.
జిల్లాలో ఈ తరహా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అనేక ఒత్తిళ్ల నేపథ్యంలో పోలీసులు సైతం పలు కేసులను అనుమానాస్పద మృతిగా నమోదుచేసి అప్పటికప్పుడు తాత్కాలికంగా తమ పని అయిందనిపిస్తున్నారు. తీరా ఆ తరహా కేసులను అటుతరువాత పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసే అవకాశం ఉండడం లేదు. ఫలితంగా అనుమానాస్పద మరణాల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించడంలో పోలీసులు విఫలమవుతున్నారని చెప్పక తప్పదు.
కొన్ని కేసుల్లో బంధువులు రోడ్డెక్కి ఆందోళన చేస్తే పోలీసులు విచారణ చేసి ఐపీసీ 174 కేసులను హత్య కేసుగానో, ప్రమాద మరణంగానో, ఆత్మహత్యగానో నిగ్గు తేల్చుతున్నారు. చాలా అనుమానాస్పద కేసుల్లో అడిగే నాథుడు లేకపోవడంతో పోలీసులు వాటిపై శ్రద్ధ చూపడంలేదన్న అపవాదు కూడా ఉంది.
అనుమానాలెన్నో..
జిల్లాలో గత ఏడాది నమోదైన అనుమానాస్పద మృతి కేసులను నిశితంగా గమనిస్తే ఎన్నో అనుమానాలు కలుగుతాయి. నేరుగా ఆత్మహత్యలు చేసుకున్న కేసుల్లో సైతం లోతుగా దర్యాప్తు చేస్తే అందుకు పురిగొల్పిన కారణాలు కనిపిస్తాయి. అనేక మృత్యు ఘటనలను తరచిచూస్తే కేసుల్లో కీలక ఆధారాలు దొరుకుతాయి.
అలాంటి కేసులను కొన్నింటిని చూద్దాం...
జనవరి 3న పెనుగంచిప్రోలు మండలం వెంకటాపురంలో త్రివేణి అనే యవతి ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై అనేక అనుమానాలున్నాయి.
జనవరి 24న మచిలీపట్నంలో గర్భిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
జనవరి 28న కంకిపాడులో ఓ యువకుడు ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది.
జనవరి 29న పెనమలూరులోని సనత్‌నగర్‌లో పనికి వెళ్లిన వీరాచారి అనుమానాస్పద స్థితిలో శవమయ్యాడు.
తిరువూరు ప్రాంతంలో ఫిబ్రవరి 26న ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
మార్చి 28న బంటుమిల్లి మండలం నాగేశ్వరరావుపేటలో బోగిన వీరమ్మ (13), మార్చి 30న ముదినేపల్లి మండలం గురజ దళితవాడలో పులవర్తి రమేష్ (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
ఏప్రిల్ 1న పెదపారుపూడిలో వెంకటలక్ష్మి మృతి చెందగా.. దీనిపై అనుమానాలున్నాయంటూ కుటుంబసభ్యులు ఆందోళనకు దిగడంతో ఎస్పీ జె.ప్రభాకరరావు ఆదేశాల మేరకు అప్పటి ఏఎస్పీ షెముశీ బాజ్‌పాయ్ ఏప్రిల్ 3న విచారణ నిర్వహించారు.
విస్సన్నపేట పోలీస్ క్వార్టర్‌లో కానిస్టేబుల్ భార్య మే 9న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
జూన్ 1న నూజివీడులో కట్నం వేధింపులకు అరెళ్లి శ్రీదేవి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణంపైనా అనుమానాలున్నాయి.
మే 23న ఇంజనీర్ సోమశేఖర్ పెడనలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బందరుకు చెందిన అతడు దాదాపు పది కిలోమీటర్ల దూరంలోని పెడన బైపాస్ రోడ్డు ప్రాతంలో శవమై కనిపించిన తీరుపై అనేక అనుమానాలున్నాయి. లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు హత్యకేసుగా నమోదు చేశారు. ఇలా చెబుతూపోతే జిల్లాలో అనేక అనుమానాస్పద మరణాల వెనుక ఏదో ఒక మిస్టరీ దాగి ఉంటోంది.
అన్నింటా అదే తంత్రం
Published Thu, Jan 16 2014 6:20 AM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM
Advertisement
Advertisement