ఉత్కంఠ రేకెత్తించింది.. ఉత్త రేకులే
‘పెట్టె లోపల ఏముందో? బంగారమే ఉందో? వజ్రైవె ఢూర్యాలే ఉన్నాయో?’.. గత నెల 17 నుంచీ కుతూహలంతో ఎదురు చూసిన లక్షలాదిమంది చివరికి ‘ఓస్ ఇంతేనా!’ అనుకోవలసి వచ్చింది. పాడుబడ్డ ఇంటిని తొలగిస్తుండగా బయటపడ్డ భారీ ఇనప్పెట్టెను శుక్రవారం తెరిచి చూడగా దాని అరల్లో కొన్ని పాత ఇనుపరేకులు మాత్రమే ఉన్నాయి.
⇒ నరేంద్రపురంలో నెలక్రితం పాత ఇంటిలో బయల్పడ్డ ఇనప్పెట్టె
⇒నిధులు ఉన్నాయన్న ప్రచారంతో జనంలో విపరీతమైన ఆసక్తి
⇒పోలీసుల సంరక్షణలో ఉన్న పెట్టెను శుక్రవారం తెరచిన అధికారులు
⇒తుప్పు పట్టిన ఇనుప రేకులే ఉండడంతో తుస్సుమన్న కుతూహలం
నరేంద్రపురం (పి.గన్నవరం): నరేంద్రపురం శివాలయం వీధిలో పాడుబడ్డ ఇంటిలో విషసర్పాలు సంచరిస్తుండటంతో యజమాని అంగీకారంతో ఇంటిని తొలగిస్తుండగా గత నెల 17న ఇనుపపెట్టె బయటపడింది. తాళం వేసి ఉన్న ఆ పెట్టెలో నిధి, నిక్షేపాలు ఉంటాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ ఇంటి యజమాని భూస్వామి కావడంతో ఆ ప్రచారానికి బలం చేకూరింది. పెట్టె గురించి పత్రికల్లో వచ్చిన కథనాలతో నరేంద్రపురం, పరిసర గ్రామాల్లోనే కాక ఇతర ప్రాంతాల్లోనూ, చివరికి విదేశాల్లో ఉంటున్న ఈ ప్రాంతానికి చెందిన వారిలోనూ ఆసక్తి పెరిగింది. పెట్టెలో ఏముందో తెలుసుకోవాలన్న ఆసక్తితో దాన్ని తెరిచే రోజు కోసం ఎదురు చూశారు.
ఇప్పటి వరకూ పోలీసుల సంరక్షణలో ఉన్న ఆ పెట్టెను శుక్రవారం కలెక్టర్ అనుమతితో తహశీల్దార్ ఎల్.జోసెఫ్, ఎస్సై జి.హరీష్‌కుమార్‌లు ఇంటి యజమాని వారసుడు ఈమని రామ జగన్నాథశాస్త్రి, గ్రామస్తుల సమక్షంలో కట్టర్ సాయంతో తెరిపించారు. లోపల ఉన్న సీక్రెట్ లాకర్లను తీయగా కొన్ని పాత ఇనుపరేకులు మాత్రమే కనిపించాయి. పెట్టెను తెరవనున్న విషయం తెలిసి వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనం అక్కడికి చేరుకున్నారు. వారిని పోలీసులు నియంత్రించ వలసి వచ్చింది.
పెట్టెను తెరుస్తుండగా చూడాలన్న ఆరాటంతో కొందరు చేరువలోని బాత్‌రూమ్ పైకి ఎక్కారు. పెట్టె తెరుస్తున్న దృశ్యాలను పలువురు సెల్ ఫోన్లు, కెమేరాల్లో చిత్రీకరించారు. చివరికి ఇనుపరేకులే దర్శనమివ్వడంతో వారి ఉత్కంఠపై నీళ్లు జల్లినట్టయింది. కాగా తెరిచిన పెట్టెను పోలీస్ స్టేషన్‌కు తరలిస్తామని తహశీల్దార్ జోసెఫ్ విలేకరులకు చెప్పారు. కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చాక దానిని యజమానికి తిరిగి అప్పగిస్తామన్నారు. డిప్యూటీ తహశీల్దార్ దేవళ్ళ శ్రీనివాస్, ఆర్‌ఐ బొరుసు లక్ష్మణరావు, ఏఎస్సై ఎన్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.