- హెచ్‌ఆర్సీలో సీఎం కేసీఆర్ సోదరుడి కూతురు రమ్య ఫిర్యాదు
హైదరాబాద్: భూకబ్జాలు చేసి విచ్చలవిడిగా తవ్వకాలు చేపడుతున్నవారిపై తక్షణం చర్యలు తీసుకునేలా చూడాలని సీఎం కేసీఆర్ అన్న కూతురు రేగులపాటి రమ్య శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలోని మానవ హక్కుల కమిషన్(హెచ్‌ఆర్సీ)ను ఆశ్రయించారు.
కరీంనగర్ జిల్లా ఎలగందులలోని సర్వే నంబర్ 25లో ఉన్న తన మూడెకరాల భూమి పక్కన గల భూమిలో గోల్డ్‌మైన్ అనే కంపెనీ తవ్వకాలు చేపట్టి మట్టిని తన భూమిలో వేస్తోందని ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ తవ్వకాలను నిలిపివేయాలని కోరారు. సీఎంకు అతి సన్నిహితులు ఈ భూములను లీజుకు తీసుకోవడంతో అధికారులు తమ ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని వాపోయారు.
ఈ విషయంపై తన భర్తను సీఎం సన్నిహితులు బెదిరిస్తున్నారని, దీంతో తన భర్త ఆసుపత్రి పాలయ్యారని తెలిపారు. తనకు జరిగిన అన్యాయానికి పరిహారం అందేలా చూడాలని హెచ్‌ఆర్సీని కోరారు.