యూనివర్సిటీ :ఒక వ్యక్తి డిగ్రీ చదవడానికి ఎన్నో వ్యయప్రయాసలు ఎదుర్కొంటాడు. తల్లిదండ్రులు తమ బిడ్డలను చదివించడానికి అహర్నిశలు శ్రమిస్తారు. తన జీవిత కాలంలో కనీసం 15 ఏళ్లు కష్టపడి చదివితే వచ్చే ప్రతిఫలం డిగ్రీ సర్టిఫికెట్. కానీ ఎస్కేయూలోని అండర్ గ్రాడ్యుయేషన్ (యూజీ) విభాగం ఉద్యోగులు 15 సెకెన్లలోనే ఒక వి ద్యార్థిని పాస్ లేదా ఫెయిల్ చేయగలరు. వారి నిర్లక్ష్యం ఫలితంగా విద్యార్థులు రోడ్డున పడుతున్నారు.
దర్యాప్తు ప్రారంభించిన కమిటీ: యూజీ పరీక్షల అక్రమాలపై నిగ్గుతేల్చడానికి నియమించిన ప్రొఫెసర్ల కమిటీ దర్యాప్తును గురువారం ప్రారంభించింది. ఆచార్య బి.ఫణీశ్వరరాజు, ఆచార్య అక్తర్, ఆచార్య బి.కృష్ణారెడ్డిలు యూజీ పరీక్షల విభాగం ఉద్యోగులను విచారించారు. ప్రతి ఉద్యోగి వద్ద వివరాలు ఆరా తీశారు. ఏమి చెప్పాలనుకొన్నా వాటిని లిఖిత పూర్వకంగా రాసివ్వాలని కమిటీ ఆదేశించింది. శుక్రవారం లోపు అందరు ఉద్యోగులు పరీక్షల విభాగంలో తాము నెరవేర్చిన బాధ్యతల గురించి తెలియజేయనున్నారు. వచ్చే సోమవారం లోపు కమిటీ నివేదికను అందజేయనుంది.
నివ్వెరపోయిన కమిటీ సభ్యులు: విద్యార్థి సాధించిన మార్కులు పద్ధతి ప్రకారం నమోదు చేయకుండానే సర్టిఫికెట్లు జారీ చేశారని కమిటీ ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. ప్రతి విద్యార్థి మార్కుల వివరాలను డబుల్ ఎంట్రీ ద్వారా భద్రపరుస్తారు. పరీక్ష ఫీజు కట్టని విద్యార్థిని పాస్ చేసినట్లయితే ఆ ఎంట్రీ ఎర్రర్ అని చూపిస్తుంది. ఈ విధంగా ఎర్రర్ అని వచ్చినప్పటికీ ఎందుకు పాస్ అయినట్లు మార్కుల జాబితాలు జారీ చేశారో తెలపాలని కమిటీ ప్రశ్నించింది. తొందరగా ఫలితాలు ఇవ్వాలని నిర్ణయించుకోవడంతో తప్పిదాలు జరిగాయని ఉద్యోగులు బదులిచ్చినట్లు తెలిసింది. తాజా ఫలితాలలోనే లేక గతంలోనూ ఇదే విధంగా జరిగిందా? అనే అంశాలపై కమిటీ అధ్యయనం చేయనుంది.
సర్టిఫికెట్లలో పేర్లు గల్లంతు:ప్రొవిజనల్ సర్టిఫికెట్లలో వి ద్యార్థి పేరు, హాల్‌టికెట్ నెంబరు లేకుండానే 200 బీబీఎం మార్కుల జాబితాలు జారీ చేశారు. ఇంగ్లిష్ మీడియంలో పరీక్ష రాస్తే బీఏ తెలుగు మీడియంగా గుర్తించారు. ప్రతి రోజు వి ద్యా ర్థులకు జరిగిన అన్యాయాలు బయటకు వస్తున్నాయి. కమిటీ దర్యాప్తు చేస్తున్న కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి.
10లోపు రీవాల్యుయేషన్ ఫలితాలు లేనట్లే: గత నెల 18న డిగ్రీ ఫలితాలు విడుదల చేశారు. డిగ్రీలో సబ్జెక్టులు తప్పినవారు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేయడానికి ఈ నెల 3వరకు గడువు విధించారు. 10వ తేదీలోపు ఫలితాలు ప్రకటిస్తామని విద్యార్థుల సెల్‌ఫోన్‌లకు మెసేజ్‌లు పంపారు. కానీ ఇంతవరకు స్క్రిప్ట్‌లు తీయలేదు. కోడింగ్ చేయలేదు. దీంతో రీవాల్యుయేషన్ ఫలితాలు మరింత ఆలస్యమయ్యే సూచనలున్నాయి.
తవ్వేకొద్దీ అక్రమాలు
Published Fri, Jul 10 2015 2:53 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM
Advertisement
Advertisement