పూడికతీత పనుల్లో అక్రమాలు
- ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్
చీమకుర్తి : చెరువు పూడిక తీత పనులను అడ్డంపెట్టుకొని అధికార పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటున్నారని సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. ఒంగోలులోని తన కార్యాలయంలో ఆది వారం ఆయన సాక్షితో మాట్లాడారు. నీరు-చెట్టు కార్యక్రమం కింద చేపట్టిన చెరువుల పూడికతీత పనుల్లోని అవకతవకలను ఆయన బహిర్గతం చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో మూడు దశల్లో చెరువుపూడిక తీత పనులకు రూ. 27.5 కోట్లు మంజూరు కాగా వాటిలో సంతనూతలపాడు నియోజకవర్గానికి రూ.3.77 కోట్లు మంజూరైనట్లు తెలిపారు.
గ్రామాల్లోని జన్మభూమి కమిటీల్లో సర్పంచ్‌తో సహా మెజారిటీ సభ్యులు తీర్మానం చేసి చెరువు పూడికతీత పనులను చేపట్టాల్సి ఉంటే వైఎస్‌ఆర్‌సీపీ సర్పంచ్ ఉన్న గ్రామాల్లో సర్పంచ్ సంతకంతో సంబంధం లేకుండానే జన్మభూమి కమిటీ సభ్యులు నలుగురు కలిసి తీర్మానాలు ఇచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 5 లక్షలు దాటితో చేసే పనులకు టెండర్‌లను పిలవాల్సి ఉంటే చెరువుల పూడిక తీత పనులలో కొన్ని చెరువుల్లో రూ.10 లక్షలు, మరికొన్ని చెరువులలో రూ. 15 లక్షలతో చేస్తున్నా ఎలాంటి టెండర్లను పిలవకుండా ఇష్టానుసారంగా చేసుకుంటుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇనమనమెళ్ళూరులో రూ. 15 లక్షలతో చేపట్టిన చెరువు పూడికతీతపనులలో ఎలాంటి టెండర్‌లు లేకుం డా కేవలం నామినేషన్ పద్ధతిలో అధికారులు స్థానిక పార్టీ కార్యకర్తలకు కట్టబెట్టారని ఉదాహరణలతో సహా వివరించారు.
‘ఉపాధి’ గుంతలతో బిల్లుల డ్రా
ఉపాధి కూలీలు చెరువులలో తీసిన పాత గుంతలనే నీరు-చెట్టు కార్యక్రమంలో చెరువుల పూడికతీత పనుల్లో చూపించి బిల్లులను డ్రాచేసుకుంటున్నారని ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. మరికొన్నిచోట్ల వర్క్ ఎస్టిమేషన్ లేకుండానే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కాకుండా అధికారుల పర్యవేక్షణ లేకుండా పూడికతీత పనులను ప్రారంభించారన్నారు. నిలదీసిన అధికారులను బదిలీల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు.