ప్రతి ఎకరాకూ నీరిస్తాం | Irrigation Advisory Board Meeting Held In Kurnool | Sakshi
Sakshi News home page

ప్రతి ఎకరాకూ నీరిస్తాం

Published Wed, Oct 2 2019 10:58 AM | Last Updated on Wed, Oct 2 2019 11:03 AM

Irrigation Advisory Board Meeting Held In Kurnool - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, చిత్రంలో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, శాసనమండలి విప్‌ గంగుల ప్రభాకర్‌రెడ్డి,  కలెక్టర్‌ వీరపాండియన్‌

సాక్షి, కర్నూలు సిటీ: జిల్లాలో వివిధ కాలువల కింద సాగు చేసిన ప్రతి ఎకరా పంటకూ నీరిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ అధ్యక్షతన సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశం నిర్వహించారు. మంత్రులతో పాటు ప్రభుత్వ విప్‌ గంగుల ప్రభాకర్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. బుగ్గన మాట్లాడుతూ దేవుడి దయవల్ల ఈ ఏడాది వర్షాలు బాగా రావడంతో రాయలసీమ జిల్లాల్లోని సాగునీటి ప్రాజెక్టులకు నీరు సమృద్ధిగా చేరిందన్నారు. కర్నూలు జిల్లాలోని కేసీ, ఎల్‌ఎల్‌సీ, తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ కాలువల కింద, ఎత్తిపోతల పథకాల పరిధిలో సాగు చేసిన ఆయకట్టుకంతా పూర్తి స్థాయిలో నీరు ఇచ్చేందుకు అవకాశం కల్గిందన్నారు.

నీటి నియంత్రణ వ్యవస్థపై ఇంజినీర్లు రెగ్యులర్‌గా మానిటరింగ్‌ చేస్తూ.. ఏ ఒక్క ఎకరం పంట ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే రైతులు లాభసాటి పంటలను సాగు చేసుకునే విధంగా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. హంద్రీ–నీవా, తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ ద్వారా గ్రావిటీపై అవకాశమున్న అన్ని చెరువులను నింపాలన్నారు. హంద్రీనీవా పరిధిలోని ఎన్ని చెరువులకు నీరు ఇచ్చేందుకు అవకాశం ఉంటే అన్నింటికీ ఇస్తున్నట్లు తెలిపారు.  హంద్రీ–నీవా నుంచి గాజులదిన్నె ప్రాజెక్టుకు నాలుగు టీఎంసీల నీరు ఇచ్చేందుకు ఉద్దేశించిన ఫైల్‌పై ఇటీవలే సంతకం చేశానని, త్వరలోనే అనుమతులు వస్తాయని తెలిపారు.

జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న చెరువులు, కాల్వలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో ఒక పద్ధతి అంటూ లేకుండా పనులు చేపట్టి.. ఏ ఒక్కదాన్నీ పూర్తి చేయలేకపోయారన్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అవసరమైన వాటికి రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా పనులు చేపడుతున్నామన్నారు. రాయలసీమ జిల్లాల్లో కరువుకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నామన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి 44 వేల క్యూసెక్కుల నీటిని డ్రా చేసి సరికొత్త సరికార్డు సృష్టించామన్నారు.  

పోతిరెడ్డిపాడు సామర్థ్యం 80 వేల క్యూసెక్కులకు పెంపు! 
రాయలసీమ జిల్లాలకు తక్కువ రోజుల్లోనే ఎక్కువ నీటిని డ్రా చేసుకునేందుకు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ను 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యానికి విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారని సీఈ నారాయణరెడ్డి తెలిపారు. ఈ నీటిని బానకచర్ల దగ్గర ఏయే కాలువలకు ఎంత మేర ఇచ్చేందుకు అవకాశం ఉంది? ఏ మేరకు విస్తరించాలనే అంశంపై అధ్యయనం చేయనున్నామని తెలిపారు. అలాగే తుంగభద్రపై గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించిందని, ఇటీవల సీఎం సైతం గుండ్రేవుల తన మదిలో ఉందని చెప్పారని సీఈ గుర్తు చేశారు.

7.38 లక్షల ఎకరాలకు సాగునీరు  
జిల్లాలోని వివిధ కాలువలు, లిఫ్ట్‌ల పరిధిలో 7,38,036 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ఐఏబీ సమావేశంలో తీర్మానించారు. శ్రీశైలం జలాలపై ఆధారపడి ఉన్న తెలుగుగంగ కాలువకు లైనింగ్‌ చేస్తేనే పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు నీటిని తీసుకునేందుకు అవకాశం ఉంటుందని మండలి విప్‌ గంగుల ప్రభాకర్‌రెడ్డి సమావేశం దృష్టికి తెచ్చారు. దీని కింద 1,03,700 ఎకరాలకు పూర్తి స్థాయిలో నీరు ఇవ్వాలని కోరారు. కేసీ కెనాల్‌ కింద కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాల పరిధిలో 2,65,628 ఎకరాలకు నీరు ఇవ్వాలని, అవసరమైన మేరకు మల్యాల, ముచ్చుమర్రి, బానకచర్ల నుంచి వాడుకోవాలని నిర్ణయించారు. ఎల్‌ఎల్‌సీ కింద ఖరీఫ్‌లో 27,044 ఎకరాలకు నీరు ఇవ్వాలని తీర్మానించారు. అలాగే లిఫ్ట్‌ స్కీమ్‌ల కింద 17,726 ఎకరాలు, ఎస్‌ఆర్‌బీసీ కింద 1,45,627 ఎకరాలు, హంద్రీనీవా కింద 31 వేల ఎకరాలు, ఆలూరు బ్రాంచ్‌ కెనాల్‌ కింద 6 వేల ఎకరాలు, గురురాఘవేంద్ర ప్రాజెక్టు పరిధిలో 66,815 ఎకరాలకు, శివ భాష్యం సాగర్‌ కింద 5,350 ఎకరాలు, ఏపీఎస్‌ఐడీసీల కింద 59,146 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని సమావేశంలో తీర్మానించారు. సమావేశంలో బద్వేలు ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య, ఎస్‌ఈలు శ్రీరామచంద్రమూర్తి, శ్రీనివాసరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భరత్‌కుమార్‌రెడ్డి, ఈఈలు, డీఈఈలు పాల్గొన్నారు.

గుండ్రేవుల, వేదావతి ప్రాజెక్టులు చేపడతాం: గుమ్మనూరు 
జిల్లాలో అత్యంత వెనుకబడిన నియోజకవర్గం ఆలూరు అని, తమ నియోజకవర్గానికి వేదావతి ప్రాజెక్టు మంజూరయితే 80 వేల ఎకరాలకు నీరు అందుతుందని, దీంతో పాటు గుండ్రేవుల ప్రాజెక్టు, ఆర్డీఎస్‌ కుడి కాలువలను నిర్మించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. 2008లో శంకుస్థాపన చేసిన నగరడోణ రిజర్వాయర్‌ నిర్మాణం, హంద్రీనీవా నుంచి ఏబీసీకి తూము ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఇంజినీర్లకు సూచించారు.

తెలుగుగంగ, కేసీ కెనాల్‌ లైనింగ్‌ చేయాలి: గంగుల
తెలుగుగంగ, కేసీ కాలువలకు లైనింగ్‌ చేస్తే నీటి సామర్థ్యం పెరుగుతుందని, వాటిపై దృష్టి సారించాలని శాసనమండలి విప్‌ గంగుల ప్రభాకర్‌రెడ్డి సూచించారు. లైనింగ్‌ లేక తెలుగుగంగ కాల్వకు చిల్లులు పడినట్లు ఉండడంతో చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదన్నారు. తుండ్లవాగును పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

దృష్టి పెట్టకుంటే నీటి చావులే 
రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన పార్లమెంట్‌లోని పల్లెలపై దృష్టి పెట్టకుంటే నీటి కోసం చావులను చూడాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడతాయి. జలశక్తి అభియాన్‌ కింద కరువు ప్రాంతం కాకుండా నీరు ఉన్న ప్రాంతాలను అధికారులు ఎంపిక చేశారు. జిల్లాలో 96 కి.మీ ప్రవహిస్తున్న తుంగభద్ర నది నీటిని నిల్వ చేసుకునేందుకు తగినన్ని రిజర్వాయర్లు లేవు. ఫలితంగా ఈ ఏడాది 178 టీఎంసీల నీరు దిగువకు వెళ్లిపోయింది. స్టోరేజీకి గుండ్రేవుల ప్రాజెక్టును నిర్మించాలి. ఎన్నికల సమయంలో ఏ పల్లెకు పోయినా నీటి కష్టాలను చూసి కళ్లలో నీళ్లు తిరిగాయి.  
– డా.సంజీవ్‌కుమార్, కర్నూలు ఎంపీ

చెక్‌డ్యాంలు నిర్మించాలి 
కుందూ నది పరివాహక ప్రాంతాల్లో చెక్‌డ్యాంలు నిర్మించి వృథా నీటిని సద్వినియోగం చేసుకునే విధంగా చూడాలి. నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని ఆయకట్టుకు సాగు నీరు అందడం లేదు. పోతిరెడ్డిపాడు ద్వారా బానకచర్ల నుంచి ఎక్కువ మొత్తంలో నీటిని విడుదల చేయడం వల్ల రైతుల పంటపొలాలు నీటమునిగి నష్టపోయారు. వారిని ఆదుకుని మున్ముందు పంటలు ముంపునకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలి. 
– పోచా బ్రహ్మానందరెడ్డి, నంద్యాల ఎంపీ

జిల్లా అవసరాలు తీరిన తరువాతే ఇతరులకు.. 
జల వనరుల శాఖ పరిధిలోని పనులు పూర్తి కాలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్లపై ఇంజినీర్లు చర్యలు తీసుకోవాలి. వెలుగోడు రిజర్వాయర్‌ వద్ద వన్‌ఆర్, వన్‌ఎల్‌ల ఎత్తును తగ్గించాలి. లేకపోతే చిన్న లిఫ్ట్‌ స్కీమ్‌లైనా ఏర్పాటు చేయాలి. ముందుగా జిల్లా రైతులకు నీరిచ్చిన తరువాతే ఇతరులకు ఇవ్వాలి. శివభాష్యంకు నీటి మళ్లింపుపై స్టడీ చేసి నీరు ఇచ్చేందుకు అవకాశం ఉన్న మార్గాలను చూడాలి. 
– శిల్పా చక్రపాణిరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే

ఎల్‌ఎల్‌సీ నీటితో చెరువులను నింపాలి 
తుంగభద్ర దిగువ కాలువ పరిధిలోని చెరువులన్నింటికీ కూడా నీరు నింపాలి. కాలువకు పూర్తి స్థాయిలో లైనింగ్‌ చేయకుంటే నీటి ప్రవాహానికి ఇబ్బందులు వస్తాయి. నీరు తక్కువగా వస్తుంది. ఎక్కువ నీటిని తెచ్చుకునేందుకు చర్యలు తీసుకోవాలి. చాలా ఏళ్లుగా పైపులైన్‌ ప్రతిపాదనలు ఉన్నా ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు.  
– సాయిప్రసాద్‌ రెడ్డి, ఆదోని ఎమ్మెల్యే 

హంద్రీనీవా నీరు అందడం లేదు
పత్తికొండ నియోజకవర్గంలోనే హంద్రీనీవా నీరు వెళుతున్నా తమ ప్రాంతానికి మాత్రం సాగు నీరు అందడం లేదు. ఇంతవరకు పందికోన ఎడమ కాలువ, డిస్ట్రిబ్యూటరీలే పూర్తి కాలేదు. కృష్ణగిరి రిజర్వాయర్‌ కింద కూడా పూర్తి స్థాయిలో నీరు అందడం లేదు. ఎడమ కాలువ పరిధిలో ఇంతవరకు బ్రిడ్జిలు పూర్తి చేయలేదు. హంద్రీనీవా నీరు  అన్ని చెరువుల్లో సాధ్యమైన మేరకు నింపాలి. 
– కంగాటి శ్రీదేవి, పత్తికొండ ఎమ్మెల్యే

ఎస్‌ఆర్‌బీసీని బలోపేతం చేయాలి 
ఎస్‌ఆర్‌బీసీకి ఎప్పుడు నీరు వచ్చినా కట్ట ఎక్కడ తెగిపోతుందోననే ఆందోళన ఉంది. దీన్ని బలోపేతం చేయాలి. గాలేరు నుంచి తిమ్మనాయిని పేట చెరువుకు లిఫ్ట్‌ మంజూ రైంది. అయితే అనుమతులు రాలేదు. ఎస్‌ఆర్‌బీసీ కాలువకు పెరసోముల వద్ద 20 వేల క్యుసెక్కుల నీరు వస్తేనే చెరువుకు చేరేలా స్లూయిజ్‌ ఏర్పాటు చేశారు. ఇంతవరకు 20 వేల క్యుసెక్కుల నీరు రాకపోవడంతో నిర్మించినా వృథాగానే ఉంది. స్లూయిజ్‌ ఎత్తు తగ్గించాలి. 
– కాటసాని రామిరెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే

రాంపురం ఛానల్‌ను అభివృద్ధి చేయాలి 
మంత్రాలయం నియోజకవర్గ పరిధిలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన రాంపురం ఛానల్‌ను అభివృద్ధి చేయకపోవడంతో 3వేల ఎకరాలకు సాగు నీరు అందడం లేదు. ఈ ఛానల్‌కు మరమ్మతులు చేయాలి. ఆర్డీఎస్‌ కుడి కాలువ నిర్మిస్తే 4 టీఎంసీల నీటిని వాడుకునేందుకు అవకాశం ఉంది. గురురాఘవేంద్ర ప్రాజెక్టు పరిధిలోని స్కీంలలో పని చేస్తున్న ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేదు. అధికారులు స్పందించి వేతనాలు ఇప్పించండి.
 – బాలనాగిరెడ్డి, ఎమ్మెల్యే మంత్రాలయం

చివరి ఆయకట్టుకు నీరు ఇవ్వాలి 
తెలుగుగంగ కాలువ చివరి ఆయకట్టుకు సక్రమంగా నీరు అందడం లేదు. నాలుగో బ్లాకుకు ఇబ్బందిగా ఉంది. 29వ బ్లాకు పరిధిలోని 10 వేల ఎకరాలకు నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చాగలమర్రి మండలాల పరిధిలో ఇంకా 1500 ఎకరాలు వరద ముంపునకు గురయ్యాయి. 
– గంగుల బిజేంద్రారెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే

ఇంజినీర్లు పట్టించుకోవడం లేదు 
కర్నూలు నియోజకవర్గంలో ఆయకట్టు లేదనే కారణంతో జల వనరుల శాఖ ఇంజినీర్లు పట్టించుకోవడం లేదు. జొహరాపురం వద్ద బ్రిడ్జి పనులు పూర్తికాకపోవడంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. కేసీ కాల్వ కు పెన్సింగ్‌ సక్రమంగా లేకపోవడంతో ఏటా ఈతకు వెళ్లి పిల్లలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. హంద్రీనీవా 110 కి.మీ దగ్గర స్లూయిజ్‌ ఏర్పాటు చేసి జీడీపీకి 4 టీఎంసీల నీరు ఇచ్చేటట్లు చర్యలు తీసుకోవాలి. 
– హఫీజ్‌ఖాన్, కర్నూలు ఎమ్మెల్యే

ముచ్చుమర్రి లిఫ్ట్‌ను కేసీ పరిధిలోకి తేవాలి 
నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని పగిడ్యాల, నందికొట్కూరు, జూపాడుబంగ్లా 30 వేల ఎకరాలకుపైగా ఆయకట్టు ఉంది. సుంకేసుల బ్యారేజీ నుంచి నీటి విడుదల నిలిచి పోతే నీటిని ముచ్చుమర్రి నుంచి వాడుకునేందుకు అవకాశం ఉంది. అయితే హంద్రీనీవా సీఈ అనుమతులు లేనిదే ఇవ్వలేమని ఇంజినీర్లు చెబుతుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ముచ్చుమర్రిని కేసీ డివిజన్‌ పరిధిలోకి తీసుకొచ్చి రైతులను ఆదుకోవాలి.   
– టి.ఆర్థర్, నందికొట్కూరు, ఎమ్మెల్యే

హంద్రీనీవా విషయంలో జిల్లాకు అన్యాయం 
హంద్రీనీవా నీటి విషయంలో జిల్లాకు మొదటి నుంచి అన్యాయం జరుగుతోంది. కళ్ల ముందే నీరు పోతున్నా కాల్వ పక్కనే ఉన్న చెరువులను కూడా ఇంజినీర్లు నింపడం లేదు. ఎన్ని సార్లు చెప్పినా స్పందించడం లేదు. వెలగమాను డ్యాంకు 11 ఏళ్లుగా సాగు నీరు ఇవ్వలేకపోతున్నారు. ఎస్‌ఆర్‌బీసీ కాలువలకు స్లూయిజ్‌లు ఏర్పాటు చేసి చెరువులన్నింటినీ నింపాలి.           
– కాటసాని రాంభూపాల్‌రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement