ఇరిగేషన్ డీఈ అరెస్ట్ | Irrigation DE arrest | Sakshi
Sakshi News home page

ఇరిగేషన్ డీఈ అరెస్ట్

Published Fri, Nov 21 2014 2:20 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

Irrigation DE arrest

నెల్లూరు (క్రైమ్): నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగం పొందిన ఇరిగేషన్ డీఈ తలమంచి గంగాధర్‌ను గురువారం నాల్గో నగర పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు తోటపల్లి గూడూరు మండలం కోవెరపాళేనికి చెందిన గంగాధర్ జంగం కులస్తుడు. అయితే బుడగజంగంకు చెందిన వ్యక్తిగా ఎస్సీ కులధ్రువీకరణ పత్రం పొంది ఇంజనీరింగ్ పూర్తి చేశారు.

1989లో ఇరిగేషన్‌శాఖలో ఉద్యోగం పొంది ప్రస్తుతం రాపూరు తెలుగుగంగ ప్రాజెక్టులో డీఈగా పని చేస్తున్నారు. మాగుంట లేఅవుట్ ధీరజ్ హైట్స్ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నాడు. తన పిల్లలను సైతం నకిలీ కులధ్రువీకరణ పత్రాల ద్వారానే బీటెక్ చదివిస్తున్నాడు. గతేడాది ఈ కుటుంబ వ్యవహారంపై కలెక్టర్ శ్రీకాంత్‌కు ఫిర్యాదులు అందాయి. ఆయన రెవెన్యూ అధికారులను విచారణకు ఆదేశించారు.

విచారణలో నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగం పొందాడని నిర్ధారణ అయింది. దీంతో డీఈ, అతనిపిల్లలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నెల్లూరు తహశీల్దార్ పి. జనార్దన్‌రావును కలెక్టర్ ఆదేశించారు. ఆగస్టులో నాల్గోనగర పోలీసులు తహశీల్దార్ ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి డీఈని నాల్గో నగర ఎస్‌ఐ డి. వెంకటేశ్వరరావు అరెస్ట్ చేశారు. గురువారం కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు కులధ్రువీకరణ పత్రాలిచ్చి అధికారులను సైతం పోలీసులు విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే అప్పటి ఆర్డీఓ, తహశీల్దార్లు పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కాల్సి వస్తుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement