Fake caste certificates
-
పరారీలో ముఖేష్ కుమార్
సాక్షి, హైదరాబాద్: భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్, అర్జున్ అవార్డు గ్రహీత ముఖేష్ కుమార్‌పై కేసు నమోదు అయింది. నకిలీ కుల ధ్రువీకరణ పత్రం పొందినందుకు గాను అతనిపై హైదరాబాద్ బోయినపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు వారాల క్రితమే అతనిపై కేసు నమోదు చేసినప్పటికీ ఆ విషయం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బోయినపల్లి సీఐ రాజేశ్ మాట్లాడుతూ.. ‘ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగం కోసం ముఖేష్ పలు పత్రాలు సమర్పించారు. వాటిపై విచారణ జరపగా.. అతడు నకిలీ పత్రాలతో కుల ధ్రువీకరణ పత్రం పొందినట్టు వెల్లడైంది. దీంతో రెండు వారాల క్రితం ముఖేష్‌పై కేసు నమోదు చేశాం. మూడు రోజులుగా ముఖేష్ పరారీలో ఉన్నారు.. అతని కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపడుతున్నాం. ముఖేష్‌తో పాటు అతని తమ్ముడిపైన కూడా కేసు నమోదు చేశామ’ని తెలిపారు. కాగా, కెరీర్లో 307 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ముఖేష్ 80 గోల్స్ చేశాడు. -
బోగస్ కులధ్రువీకరణ పత్రాలపై విచారణ
రాజవొమ్మంగి (రంపచోడవరం): మండలంలో రెండో రోజైన శనివారం కులధ్రువీకరణ పత్రాలపై సమగ్ర విచారణ జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రాజవొమ్మంగి తహసీల్దార్ కార్యాలయం ద్వారా మంజూరైన 7,209 కులధ్రువీకరణ పత్రాల్లో అనేకం బోగస్‌వి ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ సంబంధిత రెవె న్యూ అధికారులకు ఈ నెల 15న ప్రజా ప్రతిఘటన ఎదురైన సంగతి విదితమే. అనర్హులకు కులధ్రువీకరణ పత్రాలు ఇచ్చారంటూ రాజవొమ్మం గిలో జరిగిన ఉద్యమానికి స్పందించిన జేసీ మల్లి కార్జున, ఐటీడీఏ పీఓ నిషాంత్ కుమార్ విచారణకు ఆదేశించారు. కులధ్రువీకరణ పత్రాలపై రాజవొమ్మంగి మండలంలోని పలు పంచాయతీల్లో తొలి రోజు జరిగిన గ్రామసభల్లో ప్రజల నుంచి ఒక్క అభ్యంతరం కూడా రాలేదు. అయితే రెండో రోజు రాజవొమ్మంగి, కొండపల్లి, వాతంగి గ్రామాల్లో జరిగిన గ్రామసభల్లో లిఖిత పూర్వక అభ్యంతరాలు వచ్చాయి. రాజవొమ్మంగి పం చాయతీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం జరిగిన విచారణలో ఆదివాసీ సంక్షేమ సంఘం నేత కంచెం బాబూరావు నేతృత్వంలో పలువురు ఆదివాసీలు విచారణాధికారిగా వచ్చిన సామర్లకోట తహసీల్దార్ శివకుమార్‌కు లిఖితపూర్వకంగా అభ్యంతరాలను అందజేశారు. వీటిని పరిగణనలోకి తీసుకొని సోమవారం నుంచి ఆయా గ్రామాల్లో ఈ బోగస్ కులధ్రువీకరణ పత్రాలపై ఇంటింటికీ వెళ్లి ప్రజల సమక్షంలో విచారణ నిర్వహిస్తామని విచారణాధికారులు తెలిపారు. విచారణ ఇలా... కిర్రాబులో 275, శరభవరంలో 389, రాజవొమ్మంగిలో 332 కులధ్రువీకరణ పత్రాలపై తహసీల్దార్ శివకుమార్ విచారణ చేపట్టారు. అలాగే కొండపల్లిలో 238, అమీనాబాద్‌లో 68, వాతంగిలో 625 కులధ్రువీకరణ పత్రాలపై చింతూరు తహసీల్దార్ పి.తేజేశ్వరరావు విచారణ నిర్వహించి, కొండపల్లిలో 7, వాతంగిలో 3 లిఖిత పూర్వక అభ్యంతరాలు వచ్చాయని వెల్లడించారు. పెద్దాపురం తహసీల్దార్ జి.బాలసుబ్రహ్మణ్యం లబ్బర్తిలో 138 పత్రాలపై విచారణ చేపట్టగా ఒక లిఖిత పూర్వక అభ్యంతరం అందినట్లు చెప్పారు. లాగరాయిలో 119 పత్రాలపై విచారణ జరిగింది. ఈ గ్రామంలో మంజూరైన 3 కొండకాపు, ఒక కోయదొర సర్టిఫికెట్లు బోగస్ అంటూ ఆదివాసీల నుంచి లిఖితపూర్వక అభ్యంతరాలు అందాయని బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. వీటిపై కూడా మరో రెండు రోజుల్లో విచారణ చేస్తామన్నారు. ప్రత్తిపాడు తహసీల్దార్ కె.నాగమల్లేశ్వరరావు చెరువుకొమ్ముపాలెంలో 212 సర్టిఫికెట్లపై విచారణ చేపట్టగా 12 బోగస్ ఉన్నాయంటూ ఫిర్యాదులు అందాయన్నారు. వంచంగిలో నిర్వహించిన విచారణ సభలో 470 కులధ్రువీకరణ పత్రాల వివరాలు వెల్లడించగా 7 పత్రాలపై ప్రజల నుంచి అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. గడుఓకుర్తిలో 322 పత్రాలను పరిశీలించగా ఇక్కడ అభ్యంతరాలు ఏవీ రాలేదన్నారు. -
ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేసిన హైకోర్టు
భువనేశ్వర్: ఒడిశా హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. 2014 ఎన్నికల్లో తప్పుడు కులధ్రువీకరణ పత్రాలు సమర్పించినందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగేశ్ కుమార్ సింగ్‌పై అనర్హత వేటు వేసింది. ఈ మేరకు మంగళవారం ఆదేశాలు వెలువరించింది. ఇది కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. 2014 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద సుందర్‌గఢ్ నియోజకవర్గం నుంచి జోగేశ్ గెలుపొందారు. ఇది ఎస్టీలకు రిజర్వు చేయబడిన నియోజకవర్గం. అయితే, జోగేశ్ గెలుపును సవాల్ చేస్తూ బీజేడీ అభ్యర్థి కుసుమ్ టెటే, బీజేపీ అభ్యర్థి సహదేవ్ జాజా ఒడిశా హైకోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జోగేశ్ సమర్పించిన కుల ధ్రువీకరణ పత్రం బూటకమైనదని, కావాలనే ఆయన ఎస్టీగా తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించారని, కాబట్టి ఆయనపై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలని హైకోర్టును అభ్యర్థించారు. హైకోర్టు తీర్పుపై జోగేశ్ స్పందిస్తూ.. న్యాయస్థానంపై తనకు పూర్తి నమ్మకముందని, త్వరలోనే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తానని ఆయన మీడియా తెలిపారు. -
‘నకిలీ కులం’పై జేసీ విచారణ
హన్మకొండ అర్బన్ : నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన ఆరోపణలు ఎదుర్కొంటున్న 12మంది ఉద్యోగులను జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్ శనివారం విచారించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు అందజేసిన వివరాలు, పత్రాలను పరిశీలిచిన జేసీ వాటిపై సమగ్ర విచారణ జరిపి ఈ నెలాఖరు నాటికి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అదేరోజు తదుపరి విచారణ ఉంటుందని తెలిపారు. అధికారుల విచారణలో తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్లు తేలితే వాటిని రద్దు చేయడంతో పాటు నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామని జేసీ పేర్కొన్నారు. కాగా, విచారణ కమిటీ ముందు మున్నూరుకాపు సంఘం రాష్ట్ర నాయకుడు వినయ్ తదితరులు హాజరై 25మంది ఉద్యోగులు తప్పుడు మున్నూరు కాపు కుల ధ్రువీకరణపత్రలతో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. ఈ మేరకు వారిని తొలగించి ఆ స్థానంలో అర్హులైన మున్నూరుకాపులకు అవకాశం కల్పించాలని కోరారు. విచారణలో డీఆర్వో శోభ, వరంగల్ ఆర్డీవో వెంకట మాధవరావు, తహశీల్దార్ రాజ్‌కుమార్, సూపరింటెండెంట్ విశ్వనారాయణ, ఈడీ నర్సింహస్వామి పాల్గొన్నారు. -
ఇరిగేషన్ డీఈ అరెస్ట్
నెల్లూరు (క్రైమ్): నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగం పొందిన ఇరిగేషన్ డీఈ తలమంచి గంగాధర్‌ను గురువారం నాల్గో నగర పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు తోటపల్లి గూడూరు మండలం కోవెరపాళేనికి చెందిన గంగాధర్ జంగం కులస్తుడు. అయితే బుడగజంగంకు చెందిన వ్యక్తిగా ఎస్సీ కులధ్రువీకరణ పత్రం పొంది ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 1989లో ఇరిగేషన్‌శాఖలో ఉద్యోగం పొంది ప్రస్తుతం రాపూరు తెలుగుగంగ ప్రాజెక్టులో డీఈగా పని చేస్తున్నారు. మాగుంట లేఅవుట్ ధీరజ్ హైట్స్ అపార్ట్మెంట్లో నివాసముంటున్నాడు. తన పిల్లలను సైతం నకిలీ కులధ్రువీకరణ పత్రాల ద్వారానే బీటెక్ చదివిస్తున్నాడు. గతేడాది ఈ కుటుంబ వ్యవహారంపై కలెక్టర్ శ్రీకాంత్‌కు ఫిర్యాదులు అందాయి. ఆయన రెవెన్యూ అధికారులను విచారణకు ఆదేశించారు. విచారణలో నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగం పొందాడని నిర్ధారణ అయింది. దీంతో డీఈ, అతనిపిల్లలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నెల్లూరు తహశీల్దార్ పి. జనార్దన్‌రావును కలెక్టర్ ఆదేశించారు. ఆగస్టులో నాల్గోనగర పోలీసులు తహశీల్దార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి డీఈని నాల్గో నగర ఎస్ఐ డి. వెంకటేశ్వరరావు అరెస్ట్ చేశారు. గురువారం కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు కులధ్రువీకరణ పత్రాలిచ్చి అధికారులను సైతం పోలీసులు విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే అప్పటి ఆర్డీఓ, తహశీల్దార్లు పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కాల్సి వస్తుంది.