మరమ్మతుల సేద్యం !
చిలకలూరిపేటరూరల్ : రైతులకు ఆధునిక సేద్యాన్ని దూరం చేస్తున్నారు. వ్యవసాయంలో పూర్తి స్థాయి యాంత్రీకరణను ప్రోత్సహించాల్సిన పాలకులు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా వ్యవసాయ యంత్ర పరికరాలు అందుబాటులో లేక రైతులు ఏటా సాగులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాత పరికరాలకు మరమ్మతులు చేయించుకుని సేద్యానికి నడుం కడుతున్నారు.
యంత్ర పరికరాలు కావాలని ఖరీఫ్ సీజన్‌లో వందలాది మంది రైతులు చేసుకున్న దరఖాస్తులకు రబీ వచ్చినా మోక్షం కలగకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. సాక్షాత్తూ వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట ప్రాంతంలోనే పరిస్థితి ఇలాఉంటే, ఎక్కడికి వెళ్లి ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
నియోజకవర్గంలోని చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడు మండలాల పరిధిలో 90 వేల ఎకరాల్లో రైతులు ప్రధానంగా పత్తి, మిర్చి, పొగాకు, కూరగాయలు సాగు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పత్తి, మిర్చి పొలాల్లో పురుగుమందు పిచికారి చేసేందుకు అవసరమైన తెవాన్ స్ప్రేయర్లు అందుబాటులో లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం రెండేళ్ల నుంచి వీటిని మంజూరు చేయడం లేదని రైతులు వాపోతున్నారు. మూలనపడిన పాత స్ప్రేయర్లను బయటకు తీసి మరమ్మతులు చేయించుకుని వాడుతున్నట్టు చెబుతున్నారు.
అర్జీలు స్వీకరించని మీ సేవ కేంద్రాలు ...
మీ సేవ కేంద్రాల ద్వారా అర్జీలు అందిస్తే వ్యవసాయ పరికరాలు అందిస్తామని నెల కిందట చెప్పిన అధికారులు నేటికీ ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. కనీసం రైతుల దరఖాస్తులను మీ సేవ కేంద్రాల్లో అనుమతించడం లేదు. ఇదిలావుంటే, వ్యవసాయ పరికరాల అందజేతలో టీడీపీకి చెందిన రైతులకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ అధికారులు స్వీకరించిన అర్జీలలో టీడీపీ నాయకులు, ఆ పార్టీకి చెందిన రైతుల దరఖాస్తులను మాత్రమే అధికారులు పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు.
రైతులు ప్రధానంగా వినియోగించే పరికరాలు ..
వ్యవసాయ యంత్ర పరికరాలను ప్రభుత్వం 50 శాతం రాయితీపై అందిస్తోంది. మిగిలిన 50 శాతాన్ని రైతు భరించి కొనుగోలు చేసుకోవాలి. ప్రధానంగా టు స్ట్రోక్, ఫోర్ స్ట్రోక్ తైవాన్, ట్రాక్టర్ స్ప్రేయర్, పవర్‌స్ప్రేయర్, పోర్టబుల్ స్ప్రేయర్, మొబైల్ స్ప్రేయర్, బ్రష్ కట్టర్, ట్రాన్స్‌ప్లాంటర్, ఫెర్టిలైజర్ డ్రిల్, రోటోవేటర్-36,42 బ్లేడ్, ట్రాక్టర్ స్ప్రేగన్స్ తదితర పరికరాలు రైతులకు అవసరమవుతాయి. వీటిని వాడడం వల్ల సాగు ఖర్చు తగ్గడంతోపాటు సమయం కూడా ఆదా అవుతోంది. అయితే వీటిని అందజేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆన్‌లైన్ సమస్యతోనే...
వ్యవసాయ యంత్ర పరికరాలు అందుబాటులో లేకపోవడంపై మండల వ్యవసాయాధికారి వి.వాణీశ్రీని ప్రశ్నించగా, మీ సేవ ద్వారా ఆన్‌లైన్ అందుబాటులోకి రాకపోవడం వల్ల రైతుల నుంచి అర్జీలు స్వీకరించడం లేదన్నారు. రైతులు కోరుతున్న ప్రతి ఒక్క పరికరానికి మీ సేవ కేంద్రం ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉందన్నారు. టీడీపీకి చెందిన రైతులకు ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. దరఖాస్తు చేసుకున్న రైతులు అందరికీ మంజూరు చేస్తామన్నారు.