ఆరడుగుల బుల్లెట్ మిస్ అయ్యిందా?
అశోక్ బాబు ఈ పేరు సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో రాష్ట్రమంతా తెగ వెలిగిపోయింది. ఇది ఆరడుగుల బుల్లెట్....ధైర్యం విసిరిన రాకెట్ అంటూ రాష్ట్ర విభజన సమయంలో తెగ హడావుడి చేసిన ఏపీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబుకు పరిస్థితి ప్రస్తుతం అయోమయంగా మారింది. ఆయనకు దెబ్బ మీద దెబ్బ పడింది. ఓవైపు ఏపీ ఎన్జీవో గృహ నిర్మాణ సంఘానికి భూకేటాయింపులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేస్తే, మరోవైపు ఏపీ ఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడిగా, డెరైక్టర్‌గా అశోక్‌బాబు నియామకం చెల్లదంటూ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది.
ఒకప్పుడు తానే మోనార్క్ అంటూ, తెగ నోరు పారేసుకున్న అశోక్ బాబు ... రాజకీయాలు అంటేనే అసహ్యమేస్తుందన్న నోటితోనే... అవసరం అయితే రాజకీయాల్లోకి వస్తానని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో సీల్డ్ కవర్ సీఎంతో సన్నిహితంగా మెలిగి ఉద్యమ బాటను అర్థాంతరంగా ముగించేసి, ప్రజల ఆగ్రహానికి గురయ్యారు.
ఆ తర్వాత అశోక్ బాబు రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపినా అందుకు అవకాశం కలిసి రాలేదు. ఓ దశలో కిరణ్ జై సమైక్యాంధ్ర పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైన ఆయన ఆ తర్వాత వెనక్కి తగ్గారు. తీరా తాను నమ్ముకున్న నేత ఏకంగా పార్టీనే ముసేసుకునే పరిస్థితి ఏర్పడింది. తాజాగా అధికారం చేపట్టిన ముఖ్యమంత్రికి దగ్గర అయ్యేందుకు ప్రయత్నాలు చేసినా...'బాబు' మంత్రం ఫలించలేదు. అంతన్నాడు ఇంతన్నాడు.. అన్న చందంగా అశోక్ బాబు.... వేసిన బుల్లెట్ మిస్ అయ్యిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.