విశాఖ విమానాశ్రయంలో విమానాన్ని హైజాక్ చేశారా... ఇదీ బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ ఆనోటా ఈనోటా సాగిన వదంతులు.
♦ ఉత్కంఠ రేపిన మాక్‌డ్రిల్
♦ నాలుగు గంటల సేపు అప్రమత్తం
♦ ఎన్‌ఎస్ డేగాలో భద్రతా బలగాల మోహరింపు
గోపాలపట్నం : విశాఖ విమానాశ్రయంలో విమానాన్ని హైజాక్ చేశారా... ఇదీ బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ ఆనోటా ఈనోటా సాగిన వదంతులు. మధ్యాహ్నం మూడుగంటలు...రయ్..రయ్ మంటూ అనేక వాహనాలు విశాఖ విమానాశ్రయం వైపు దూసుకు వచ్చాయి. అందులో అనేక శాఖల భద్రతా బ లగాలు, వారి వెంట జిల్లా పోలీసు యంత్రాంగం, వీరందర్నీ అనుసరిస్తూ అంబులెన్సులు, అగ్నిమాపక శకటాలు.
విమానాశ్రయం లోపల విమాన సంస్థల అధికారులు, ఉద్యోగులు ఉరుకులూపరుగులూ. అసలేం జరుగుతోంది...ఇవన్నీ ఏంటని ప్రయాణికులు, సందర్శకుల్లో ఉత్కంఠ. తీవ్రవాదులు హైజాక్ చేసిన విమానం ఇక్కడ వాలిదంటూ మరి కొద్ది సేపట్లో ఎవరి నుంచో వర్తమానం. ఉదయం డ్యూటీలు ముగించుకుని వెళ్లిపోయిన సీఐఎస్‌ఎఫ్ బలగాలు తిరిగి హుటాహుటిన విధుల్లో చేరిపోయి విమానాశ్రయ పరిసరాల్లో అడుగడుగునా కాపలా...సెక్యూరిటీ గేటు వద్ద అణువణువునా తనిఖీలు...ఇలా రాత్రి ఏడు గంటల వరకూ భద్రతాబలగాల హైరానాతో అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ రేపింది.
చివరికి ఇదంతా ఎయిర్‌క్రాఫ్ట్ యాన్టీ హైజాకింగ్ మాక్‌డ్రిల్‌గా భద్రతా అధికారులు వెల్లడించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దేశంలో తీవ్రవాదుల దాడుల నేపథ్యంలో భారత వైమానిక దళాలు, ఎయిర్‌పోర్టు అథారిటీ సీఐఎస్‌ఎఎఫ్ భద్రతా బలగాలతో అంతర్గత భద్రతా వ్యవస్థను అప్రమత్తం చేయడానికే ఈమాక్ డ్రిల్ జరిపారని అధికారులు తెలిపారు.