బ్యాంకులు బంద్ | Is the run up in private banks justified? Experts analyse | Sakshi
Sakshi News home page

బ్యాంకులు బంద్

Published Thu, Nov 13 2014 12:50 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM

బ్యాంకులు బంద్

బ్యాంకులు బంద్

సాక్షి, రాజమండ్రి : వేతన సవరణకోసం బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన దేశవ్యాప్త సమ్మెతో బుధవారం జిల్లాలోని 20 ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన 450కి పైగా శాఖలు మూత పడ్డాయి. సుమారు రూ.800 కోట్ల లావాదేవీలు  స్తంభించాయి. బ్యాంకు ఉద్యోగులకు పదో వేతన సవరణ 2012 నవంబరు నుంచి వర్తించ వలసి ఉండగా ఇప్పటి వరకూ ప్రభుత్వం అమలు చేయక పోవడాన్ని నిరసిస్తూ యునెటైడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ) ఆధ్వర్యంలో ఈ సమ్మె జరిగింది. వేతనాలను 33 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగులు ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండు రోజులు సమ్మె చేశారు.

తర్వాత ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కాగా వేతనాల పెంపును 25 శాతానికి, తర్వాత 23 శాతానికి తగ్గించి అమలు చేయాలని ఉద్యోగులు కోరారు. అయినా కేంద్రం పట్టించుకోక పోవడంతో వారం రోజులుగా విధి నిర్వహణ అనంతరం నిరసన వ్యక్తం చేసిన ఉద్యోగులు బుధవారం ఒకరోజు సమ్మె చేశారు. జిల్లాలో అత్యధికంగా సేవలు అందిస్తున్నవి ఆంధ్రా బ్యాంక్, స్టేట్ బ్యాంకు గ్రూపు శాఖలే. రాజమండ్రి, కాకినాడ, అమలాపురంతో పాటు మొత్తం 110 ఆంధ్రాబ్యాంకు, 113 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 40 స్టేట్ బ్యాక్ ఆఫ్ హైదరాబాద్ శాఖల్లో సమ్మె జరిగింది.

ఇవి కాక ఇతర ప్రభుత్వరంగ బ్యాంకులకు చెందిన 187 శాఖలు మూతపడ్డాయి. ఆయా బ్యాంకులకు అనుబంధంగా ఉండే ఆల్ ఇండియా బ్యాంకు ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్, ఆల్ ఇండియా స్టేట్ బ్యాంకు ఆఫీసర్స్ ఫెడరేషన్, ఆల్ ఇండియా ఎస్‌బీఐ స్టాఫ్ ఫెడరేషన్‌లతో పాటు పలు యూనియన్లు సమ్మెలో పాల్గొన్నాయి. 5,000 మందికి పైగా ఉద్యోగులు, అధికారులు విధులను బహిష్కరించారు.
 
పరిష్కారం కాకుంటే వచ్చే నెల రెండున మళ్లీ సమ్మె
రాజమండ్రి, కాకినాడ, అమలాపురంలలో బ్యాంకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమ బ్యాంకుల ముందు సమావేశమై డిమాండ్లతో కూడిన నినాదాలు చేశారు.వేతన సవరణ అమలులో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. రాజమండ్రి కంబాలచెరువు మెయిన్ బ్రాంచి వద్ద రీజియన్ పరిధిలోని అధికారులు, ఉద్యోగులు నిర సన వ్యక్తం చేశారు. ఐఎఫ్‌బీయూ రాజమండ్రి విభాగం కన్వీనర్ ఎన్.లక్ష్మీపతిరావు మాట్లాడుతూ తాము దిగి వచ్చినా కేంద్రం దిగి రావడం లేదన్నారు.

ఇదే వైఖరి కొనసాగితే జోనల్ స్థాయిల్లో సమ్మెకు దిగుతామన్నారు. డిమాండ్లు పరిష్కారం కాకపోతే సౌత్ జోన్ రాష్ట్రాల సమ్మెలో భాగంగా డిసెంబరు రెండున మరోసారి జిల్లాస్థాయిలో సమ్మె చేస్తామన్నారు. సమ్మెతో రాజమండ్రిలో రూ.200 కోట్లు, కాకినాడలో రూ.250 కోట్ల లావాదేవీలు స్తంభించినట్టుఅంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement