బ్యాంకుల సమ్మె
* స్తంభించిన లావాదేవీలు
* ఏటీఎంలే దిక్కు
* డిసెంబరులో మళ్లీ సమ్మె
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఐదేళ్లకోసారి పెంచాల్సిన జీతాలు పెంచకపోవడంతో బుధవారం ఉదయం రాష్ట్రంలోని అన్ని బ్యాంకు ఉద్యోగులు సమ్మె పాటించాయి. బ్యాంకు ఉద్యోగ సంఘాల జాతీయ సమాఖ్య ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యోగులందరూ తమ విధులను బహిష్కరించారు. ఉద్యోగ, అధికార సంఘాలతో బ్యాంకు యాజమాన్యం గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఐదేళ్లకు ఒకసారి జీతాలను పెంచాల్సి ఉంది. ఈ మేరకు 2007లో 17.5 శాతం జీతాన్ని పెంచారు. అయితే ఆ తరువాత ఐదేళ్ల (2012)లో జీతాలను పెంచలేదు.
ఈ దఫా 25 శాతం జీతాన్ని పెంచాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్‌పై ఇప్పటికి 13 సార్లు యాజమాన్యాలతో చర్చలు జరిపాయి. ఇందులో భాగంగా ఈనెల 10న ఢిల్లీలో జరిగిన చర్చలు విఫలం కావడంతో దేశవ్యాప్తంగా ఒక్కరోజు సమ్మెకు పిలుపునిచ్చాయి. జాతీయ సంఘాల పిలుపు మేరకు రాష్ట్రంలోని 8400 బ్యాంకులు మూతపడ్డాయి. సుమారు 60 వేల మంది అధికారులు, ఉద్యోగులు విధులను బహిష్కరించారు.
అన్ని లావాదేవీలు నిలిచిపోయాయి. ఆన్‌లైన్, ఏటీఎంల సేవలను సైతం స్తంభింప జేస్తున్నట్లు ప్రకటించినా ఏటీఎంలు పనిచేశాయి. చెన్నై వళ్లువర్ కోట్టం వద్ద బ్యాంకు ఉద్యోగులు ధర్నా చేశారు. బ్యాంకు యాజమాన్యాలు దిగిరాని పక్షంలో డిసెంబరు 2న తమిళనాడు, కర్నాటక, కేరళ, పుదుచ్చేరీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, డిసెంబరు 3,4,5 తేదీల్లో మిగిలిన రాష్ట్రాల్లో విధులను బహిష్కరించాలని బుధవారం నాటి సమ్మెలో నిర్ణయం తీసుకున్నారు.