వచ్చే నెలలో 3 అంతరిక్ష ప్రయోగాలు
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి మే నెలలో మూడు ప్రయోగాలు నిర్వహించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా షార్‌లోని మొదటి ప్రయోగవేదికపై పీఎస్‌ఎల్‌వీ సీ38 రాకెట్ అనుసంధానం పనులను శరవేగంగా శాస్త్రవేత్తలు చేస్తున్నారు. ఈ రాకెట్ ద్వారా కార్టోశాట్ సిరీస్ ఉపగ్రహంతో పాటు మరికొన్ని విదేశీ ఉపగ్రహాలను ప్రయోగిస్తారు. ఇప్పటికే నాలుగైదు దేశాలకు చెందిన ఉపగ్రహాలు షార్‌కు చేరుకున్నాయి. ఈ ప్రయోగాన్ని మే 25న నిర్వహించేందుకు లక్ష్యంగా పెట్టుకుని పనులు చేస్తున్నారు.
రెండో ప్రయోగవేదికకు సంబంధించిన వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో జీఎస్‌ఎల్‌వీ ఎఫ్–09 అనుసంధానం పనులు కూడా త్వరితగతిన చేస్తున్నారు. ఈ ప్రయోగంలో అత్యంత కీలకంగా భావిస్తున్న క్రయోజనిక్ ఇంజిన్(సీ–25) తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న లిక్విడ్ ప్రపొల్లెంట్ స్పేస్ సెంటర్ (ఎల్‌పీఎస్‌సీ) నుంచి ఇప్పటికే షార్‌కు చేరుకుంది. ఈ ప్రయోగంలో సుమారు రెండు టన్నులు బరువు కలిగిన జీశాట్–9 అనే సమాచార ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపేందుకు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రయోగాన్ని మే 5న నిర్వహించేందుకు ముహూర్తం నిర్ణయించారు. మే 30న జీఎస్‌ఎల్‌వీ మార్క్–3 ప్రయోగాన్ని కూడా చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. శుక్రవారం షార్‌కు విచ్చేసిన ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ ఈ విషయమై శాస్త్రవేత్తలతో చర్చించినట్లు తెలుస్తోంది.