
సాక్షి, కర్నూలు (సెంట్రల్): సీఎం హెలికాప్టర్ కో ఆర్డినేట్స్ తప్పుగా నమోదు చేసిన ఘటనపై అధికారులకు గురువారం నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల ఏరియల్ సర్వే కోసం ఈ నెల 21వ తేదీన నంద్యాల వచ్చారు. అయితే ల్యాండ్స్ అండ్ సర్వే శాఖ ఇచ్చిన ఇచ్చిన కోఆర్డినేట్స్(అక్షాంశాలు, రేఖాంశాలు) వివవరాలు తప్పుగా నమోదు చేయడంతో సీఎం హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం దాదాపు 10 నిమిషాలపాటు గాల్లో చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. దీనిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సీఎంఓ కార్యాలయం కూడా ఆరా తీసింది. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి విచారించాలని ఆదేశించింది. అయితే మొదట జాయింట్ కలెక్టర్ రవిపట్టన్ శెట్టిని విచారణాధికారిగా వేశారు.
ఆయన 22వ తేదీ హెలికాప్టర్ కోఆర్డినేట్స్ వివరాలను పరిశీలించారు. అయితే ఆ మరుసటి రోజే తిరిగి జిల్లా కలెక్టర్ విచారణాధికారిగా డీఆర్వో వెంకటేశంను నియమించారు. అయితే ఆయన తనకున్న పని ఒత్తిడితో నాలుగు రోజుల తరువాత నివేదికను రూపొందించి..సర్వే శాఖ ఏడీ హరికృష్ణ, డ్వామా పీడీ వెంకటసుబ్బయ్య, శిరివెళ్ల తహసీల్దార్ బి.నాగరాజు, నంద్యాల తహసీల్దార్ రమేష్‌బాబు, ఉయ్యాలవాడ తహసీల్దార్ బీవీ నాగేశ్వరరెడ్డి, గోస్పాడు ఎంపీడీఓ సుగుణశ్రీ, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే ఏ.వేణు తోపాటు మరొకరికి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30వ తేదీన విచారణకు హాజరు కావాలని విచారణాధికారి, డీఆర్వో వెంకటేశం ఆదేశించారు. ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు డీఆర్వో కార్యాలయంలో సంబంధిత డ్యాకుమెంట్లు, ఆధారాలతో తప్పక హాజరు కావాలని ఆయన చెప్పారు.
గంటల్లో ఇవ్వాల్సిన నివేదిక..రోజుల్లోకీ...
ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనకు వస్తే పరిపాలన అనుమతులకు సంబంధించి జిల్లా కలెక్టర్, భద్రత పరమైన అంశాలకు సంబంధించి ఎస్పీ అనుమతులు ఇవ్వాలి. ఈ రెండు అనుమతులు ఒకే అయినా తరువాతే సీఎం పర్యటన ఖరారు అవుతుంది. అందులో భాగంగా ఈ నెల 21వ తేదీన వరద ప్రభావిత ప్రాంతాల్లోసీఎం ఏరియల్ సర్వేకు రెండు అనుమతులు ఇచ్చారు. అయితే పాలన పరమైన అనుమతుల్లో భాగంగా హెలికాప్టర్ ల్యాండింగ్ కో ఆర్డినేట్స్‌ను మామూలుగా అయితే సర్వేయర్ శాఖ ఏడీ, డీఐతో కలసి లెక్కించాలి. దానిని జిల్లా కలెక్టర్ సీఎంఓకు నివేదించాలి. అయితే ఏడీ, డీఐ కలసి కోఆర్డినేట్స్‌ను లెక్కించాల్సి ఉండగా...డీఐ, స్థానిక సర్వేయర్లు లెక్కించి నివేదికను తయారు చేశారు. అయితే నివేదికను డిగ్రీలు, మినిట్స్, సెకన్లలో ఇవ్వాల్సి ఉండగా తిప్పించి రూపొందించడంతో హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం దాదాపు 10 నిమిషాలు గాల్లో చక్కర్లు కొట్టాల్సి వచ్చింది.
అయితే ఇక్కడ ప్రధానంగా ఏడీ నివేదికను రూపొందించి ఇవ్వాల్సి ఉండగా డీఐపైన ఆధారపడడంతోనే ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దానిని ఉన్నతాధికారి చూసుకోకుండా సీఎంఓకు పంపడం కూడా నిర్లక్ష్యం కిందకే వస్తోంది. అయితే దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిగి మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. కాగా, సీఎం పర్యటనలలోనే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎక్కడైనా సీఎంఓ కార్యాలయం నివేదిక కోరితే గంటల్లో ఇవ్వాల్సి ఉన్నా జిల్లా అధికారులు మాత్రం రోజుల తరబడిపట్టించుకోవడంలేదు. విచారించే 30వ తేదీ కూడా బాధ్యులపై చర్యలకు తెలుస్తారో లేదో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment