‘ఐటీ సమాజాభివృద్ధికి దోహదపడాలి’
ఇబ్రహీంపట్నం: ఐటీ చదువులు సమాజాభివృద్ధికి దోహదపడేలా ఉండాలని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్‌ఐ) సిల్వర్‌జూబ్లీ వేడుకలను పురస్కరించుకుని ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. శాస్త్రసాంకేతిక రంగం ప్రస్తుతం కీలకంగా మారిందని, సమీప భవిష్యత్‌లో ఇది లేకుండా ఏ అవసరమూ తీరదన్నారు.
ప్రపంచాన్నంతటినీ కుగ్రామంగా మార్చి అరచేతిలో ఇమడ్చేంత శక్తి ఉన్న ఐటీ చదువులు సామాజిక బాధ్యతలను పెంచేవిధంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ టెక్నాలజీని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దేశంలో ఆర్థికాభివృద్ధికి ఐటీ రంగం దన్నుగా నిలుస్తోందన్నారు.
మెరుగైన సౌకర్యాల లేమి కారణంగా గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రతి అవసరానికీ నగరాలపై ఆధార పడుతున్నారని, గ్రామాలకు, పట్టణాలకు అభివృద్ధిలో అంతరాలు తగ్గాలని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ప్రధాన మంత్రి సైంటిఫిక్ సలహాదారు ఎస్‌వీ రాఘవన్, ఏఐసీటీయూ చైర్మన్ డాక్టర్ ఎస్‌ఎస్ మంతా, సీఎస్‌ఐ అధ్యక్షుడు హెచ్‌ఆర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.