సాక్షి, నెల్లూరు: జిల్లాలో ఓట్ల చోరీ చాపకింద నీరులా సాగుతోంది. గోప్యంగా ఉంచాల్సిన రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వమే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి ఘోరమైన సైబర్ నేరానికి పాల్పడింది. తాజాగా గురువారం నెల్లూరులో సర్వే చేస్తున్న ఓ బృందాన్ని స్థానికులు అడ్డుకుంటే.. సర్వే బృందానికి ఇంటెలిజెన్స్ అధికారులు అండగా నిలవడం కలకలం రేపుతోంది. అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులు నిందితులకు అండగా నిలవడం పలు విమర్శలకు తావిస్తోంది.
తప్పు చేస్తున్న వారిని వదిలేసి దానిని అడ్డుకున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి స్వామి భక్తిని చాటున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో 33, 34 డివిజన్లలో అధికార పార్టీ నేతలఆదేశాలతో ఓ టీం ఇంటింటా సర్వే చేపట్టింది. పబ్లిక్ పాలసీ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన సభ్యులు ప్రత్యేక సాప్ట్‌వేర్ ఉన్న ట్యాబ్‌లతో ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వ్యక్తిగత సమాచారంతో పాటు ఏ పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నారో అనే విషయాన్ని గ్రహిస్తూ ట్యాప్‌లో నమోదు చేస్తున్నారు.
సర్వే టీం వద్ద ఓటర్ల జాబితా వివరాలు కూడా ట్యాప్‌లో ఉండడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే వారు వైఎస్సార్‌సీపీ నేతలకు సమాచారం ఇచ్చారు. ఆ ప్రాంతానికి చేరుకున్న ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు వారిని ప్రశ్తిస్తున్న సమయంలోనే ఇంటెలిజెన్స్ డీఎస్సీ ఫోన్ ద్వారా నేతలను బెదిరించారు. దీంతో పోలీసుల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం జరుగుతున్నట్లు బహిర్గతమైంది. సర్వే చేస్తున్న యువకులను వైఎస్సార్‌సీపీ నేతలు పట్టుకున్నారన్న సమాచారం తెలుసుకున్న వేదాయపాళెం పోలీసులు క్షణాల్లో వచ్చి వాలిపోయారు.
సర్వే చేస్తున్న వారికి అండగా నిలిచి సర్వే విషయాన్ని ప్రశ్నిస్తున్న నేతలను మందలించడం, వారిపై కేసులు నమోదు చేయడం చూస్తుంటే పోలీసుల సాయంతో టీడీపీ నేతలు భారీ కుట్రకు తెర తీస్తున్నారన్న విషయం ఇట్టే అర్థమైపోతుంది. గతంలో కూడా సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు, బ్రహ్మదేవం గ్రామాల్లో కొందరు టీడీపీకి చెందిన కార్యకర్తలు సర్వేల పేరుతో ఓటర్ల వ్యక్తిగత సమాచారంతో పాటు వారు ఏ పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నారన్న సమాచారం సేకరణ చేస్తూ పట్టుబడిన సంగతి తెలిసిందే. అప్పట్లో కూడా సర్వేలు చేస్తున్న వారిని పట్టుకొని స్థానిక పోలీసులకు అప్పగించినా కూడా వారు వదిలి వేయడంపై పలు విమర్శలకు తావిచ్చింది.
ఫారం–7 పై అక్రమ కేసులు
వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు ఓటర్లను తొలగింపులో భాగంగా టీడీపీ నేతలు ఆన్‌లైన్‌లో ఫారం–7 సమర్పణలో కూడా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ ఓటర్లనే టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు నమోదు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బుధ, గురువారాల్లో జిల్లాలోని పలు ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ నేతలకు, కార్యకర్తలను పోలీస్ స్టేషన్లకు పిలిపించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ అధికారులు తమ విధులను విస్మరించి పూర్తిగా పచ్చచొక్కా తొడిగిన నేతలుగా వ్యవహరించడంపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా 31,199 ఫారం–7 దరఖాస్తులు నమోదయ్యాయి. అందులో 13,025 దరఖాస్తులను పరిశీలించారు. ఇంకా 18,174 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment