
సాక్షి, అమరావతి : గ్రామీణ ప్రాంతాల్లోని యువతీ-యువకులకు ఉద్యోగాలు కల్పించేలా బీపీఓలను గ్రామస్థాయికి విస్తరిస్తామని రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్య, ఐటి శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తొలి సంతకం ఏపీ ఐఐసీ పేమెంట్ క్లియరెన్స్‌పై చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు వాస్తవమైనవా కాదా అని పరిశీలిస్తామన్నారు. జన్యూన్ ఇండ్రస్టీస్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 42 పరిశ్రమల ఏర్పాటుకు సమస్యలు ఉన్నాయని ప్రభుత్వ దృష్టికి వచ్చిందన్నారు. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని, అది వస్తే పరిశ్రమలకు రాయితీ వస్తుందన్నారు. తమ పార్టీ మొదటి నుంచి హోదాపై పోరాటం చేస్తుందని గుర్తుచేశారు. హోదా వచ్చే వరకూ తమ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ఐటీ శాఖపై ప్రత్యేక దృష్టి సాధించామని, బీజీఓలను గ్రామస్థాయికి విస్తరిస్తామన్నారు. అవినీతి రహిత పాలన అందించడమే తమ ప్రభుత్వ విధానమని గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment