సాక్షి ప్రతినిధి, కడప: నవ్విపోదురుగాక..నాకేటి సిగ్గు.. అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ వైఖరి ప్రస్పుటం అవుతోంది. ప్రజాతీర్పుకు భిన్నంగా అనైతిక పద్ధతుల్లో జెడ్పీపీఠాన్ని దక్కించుకునేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ నేతల ప్రలోభాలకు వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీలు తలొగ్గక పోవడంతో తాత్కాలికంగా చైర్మన్ ఎన్నికను వాయిదా వేయించాలనే ఆలోచనకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు శాంతిభద్రతలను సాకుగా చూపించే చీప్‌ట్రిక్స్ ప్లే చేసేందుకు ఓ ఎంపీ నేతృత్వంలో తెలుగుతమ్ముళ్లు నిమగ్నమైనట్లు తెలుస్తోంది.
జిల్లా పరిషత్ పీఠం కైవసమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ చురుగ్గా పావులు కదిపింది. ప్రజాతీర్పుకు భిన్నంగా, అప్రజాస్వామ్యక పద్ధతులను అవలంభించింది. అధికారిక హోదాను వినియోగించుకుని చైర్మన్‌గిరీని సొంతం చేసుకునేందుకు కుటిల యత్నాలకు ముమ్మరంగా చేపట్టింది. కేవలం 11 జెడ్పీటీసీల బలం మాత్రమే ఉన్నప్పటికీ మరో 15మంది కోసం తీవ్రస్థాయిలో ప్రలోభాలకు శ్రీకారం చుట్టిది. ఇవేవీ ఫలించకపోవడంతో తాత్కాలికంగా చైర్మన్ ఎన్నికను వాయిదా వేయించాలనే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని శాంతిభద్ర తలను సాకుగా చూపించాలనే ఎత్తుగడలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం ఓ ఎంపీ నేతృత్వంలో సాగుతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే లేనిబలంతో జెడ్పీని కైవసం చేసుకుంటామని ప్రకటించి, ఆమేరకు అనేక యుక్తులు ప్రద ర్శించి తెలుగుదేశం పార్టీ ప్రజల్లో పలుచబడిందని ఆపార్టీ సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
డీసీసీబీ చైర్మన్ ఎన్నికలను మరిపించేలా....
జిల్లాలో డీసీసీబీ చైర్మన్ ఎన్నికల్లో రాజ్యమేలిన కుట్రలు, కుతంత్రాలను జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో కూడా ప్రవేశ పెట్టాలనే తలంపుతో తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ ఎంపీ ఉన్నట్లు సమాచారం. అయితే సహకార చట్టాన్ని అడ్డుపెట్టుకుని ఆమేరకు ఆ ఎన్నికలను వాయిదా వేయించారు. అదే విధంగా శాంతిభద్రతల సమస్యను తెరపైకి తెచ్చి ప్రభుత్వం ద్వారా జెడ్పీ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయించాలనే తలంపుతో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే పంచాయితీరాజ్ చట్టంలో ఇలా సాధ్యం కాదని న్యాయనిపుణులు అభిప్రాయ పడుతున్నారు. స్థానిక సంస్థల చైర్మన్ ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిందని, ఆమేరకు జిల్లా ఎన్నికల అధికారి జెడ్పీ చైర్మన్ ఎన్నికలను నిర్వహించాల్సి ఉందని వారు పేర్కొంటున్నారు. డీసీసీబీ చైర్మన్ ఎన్నికకు, జెడ్పీ చైర్మన్ ఎన్నికకు పొంతనే ఉండదని అధికార పార్టీ నేతలు అభాసుపాలు కావాల్సిందేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
గామస్థాయి ఎంపీటీసీ మారాలంటేనే కష్టంగా ఉందని అలాంటి పరిస్థితుల్లో ఏకంగా 15మంది జెడ్పీటీసీలు మారడం అసాధ్యమని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. కాగా ‘కొత్త భిక్షగాడు పొద్దు ఎరగడు’ అన్నట్లుగా టీడీపీ కీలకనేత వైఖరి ఉంటున్నదని ఆపార్టీ సీనియర్ నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాంటి వారికి ‘కనకపు సింహాసనాన్ని’ అప్పగించడంతోనే పార్టీ ప్రజల్లో పలుచబడి పోతున్నదని ఆయన వాపోయారు. ఇప్పటికైనా కుయుక్తులకు పుల్‌స్టాప్ పెట్టి, ప్రజాతీర్పును హుందాగా స్వీకరించడం ద్వారా పార్టీ గౌరవాన్ని నిలపాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొందరు టీడీపీ నేతలు ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదులు పంపినట్లు సమాచారం.
కుయుక్తులు
Published Thu, Jul 3 2014 3:12 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement