సాక్షి,నెల్లూరు : ‘పనులు ఏళ్ల తరబడి చేస్తే ఎలా? రైతులకు సకాలంలో నీళ్లెలా ఇస్తాం? కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేస్తుంటే మీరేం చేస్తున్నారు? ఇలా అయితే కష్టం’ అంటూ ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు మండిపడ్డారు. కాంట్రాక్టర్లతో పాటు పనులను పర్యవేక్షిస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ మురళీధర్ నేతృత్వంలో సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, ఈఎన్‌సీ, నిపుణుల కమిటీ సభ్యులతో పాటు ఆ శాఖ స్థానిక అధికారులు నిర్మాణంలో ఉన్న పెన్నా, సంగం బ్యారేజీలను పరిశీలించారు. పనులు ఏళ్ల తరబడి సాగుతుండటంపై అసంతృప్తి చెందారు.
నెల్లూరులోని రంగనాయకులపేట వద్ద పెన్నా బ్యారేజీ నిర్మాణాన్ని రూ.156 కోట్ల నిధులతో చేపట్టారు. ఇప్పటి వరకు 62 శాతం పనులు పూర్తయ్యాయి. పనులు నత్తనడకన సాగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నతాధికారులు జూన్‌లోపు పూర్తి చే యాలని కాంట్రాక్టర్లతో పాటు స్థానిక అధికారులను ఆదేశించారు. సకాలంలో పనులు పూర్తవకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
రూ.128 కోట్లతో చేపట్టిన సంగం బ్యారేజీ పనులు ఇప్పటి వరకు కేవలం 16 శాతమే పూర్తయ్యాయి. చాలా రోజులుగా నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. నిర్మాణానికి సంబంధించిన డిజైన్ల విషయంలో కాంట్రాక్టర్లు, ఇరిగేషన్ అధికారుల మధ్య ఏకాభిప్రాయం లేనందునే పనులు నిలిచినట్లు సమాచారం. తాము రూపొందించిన డిజైన్ మేరకు పని చేస్తామని కాంట్రాక్టర్లు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈఎన్‌సీ సూచనల ప్రకారం రూపొందించిన డిజైన్ మేరకు పని చేయాలని అధికారులు పట్టుబట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ వివాదంపై పలు ధపాలు చర్చలు జరిగినా ఓ కొలిక్కి రాలేదు. తాజాగా సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ ఛీఫ్ ఇంజనీర్, ఈఎన్‌సీ, నిపుణుల కమిటీ సభ్యులు సంగం బ్యారేజీ డిజైన్‌ను మరోమారు క్షుణ్ణంగా పరిశీలించారు.
డిజైన్ వివాదంపై ఉన్నతాధికారులు మరో మారు కాంట్రాక్టర్‌తో సమావేశమై నిబంధనల మేరకు పలు సూచనలు చేయనున్నట్లు సమాచారం. జిల్లాలో చేపట్టిన రెండు బ్యారేజీల నిర్మాణ నాణ్యత, పనితీరు, డిజైన్‌లపై తనిఖీ బృందం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఇలాగైతే కుదరదు
Published Thu, Sep 26 2013 3:57 AM | Last Updated on Fri, Sep 1 2017 11:02 PM
Advertisement
Advertisement