
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమేనని స్పష్టమైంది. ఈ మేరకు రిమాండ్ రిపోర్టులో సంచలన వాస్తవాలు వెలుగుచూశాయి. ఈ దాడిలో వైఎస్ జగన్ మెడభాగంలో కత్తి తగిలి ఉంటే.. ఆయన అక్కడే చనిపోయి ఉండేవారని, నిందితుడు శ్రీనివాసరావు జగన్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించాడని రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నారు. దాడి సమయంలో అదృష్టవశాత్తు వైఎస్ జగన్ కుడివైపునకు తిరగడంతో హత్యాయత్నం నుంచి తృటిలో తప్పించుకున్నారని వెల్లడించారు.
గత గురువారం విశాఖపట్నం విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ వచ్చేందుకు పార్టీ నేతలతో కలిసి ఆయన వీఐపీ లాంజ్‌లో ఎదురుచూస్తున్న సమయంలో సెల్ఫీ నెపంతో వైఎస్ జగన్ వద్దకు వచ్చిన జనిపల్లి శ్రీనివాసరావు కోళ్ల పందాలకు ఉపయోగించే పదునైన కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనపై ఏపీ పోలీసు దర్యాప్తు అధికారులు స్థానిక కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టును ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. వైఎస్ జగన్‌పై జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమేనని రిమాండ్ రిపోర్ట్ స్పష్టం చేసింది. కత్తి గనుక మెడ భాగంలో తగిలి వుంటే ఆయన చనిపోయివుండేవారనే, నిందితుడు శ్రీనివాస్.. వైఎస్ జగన్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించాడని తెలిపింది. వైఎస్సార్‌సీపీ నేత కరణం ధర్మశ్రీ సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో నిందితుడు హత్యాయత్నం చేశాడని, అదృష్టవశాత్తు ఆ సమయంలో వైఎస్ జగన్ కుడివైపునకు తప్పుకోవడంతో ఆయనకు ప్రాణాపాయం తప్పిందని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఏపీ ప్రోటోకాల్ ఇన్‌స్పెక్టర్ వాసుదేవ్ అక్కడే వున్నారని కూడా రిమాండ్ రిపోర్ట్‌లో తెలిపారు. అంతేకాదు నిందితుడి జేబులో మరో పదునైన కత్తి ఉందని, జగన్ హత్యకు నిందితుడు పథకం ప్రకారమే ప్లాన్ చేశాడని విచారణలో వెల్లడైంది. 25వ తేదీన వైఎస్ జగన్ ఎయిర్‌పోర్టుకు వస్తారన్న సమాచారం తెలుసుకున్న శ్రీనివాస్.. ఒక రోజు ముందుగానే కత్తులను ఎయిర్‌పోర్ట్‌లోకి తెచ్చుకున్నాడని, సీసీ కెమెరాలు కవర్ చేయని ప్రాంతంలో ఆ కత్తులను దాచాడని రిమాండ్ రిపోర్ట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment