
చంద్రబాబుకు ఐవైఆర్ కృష్ణారావు లేఖ
హైదరాబాద్ : అర్చకుల వేతనాల్లో కోత విధింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు లేఖ రాశారు. పది వేల వేతనాలను ఐదు వేలకు తగ్గించడం సరికాదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. హిందూ మతాన్ని దెబ్బతీయడానికి బయటి శత్రువులు అక్కర్లేదని, గ్రామాల్లో హిందుత్వం కనిపించకుండా పోవడానికి ఇలాంటి ఆలోచనలు చాలని ఐవైఆర్ తన లేఖలో పేర్కొన్నారు.
సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం 250 కోట్ల రూపాయలతో ఫండ్ ఏర్పాటయిందని, ఇతర ఆలయాల కంట్రిబ్యూషన్ కలిపితే రూ.500 కోట్లు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఆ నిధులతో అర్చకులకు నెలకు రూ.10 వేల వేతనం ఇవ్వవచ్చని సూచించారు. చినజీయర్ లాంటి ట్రస్టులు తమ అర్చకులకు నెలకు రూ.20వేలు ఇస్తున్నాయని, అలాంటిది అర్చకులకు పదివేల నుంచి వేతనాన్ని ఐదువేలకు తగ్గించాలని ఆలోచించడం సరికాదన్నారు.
కాగా ఆదాయం లేని ఆలయాల్లో పనిచేసే అర్చకులు, ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నెలకు 10వేల రూపాయల కనీస వేతనం అందజేసేందుకు గతంలో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం... ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. గ్రామీణ ప్రాంత ఆలయాల్లో పనిచేసే అర్చకులు, సిబ్బందికి కనీస వేతనాన్ని సగానికి సగం తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. సర్కార్ నిర్ణయంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.