ఏలూరు సిటీ/ఆర్‌ఆర్‌పేట : రాష్ట్ర విభజనను అడ్డుకునే శక్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే ఉందని ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు తోట చంద్రశేఖర్ అన్నారు. గురువారం ఏలూరులో సమైక్య శంఖారావం సభ ఏర్పాట్లపై నేతలు, కార్యకర్తలతో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, నియోజకవర్గ సమన్వకర్తలతో కలసి గురువారం ఆయన సమీక్షనిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాదని తెలి సే రాష్ట్రాన్ని విభజించేందుకు సోనియా పావులు కదిపారని, తెలంగాణలో అయినా పార్టీని బతికిం చుకునేందుకు సీమాంధ్ర ప్రజల జీవితాలతో చెలగా టం అడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో 9, 10 సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించాలనుకోవడం కాంగ్రెస్ కుటిలనీతికి నిదర్శనమన్నారు.
ప్రజల భవిష్యత్‌తో ఆటలాడితే సహించేదిలేదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమర శంఖారావం పూరించారని చెప్పా రు. నిజాయితీ, నిబద్ధతతో సమైక్యాంధ్ర కోసం ఆయన పాటుపడుతున్నారని ఉద్ఘాటించారు. రాష్ట్రంలోని 9కోట్ల మంది ప్రజల్లో ఐదున్నర కోట్లమంది విభజన వద్దని నినదిస్తున్నా కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సాగునీటి సమస్య ఒక్కటే కాకుండా విద్య, వైద్యం వంటి అనేక విషయాల్లో ప్రజలు, విద్యార్థులు అవస్థలు పడాల్సిన దుస్థితి ఏర్పడుతుందని చెప్పారు. హైదరాబాద్‌లో జాతీయస్థాయి విశ్వవిద్యాలయా లు, విద్యాసంస్థలు ఉన్నాయని, విభజనతో సీమాం ధ్ర విద్యార్థులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశా రు.
2014 ఎన్నికలు దేశ రాజకీయ చరిత్రలోనే సంచలనం సృష్టిస్తాయని, సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 25 పార్లమెంట్ సీట్లను కైవసం చేసుకోవటం ఖాయమని ఘంటాపథంగా చెప్పారు. పార్లమెంటుకు విభజన బిల్లువస్తే తమ వాణి విని పించేందుకు అవకాశం ఉండదని సీమాంధ్ర ఎం పీలు ప్రజలను చివరి దశలోనూ తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. సీమాంధ్రలోని 19మంది ఎంపీలు రాజీనామా చేస్తే రాజకీయ సంక్షోభం వచ్చి బిల్లు పాస్ అయ్యే అవకాశాలు ఉండవని స్పష్టం చేశారు.
సమైక్య శంఖారావానికి భారీ ఏర్పాట్లు
ఈనెల 26న హైదరాబాద్‌లో నిర్వహించే సమైక్య శంఖారావం సభకు ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి 35వేలకు పైగా ప్రజలను తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశామని చంద్రశేఖర్ తెలి పారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 5వేలకు పైగా ప్రజలు సభకు వస్తారన్నారు. ఇందు కోసం ఏలూరు నుంచి ఒక ప్రత్యేక రైలు, వందలాది వాహనాలను ఏర్పాటు చేశామని చెప్పారు. సమైక్య శంఖారావ సభ దేశ చరిత్రలోనే మహోజ్వల ఘట్టంగా నిలిచిపోతుందని, ఢిల్లీ పీఠాన్ని కదిలించి విభజన నిర్ణయాన్ని ఆపేందుకు వైఎస్ జగన్ చేపట్టిన సభకు అనూహ్య స్పందన వస్తోందని పేర్కొన్నారు.
అంతకుముందు జీతాలను వదులుకుని ఉద్యమం చేసిన న్యాయశాఖ ఉద్యోగులకు నిత్యావసర సరుకులను అంబటి రాంబాబు, తోట చంద్రశేఖర్ పంపిణీ చేశారు. అనంతరం వైఎస్సార్ సీపీ శ్రేణుల దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, తాజా మాజీ ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, మద్దాల రాజేష్‌కుమార్, పార్టీ సమన్వయకర్తలు, నాయకులు పాల్గొన్నారు.