పద్మావతిని ఓదారుస్తున్న వైఎస్ జగన్
పులివెందుల/రూరల్, న్యూస్‌లైన్ : వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కచేరి రోడ్డులోని ఆర్యవైశ్య సంఘం నాయకుడు మిట్టా విశ్వనాథం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇటీవలే విశ్వనాథం తల్లి సరస్వతి మృతి చెందిన నేపథ్యంలో జగన్ వారింటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ఈ మధ్యనే అనారోగ్యంతో మృతి చెందిన చిన్నరంగాపురం మాజీ సర్పంచ్ పుల్లారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైఎస్ జగన్‌ను చూడగానే రోదిస్తున్న మృతుని భార్య పద్మావతి, కుమార్తెలు గౌరి, తులసి, బుజ్జి ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు.
అంతకుమునుపు పుల్లారెడ్డితోపాటు దివంగత సీఎం వైఎస్‌ఆర్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పుల్లారెడ్డి కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. తర్వాత బాకరాపురంలో ఇటీవలే వివాహమైన అంబకపల్లె మల్లికార్జునరెడ్డి కుమార్తె అనుజ, రాకేష్‌రెడ్డి దంపతులను వైఎస్ జగన్ ఆశీర్వదించారు. సీఎస్‌ఐ చర్చి నుంచి వైఎస్ జగన్ బయటకు వచ్చిన తర్వాత చిన్నరంగాపురం, బాకరాపురం కాలనీల్లో ప్రజలు వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం పలికారు. పలువురు తమ సమస్యలు ఏకరువు పెట్టారు. త్వరలో మన ప్రభుత్వం వస్తుంది.. అప్పుడు అందరి సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన హామీ ఇచ్చారు.
కిటకిటలాడిన క్యాంపు కార్యాలయం :
పులివెందులలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం బుధవారం కార్యకర్తలు, నాయకులు, అభిమానులతో కిటకిటలాడింది. మధ్యాహ్నం నుంచి వైఎస్ జగన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులోకి ఉండి వారి సమస్యలను సావధానంగా విన్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన క్యాలెండర్‌ను వైఎస్ జగన్ ఆవిష్కరించారు. వివిధ ప్రాంతాలకు చెందిన వైఎస్‌ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జగన్‌ను కలిశారు.
వైఎస్ జగన్‌ను అభినందించిన కడప న్యాయవాదుల జేఏసీ :
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఊపిరిగా భావించి రాష్ట్రం కోసం పోరాడుతున్న వైఎస్ జగన్‌రెడ్డిని కడప బార్ ఆసోసియేషన్ అధ్యక్షుడు రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు తరలి వచ్చి కలిశారు.