సాక్షి ప్రతినిధి, ఏలూరు, ఏలూరు టౌన్: ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పశ్చిమలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఏలూరు నగరం కొత్తపేట 12పంపుల సెంటర్‌లోనూ, కొవ్వూరు పట్టణంలోని విజయవిహార్ సెంటర్‌లోనూ భారీ బహిరంగ సభలకు ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా వైఎస్సార్‌సీపీ నేతలు, శ్రేణులు, అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. భానుడి భగభగల మధ్య వైఎస్ జగన్ టీడీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, మోసాలపై నిప్పులు చెరిగారు. ఐదేళ్ళుగా చంద్రబాబు చేసిన మోసాలను ఎత్తిచూపుతూ.. తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో ప్రజలకు వివరించారు. ధర్మానికీ అధర్మానికీ మధ్య యుద్ధం జరుగుతోందనీ.. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి వైఎస్సార్‌సీపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు.
ప్రజల జీవితాల్లో వెలుగులు రావాలంటే.. ఈ అరాచక పాలనకు వీడ్కోలు పలకాలంటూ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇక యువత, మహిళలు వైఎస్ జగన్ సభలకు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సీఎం.. సీఎం..అంటూ యువత నినాదాలతో హోరెత్తించారు. జగన్ ప్రసంగిస్తున్నంత సేపూ ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. వైఎస్ జగన్ అడిగే ప్రతీ ప్రశ్నకు ప్రజలు స్పందిస్తూ పెద్దపెట్టున సమాధానాలు ఇచ్చారు. ప్రభుత్వ అవినీతిని ఎండగడుతూ జగన్ చేస్తున్న ప్రసంగానికి ప్రజలు చప్పట్లు, ఈలలతో, హర్షధ్వానాలతో మద్దతు పలికారు.
ఏలూరు సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ....
ఆ రోజు ఇదే ఏలూరు పట్టణం గుండా పాదయాత్ర సాగింది. ఆరోజు మీరు చెప్పిన ప్రతి అంశము... ఈ రోజుకి కూడా గుర్తు ఉంది. ఏలూరు వన్‌టౌన్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ కట్టాలని పది సంవత్సరాల కిందట దివంగత నేత రాజశేఖరరెడ్డి బతికున్నప్పుడు రూ. 15 కోట్లు విడుదల చేశారు. పనులు ప్రారంభించిన తరువాత దివంగత నేత మన మధ్య లేకపోవడంతో పనులు నిలిచిపోయాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ఐదు సంవత్సరాల వరకు చంద్రబాబు పాలన జరిగింది. కాని ఏ రకంగా పట్టించుకోని పరిస్ధితి. ఇక్కడే తమ్మిలేరు వర్షాలు పడినప్పుడు ఏ రకంగా దిగువ ప్రాంతాలు, ఏ విధంగా ముంపు గురవుతున్నాయోనని ఇప్పటికే చూస్తా ఉన్నాం. ఈ ఐదేళ్ళల్లో చంద్రబాబు పట్టించుకోలేదు. అప్పట్లో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ముంపును నివారించేందుకు అప్పట్లో రిటైనింగ్ వాల్ కట్టడం కోసం రూ. 30 కోట్లతో పనులు ప్రారంభించారు. ఆ మహానేత చనిపోయిన తరువాత పూర్తిగా పట్టించుకోని పరిస్థితి చూస్తా ఉన్నాం.
కొవ్వూరు బహిరంగ సభల్లో వైఎస్ జగన్ మాట్లాడుతూ...
తాళ్ళపూడి, తాడిపూడి, ప్రక్కిలంక, చిడిపి, కొవ్వూరు, బల్లిపాడు, ర్యాంపులలో రోజు వేల సంఖ్యలో లారీలు కనిపిస్తా ఉన్నాయ్. పొక్లెయిన్లు పెట్టి ఇసుకను దోపిడీ చేసుకుంటా పోతా ఉన్నారు. ఇక్కడు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తులు, మంత్రులుగా ఉన్న వ్యక్తులు సాక్షాత్తు ముఖ్యమంత్రిగారికి వాటాలు ఇస్తూ దోపిడీ చేస్తున్న విషయాలు కనిపిస్తా ఉన్నాయ్. దేవుడి కార్యక్రమం పుష్కరాలు జరిగాయ్ ఆ పుష్కరాలు జరిగినప్పుడు అంతా చూశారు. చెత్త ఏరివేసే పని దగ్గర నుండి ఘాట్‌ల నిర్మాణం దగ్గర నుంచి, రోడ్ల నిర్మాణం నుంచి ప్రతి పనిలో నామినేషన్ల పద్ధతిలో ఇష్టానుసారంగా రేట్లు పెంచేసి నాసిరకం పనులు చేయించారు. ఎంత అన్యాయంగా పాలన జరిపించారో మీకే తెలుస్తా ఉంది.
బెల్టు షాపుల రద్దు సంతకానికి విలువ ఏదీ
కొవ్వూరు నియోజకవర్గంలో ఎక్కడిపడితే అక్కడ బెల్టుషాపులు కనిపిస్తున్నాయ్. బడి పక్కన బెల్టుషాపు... గుడి పక్క బెల్టుషాపు... వీధి చివరా బెల్టుషాపే.. తెలుగుదేశం పార్టీ నాయకులే స్వయంగా బెల్టుషాపులు నిర్వహిస్తూ ఏకంగా ఎంఆర్‌పీ రేటు కన్నా 20 నుండి 30 రూపాయలకు అమ్ముకుంటా ఉన్న దారుణమైన పరిస్థితి. సాక్షాత్తు చంద్రబాబునాయుడు మొదటి సంతకం బెల్టుషాపుల రద్దు అని చెప్పిన దానికి విలువ ఏమిటో కొవ్వూరులో మీకే తెలుసు. గోదావరి తీరాన మంత్రి కుమారుడు రిసార్ట్స్ కడతాడు.. అక్కడ దేవత విగ్రహాలు అడ్డమొస్తున్నాయి కదా అని వాటిని తొలగిస్తారు.
చింతలపూడి ఎత్తిపోతలు కొలిక్కిరాలేదు
చింతలపూడి ఎత్తిపోతల పథకం ఇప్పటి వరకు కొలిక్కి రాలేదు. ఐదేళ్ళు పూర్తయినా కూడా పశ్చిమగోదావరి జిల్లా మెట్ట ప్రాంతమైన చింతలపూడి ఎత్తిపోతల పథకంలో ఏం పని జరిగిందని ఒక ఆలోచన చేయమని అడుగతా ఉన్నా... ఇదే చింతలపూడి ప్రాజెక్టును పూర్తి చేస్తే ఈ ప్రాంతం నుంచి మెట్ట ప్రాంతం వరకు మంచి జరిగే అవకాశం ఉండేది. కావాలని చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేయకుండా ఉండేందుకు ఒక మండలం నుంచి ఒక్కొక్క రేటు ఇస్తా ఉంటారు. మాకు ఎందుకు తక్కువ రేటు ఇస్తున్నారని రైతన్నలు ధర్నా చేసే పరిస్ధితికి రెచ్చగొడతా ఉన్నారు. చివరకు ఆ రైతన్నలు ధర్నా చేస్తే వాళ్ళే ఏదో తప్పు చేసినట్లుగా వాళ్ళ మీదే కేసులు పెట్టి చివరికి ఆ చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని నీరుగార్చే పరిస్థితికి తీసుకువచ్చారు.
వరి పంట పండిస్తున్న రైతన్నల పరిస్థితి క్వింటాల్‌కు కనీస మద్ధతు ధర రూ.1750 కాని రైతు చేతికి ఏ సంవత్సరమైనా రూ. 1200లకు మించి మద్దతు ధర వచ్చిందా అని అడుగుతున్నా. ఈ చెడిపోయిన వ్యవస్థకు మార్పు తీసుకుని రమ్మని, మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఆళ్ల నానికి, ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోటగిరి శ్రీధర్‌కు, కొవ్వూరు అసెంబ్లీ అభ్యర్థి నా చెల్లి తానేటి వనితమ్మను, రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి మార్గాని భరత్‌ను గెలిపించాలని కోరారు. ఈ సభల్లో దెందులూరు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి, నిడదవోలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జీ.శ్రీనివాస్‌నాయుడు, వైఎస్సార్‌సీపీ వైద్యవిభాగం రాష్ట్ర అధ్యక్షులు శివభరత్‌రెడ్డి, మాజీ మంత్రి మరడాని రంగారావు, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, వంకా రవీంద్రనాథ్, ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ మధ్యాహ్నపు ఈశ్వరి, ఎస్‌ఎంఆర్ పెదబాబు, ఎంఆర్‌డీ బలరాం, ఉభయగోదావరి జిల్లాల మహిళా సమన్వయకర్త పిళ్ళంగోళ్ళ శ్రీలక్ష్మి, బొద్దాని శ్రీనివాస్, గుడిదేశి శ్రీనివాస్, కోడూరి శివరామకృష్ణ, ఆత్కూరి దొరయ్య తదితరులు పాల్గొన్నారు.
పేదవాడి ఇంటి రుణాన్ని మాఫీ చేస్తా
ఇదే ఏలూరులో పాదయాత్రకు వచ్చినప్పుడు ఆరోజు మీరన్నమాట గుర్తుంది. అప్పట్లో దివంగత నేత రాజశేఖరరెడ్డి హయాంలో ఈ నియోజకవర్గంలో 12,000 ఇళ్ళను కట్టించి ఇచ్చారు. ఈ రోజు ఏ రకంగా పట్టాలు పంచిపెట్టాలని, అవినీతి ఫ్లాట్లు కట్టాలని ఆలోచన చేస్తున్న పరిస్థితులున్నాయి. పేదవాడికి చంద్రబాబు అమ్మే రేటు అడుగుకి 2 వేల రూపాయలు చొప్పున 300 అడుగుల ప్లాటు అక్షరాల 6 లక్షల రూపాయలు పేదవాడికి అమ్మే పరిస్థితి చేస్తా ఉన్నాడు. ఈ రూ. 6 లక్షల్లో మూడు లక్షల రూపాయలు పేదవాడి తరపున అప్పుగా రాసుకుంటాడట, ఆ పేదవాడు 20 సంవత్సరాలు పాటు నెల నెలా మూడు వేల రూపాయలు కడుతూ పోవాలట. మీ అందరికి ఒకటేహామీ ఇస్తా ఉన్నా.. మన ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ పేదవాడికి ఏదైతే 20 ఏళ్ళపాటు రూ.3 లక్షల రూపాయలు అప్పు కట్టాల్సి ఉందో. ఆ మొత్తం రూ. 3లక్షలు మాఫీ చేస్తామని హామీ ఇస్తా ఉన్నా.
Comments
Please login to add a commentAdd a comment