రేయనక..పగలనక..ఎండనక..వాననక..సర్వకాల సర్వావస్థల్లో..సరైన నీడ లేక అల్లాడుతున్న పేదలకు ఓ గూడు కావాలంటే ప్రస్తుత ప్రభుత్వం హయాంలో జన్మభూమి కమిటీలను ప్రసన్నం చేసుకోవాల్సిందే. ఇల్లు మంజూరుకు ముందుగానే వారికి లంచాలు ముట్టజెప్పాలి. ఎలాగోలా అవస్థలు పడగా ఇల్లు మంజూరైతే నిర్మాణం సమయంలో బిల్లు కోసం మళ్లీ వాళ్ల కాళ్ల చుట్టూ ప్రదక్షిణ చేయాలి. తీరా బిల్లు వచ్చిందంటే దాన్ని పొందడానికి కమీషన్ ముట్టజెప్పాలి. ఇన్ని కష్టనష్టాలకు ఓర్చి ఇంటి నిర్మాణం పూర్తిచేస్తే చివరి బిల్లు వస్తుందో రాదో? అది ఎవరి ఖాతాలోకి పోతుందో తెలియని అగమ్య గోచర పరిస్థితి ఇప్పటివరకు ఉంది. అయితే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్రంలో నిర్వహించిన సుదీర్ఘ ప్రజా సంకల్ప యాత్రలో పేదలు పడుతున్న గూడుగోడును స్వయంగా పరిశీలించిన మేరకు పేదల సొంతింటి కల నెరవేర్చే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పి భరోసా కల్పించారు.
వైఎస్సార్‌సీపీ భరోసా ఇది
- ఇప్పటి వరకు ఇల్లులేని ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు మంజూరవుతుంది. దీనికి ఎటువంటి సిఫార్సులు అవసరం లేదు. పేదరికమే వారి ఆర్హతగా భావించి సొంతింటి కలను నెరవేరుస్తాం.
- ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో 25 లక్షలు, జిల్లాలో రెండు లక్షలకు తక్కువ లేకుండా పక్కా ఇళ్లు కట్టించి ఇస్తాం.
- ఇల్లు మంజూరైన రోజునే ఆ ఇంటి గృహిణ పేరిట ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయిస్తుంది.
- ఇక ఇల్లు నిర్మాణానికి మంజూరు చేసే నగదును రూ.ఐదు లక్షల వరకు ప్రభుత్వం పెంచి నేరుగా అందజేస్తుంది.
- ఇల్లు నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చిన డబ్బు సరిపడకపోతే, బ్యాంకుతో ప్రభుత్వం మాట్లాడి, పావలా వడ్డీకి రుణం కల్పిస్తుంది.
జన్మభూమి కమిటీల పెత్తనం
సిఫార్సులు, కమీషన్లు, లంచాల ప్రహసనంతో సొంతిల్లు అనే మాటను పేదలు దాదాపు మర్చిపోయారు. ఇల్లు కోసం పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా, జన్మభూమి కమిటీలకు మొక్కలేక, ఆ విధానాలతో విసిగిపోయిన ప్రజలు చాలామంది ఇంటి కోసం దరఖాస్తు చేసుకోవడమే మర్చిపోయారు. మరికొంతమంది జన్మభూమి సభలు, ఇతర సభలు, గ్రీవెన్స్ సెల్‌లో దరఖాస్తు చేసుకున్నా అవన్నీ బుట్టదాఖలయ్యాయే తప్ప, దరఖాస్తుదారులకు ఎటుంటి ప్రయోజనం చేకూరలేదు.
సగం కూడా పూర్తి కాని నిర్మాణాలు
టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో పాలనలో మొదటి రెండేళ్లలో ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు. చివరి మూడు సంవత్సరాల్లో ఇళ్లు మంజూరు చేసినా, వాటికి నిబంధనలు అడ్డంకిగా మారాయి. ఇల్లు మంజూరయ్యేందుకు సిఫార్సుల కోసం పేదలకు సమస్యలు తప్పలేదు. నిజాయితీగా ఒక్క ఇల్లు కూడా మంజూరు చేసిన దాఖలాలు లేవు. అన్ని అవినీతి మయంగా మారాయి. 2016–17 నుంచి 2018–19వరకు జిల్లాలో 42,800 ఇళ్లు మంజూరు కాగా 26,450 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయగలిగారు.
నాటి వైఎస్ స్వర్ణయుగంలో..
2014వ సంవత్సరం ఎన్నికల్లో గెలుపొంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఇందిరమ్మ పథకం ద్వారా గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటి సర్వేలు చేయించి అధికారులతో అర్హులను గుర్తించి, ఇల్లు కావాలని అడిగిన ప్రతి ఒక్కరికి అక్కడికక్కడే పక్కా ఇల్లు మంజూరు చేశారు. ఎంటుంటి సిఫార్సులు లేకుండా పేదరికమే అర్హతగా పేదలను ఆదుకున్నారు. ఈ పథకం ద్వారా మూడు విడతల్లో జిల్లాలో 2, 24,000 ఇళ్లు మంజూరు చేశారు. వాటిలో ఆయన హయాంలోనే 2,10, 000 ఇళ్ల నిర్మాణం పూర్తయింది.
రూ.5 లక్షలకు పెంచడం హర్షణీయం
పేదవాడి ఇల్లు నిర్మాణానికి మంజూరు చేసే నిధులు రూ.5 లక్షలకు పెంచడం హర్షణీయం. ఇప్పటివరకు టీడీపీ ప్రభుత్వం ఇల్లు నిర్మాణానికి రూ.1.50 లక్షలు మాత్రమే ఇచ్చింది. పేదలకు ఆ నిధులు సరిపడక, ఇల్లు పూర్తి చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది అప్పులు చేస్తున్నారు. జగన్‌మోహన్ రెడ్డి హమీతో పేదల్లో సంతోషం వచ్చింది.
–పేడాడ తేజేశ్వరరావు, వాకలవలస, శ్రీకాకుళం రూరల్
బ్యాంకు రుణం కూడా ప్రభుత్వం ఇప్పించడం మంచిదే
ఇంటి రుణంలో ప్రభుత్వం సాయం చేస్తుందని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ వల్ల పేదలకు రుణ సమస్య ఉండదు. రూ.5 లక్షలు చాలని పక్షంలో అప్పు కూడా దొరుకుతుంది. దీంతో జిల్లలో ప్రతి పేదవాడు సొంతింటి కలను నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది.
–బలివాడ స్వరూప్, బలివాడ, శ్రీకాకుళం
మహిళ పేరిట రిజిస్ట్రేషన్ మంచి ఆలోచన
ప్రభుత్వం మంజూరు చేసే ఇల్లు మహిళల పేరిట నేరుగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయడం వల్ల మహిళల జీవితాలకు భద్రత ఉంటుంది. వారికి భరోసా దొరుకుతుంది. సమాజంలో స్త్రీలపై చిన్నచూపు పోయి, వారిలో మనోధైర్యం వస్తుంది. జగన్‌మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల మహిళలకు మరింత మేలు జరుగుతుంది.
–అల్లంశెట్టి శ్రీదేవి, శ్రీకాకుళం
రూ.5 లక్షలతో మంచి ఇల్లు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత కాలనీ ఇళ్లు కట్టుకునే లబ్ధిదారులకు ఒక్కో ఇంటికి రూ.5లక్షలు ఇస్తామని ప్రకటించారు. అ సొమ్ముతో ఇంటిల్లిపాదీ కష్టపడి మంచి ఇల్లు కట్టుకోవచ్చు. ఇప్పుడు ఇస్తున్న రూ.లక్షన్నర ఏమూలకూ సరిపోవడం లేదు. జగన్ సీఎం కావాలని ఎదురు చూస్తున్నాం.
– ఎస్.చిరంజీవి, మురగడలోవ, ఎల్.ఎన్.పేట
Comments
Please login to add a commentAdd a comment