ఆయన మాటే పదివేలు.. | Jagan Promised To Auto Drivers | Sakshi
Sakshi News home page

ఆయన మాటే పదివేలు..

Published Sun, Mar 31 2019 11:55 AM | Last Updated on Sun, Mar 31 2019 11:56 AM

Jagan Promised To Auto Drivers - Sakshi

సాక్షి, భీమవరం: ‘ఆటో, టాక్సీవాలాలకు ఏడాదికి రూ.10 వేలు ఇస్తాం. ఇందువల్ల ఆ ఆటోడ్రైవర్‌కు రోడ్డు ట్యాక్స్, ఇన్సూ్యరెన్స్, చిన్నపాటి రిపేర్లు చేయించుకునే భారం తగ్గుతుంది. ఇన్సూ్యరెన్స్‌ చేయడం వల్ల ఆటోలో జరగరానిది ఏదైనా జరిగితే ఆటోలో వెళుతున్న కార్మికులకు ఊరట కలుగుతుంది’ ఇవి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా గతేడాది మేలో ఏలూరులో జరిగిన బహిరంగ సభలో అన్న మాటలు. ఈ మాటలు ఆటో, టాక్సీవాలాలకు కొండంత భరోసా ఇస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల వేళ ఆటో, టాక్సీ కార్మికులు జగన్‌ హామీలపై చర్చించుకుంటున్నారు. జిల్లాలో సుమారు 10 వేల మంది టాక్సీడ్రైవర్లు, 35 వేల మంది ఆటోడ్రైవర్లకు లబ్ధి చేకూరుతుందని ఆయా సంఘాల నాయకులు అంటున్నారు. అరకొర సంపాదనతో జీవితం భారంగా ఉన్న ఆటో, టాక్సీ కార్మికులకు జగన్‌ వరాలు ఊరట కలిగిస్తున్నాయని వారంతా భావిన్నారు. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుపడుతుందని అంటున్నారు. 

ఆటో డ్రైవర్లకు చేయూత
ఉన్నత విద్యనభ్యసించినా ఉద్యోగావకాశాలు లేకపోవడంతో ఎందరో యువత ఆటో, టాక్సీలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఆటో కొనుగోలు చేసినప్పుటి నుంచి ఏటా పన్నులు, బీమా, ఇతర ఖర్చుల నిమిత్తం రూ.12 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో జగన్‌ రూ.10 వేల హామీ వీరికి ఎంతో లబ్ధి చేకూర్చనుంది. దీనిపై ఆయా వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 


జగన్‌ ప్రకటన భేష్‌ 
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి టాక్సీ డ్రైవర్లకు ఏడాదికి రూ.10 వేలు లబ్ధి చేకూరుస్తానని మా కోసం హామీ ఇవ్వడం ఆనందంగా ఉంది. మా బాధలు తెలుసుకున్న ఆయన మా కోసం ఈ పథకాన్ని ప్రకటించారు. ఇది మాకు చాలా ఆర్థిక ప్రయోజనం కలిగిస్తుంది. జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన ఇచ్చిన హామీ అమలవుతుందని భావిస్తున్నాం.  
– సంబలదీవి వెంకట సత్యనారాయణ (చిన్న), టాక్సీ డ్రైవర్‌ భీమవరం 


ఐదేళ్ల నుంచి చాలా ఇబ్బందులు
నేను 30 ఏళ్లగా టాక్సీ నడుపుతున్నాను. గతంలో టాక్సీ ఫీల్డ్‌ బాగుండేది. ఐదేళ్ల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం. సరైన కిరాయిలు లేక ఖాళీగా ఉంటున్నాం. అయినా బీమా, బ్రేకు, ఇతర పన్నుల రూపంలో సుమారు రూ.20 వేలు కడుతున్నాం. ఈ ఇబ్బందులు స్వయంగా తెలుసుకున్న జగన్‌ మా కోసం ఏడాదికి రూ.10 వేలు ఇస్తామని ప్రకటించడం సంతోషంగా ఉంది.  
–రుంజుల విఠాల్‌కుమార్, ది భీమవరం టాక్సీ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు 


ఆటో డ్రైవర్లకు అన్ని కష్టాలే..
ప్రస్తుతం ఆటో డ్రైవర్లకు అన్ని కష్టాలే. ఒక పక్క డీజిల్‌ ధరలు పెరగడం, మరోపక్క పన్నుల భారంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇలాంటి కష్టకాలంలో మాకు అండగా నిలబడి మా కోసం ఏడాదికి రూ.10 వేలు జగనన్న ఇస్తానని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీ తప్పక నెరవేరుస్తారనే నమ్మకం మాకు ఉంది. 
– బడుగు నాగరాజు, ఆటో డ్రైవర్, భీమవరం 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement