
జగనన్నకు నీరాజనం
జననేతను చూసిన వారి కళ్లు ఆనందంతో మెరిశాయి. ఆయనతో కరచాలనం చేసిన వారి తనువులు నిలువెల్లా పులకించాయి. తమ బాధలు విని అండగా నిలుస్తానన్న జగనన్న భరోసా వారి మనసుల్లో ఆనందాన్ని నింపింది. శ్రీకాకుళంలో జరిగే యువభేరికి వెళ్తూన్న వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి మార్గమధ్యలో జిల్లాలోని రహదారి పొడవునా జనం నీరాజనాలు పలికారు. నినాదం ఆగిపోలేదు... నలుదిక్కులా ప్రతిధ్వనించేలా కొత్త ఊపిరి పోసుకుంది. ఉద్యమం వీగిపోలేదు... ఊరుఊరునా ఉవ్వెత్తున ఎగసిపడడానికి జవసత్వాలు నింపుకుంది. ఉద్యోగాలు ఇవ్వలేని సర్కారు చేతకానితనాన్ని ప్రశ్నించేందుకు, హామీలు నిలబెట్టుకోలేని నేతల నిర్లక్ష్య వైఖరిని నిలదీసేందుకు యువత చేతికి సరైన ఆయుధం దొరికింది.
శ్రీకాకుళంలోని టౌన్ హాల్‌లో వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మంగళవారం తలపెట్టిన ‘యువభేరి’ ప్రత్యేక హోదా పోరు ఎగసిపడుతోందన్న సంగతి తేల్చి చెప్పింది. యువత గుండెల్లో నివురు గప్పిన నిప్పులా ఉన్న ప్రత్యేక ఉద్యమ స్ఫూర్తిని నినాదాల రూపంలో గొంతు వరకు తెచ్చింది. వారి మనసులో గూడుకట్టుకుపోయిన కోపాన్ని గాల్లోకి లేచిన పిడికిళ్ల రూపంలో ప్రభుత్వానికి చూపించింది.