తెలంగాణలో జగ్గారెడ్డి దుకాణం బంద్ | 'Jaggareddy has no role in telangana' | Sakshi
Sakshi News home page

తెలంగాణలో జగ్గారెడ్డి దుకాణం బంద్

Published Wed, Aug 28 2013 1:42 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM

'Jaggareddy has no role in telangana'

పటాన్‌చెరు, న్యూస్‌లైన్: తెలంగాణలోని వనరులను దోచుకున్నవాళ్లే సీమాంధ్ర, సమైక్యాంధ్ర ఉద్యమాలను ప్రోత్సహిస్తున్నారని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్. సత్యనారాయణ విమర్శించారు. మంగళవారం ఆయన పటాన్‌చెరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొందరు సమైక్యవాదులు, జగ్గారెడ్డిలాంటి తెలంగాణ ద్రోహు లు అనుచిత వైఖరి అవలంబిస్తున్నారని, వారు  ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను గౌరవించి నడుచుకోకపోతే తగిన బుద్ధిచెబుతామన్నారు. వారిని సాంఘికంగా బహిష్కరించడమే కాకుండా తెలంగాణ ప్రాంతంలోని సీమాంధ్రులకు సహాయ నిరాకరణ చేస్తామన్నారు. తెలంగాణలో దోచుకున్న సొమ్మును సమైక్య ఉద్యమానికి ఖర్చు పెడుతున్నారన్నారు.  సీమాంధ్రలో సమైక్యవాదం పేరిట నిర్వహిస్తున్న డ్రామాలను, నాటకాలను తెలంగాణ దోపిడీదారులు పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. పటాన్‌చెరు మండలం రుద్రారంలోని వీబీసీ ఫెర్రో అలాయిస్ లాంటి పరి శ్రమలకు చెందిన పారిశ్రామికవేత్తలు సీమాం ధ్ర సమైక్యవాద ఉద్యమానికి నిధులిస్తున్నారన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 85 ఎస్‌జెడ్‌లలో నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఆ రకంగా వచ్చిన అక్రమ సంపదను సీమాంధ్ర ఉద్యమానికి వెచ్చిస్తున్నారన్నారు. తెలంగాణ ఏర్పడితే తాము నష్టపోతామని భావిస్తున్న పెట్టుబడిదారులు సమైక్యవాద ఉద్యమం నిర్వహిస్తున్నారన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలంగాణ వస్తే ఈ ప్రాంతానికి ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించడం అర్థరహితమన్నారు. తెలంగాణ వస్తే జగ్గారెడ్డికి మాత్రం ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.
 
 తెలంగాణ వారు నరరూప రాక్షసులైతే కలిసి ఉండడం దేనికి!
 తెలంగాణ ప్రాంత నాయకులు ఉద్వేగంలో మాట్లాడే వ్యాఖ్యలపై ఆంధ్ర ప్రాంతంలో కేసులు పెడుతున్నారని అదే సీమాంధ్రకు చెందిన  పయ్యావుల కేశవ్ వంటి వారు ఇందిర, రాజీవ్‌గాంధీలకు పట్టిన గతే  కేసీఆర్‌కు పడుతుందని చేసిన వ్యాఖ్యలపై మాత్రం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని  సత్యనారాయణ పేర్కొన్నారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలంగాణవాదులు నరరూపరాక్షసులంటూ చేసిన వ్యాఖ్యలను  ఆయన తప్పుపట్టారు. తెలంగాణవాదులు నరరూప రాక్షసులైతే వారితో కలిసి ఉండడం దేనికని ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ గాలి అనిల్‌కుమార్, రాష్ట్ర నాయకులు బసవేశ్వర్, పట్టణ టీఆర్‌ఎస్ నాయకులు చందు, విజయ్ పాల్గొన్నారు.
 
 జలమండలి ఉద్యోగుల  సంక్షేమానికి హరీష్ కృషి
 పటాన్‌చెరు టౌన్: సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు నాయకత్వంలోని యూనియన్ జలమండలి ఉద్యోగుల సంక్షేమానికి  శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్. సత్యనారాయణ అన్నారు. పటాన్‌చెరులోని జలమండలి ఉద్యోగుల కార్యాలయం వద్ద మంగళవారం ఆయన టీఆర్‌ఎస్ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జలమండలి ఉద్యోగుల పాత్ర ఎంతో గొప్పదన్నారు. సీమాంధ్ర ఉద్యోగులు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. సీమాంధ్రలో తెలంగాణ ఉద్యోగులపై చేస్తున్న దాడులను ఖండించాలన్నారు. తిరుపతిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ వీ. హన్మంతరావుపై జరిగిన దాడిని, తెలంగాణ వారిపై జరుగుతున్న దాడులను ప్రభుత్వ చూసీచూడనట్టు వదిలేస్తోం దన్నారు. జలమండలి కార్మిక నాయకుడు సతీష్‌కుమార్ మాట్లాడుతూ ఎంతో కాలంగా జలమండలిలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులకు దసరా పండుగ కానుకగా పర్మినెంటు చేయనున్నట్టు  తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి గాలి అనిల్‌కుమార్,బసవేశ్వర్, చందు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement