జగిత్యాల, న్యూస్‌లైన్ : జగిత్యాలలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ నర్సింగ్ కళాశాల పరిస్థితి ‘ఆదిలోనే హంసపాదు’ అన్నట్లు తయారైంది. అనేక ఒడిదుడుకుల మధ్య కళాశాల ఏర్పాటుకు అనుమతి వచ్చినా.. అడ్మిషన్ల నోటిఫికేషన్‌కు సీమాంధ్రుల ఆందోళనలు అడ్డు తగిలాయి. ఫలితంగా నర్సింగ్ కళాశాలలో చేరుదామనుకుంటున్న విద్యార్థులకు ఎప్పటిలాగే ఎదురుచూపులు తప్పడం లేదు.
అనుమతి ఫైల్ నుంచే అడ్డంకులు
జిల్లాలో నర్సింగ్ కళాశాల లేకపోవడంతో ఇక్కడి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి పలుమార్లు నివేదికలు పంపించారు. జగిత్యాలలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేస్తే అందరికీ అందుబాటులో ఉంటుందని 2012లో నివేదించారు. సంబంధిత ఫైల్ అనుమతి కోసం విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీ చుట్టూ తిరిగాయి. ప్రభుత్వం నిర్ణయం ప్రకటిస్తుందనుకునే సమయంలో తెలంగాణ కోసం సకల జనుల సమ్మె ప్రారంభమైంది. అలా రెండు నెలలు ఆలస్యమైంది. అనంతరం 40 సీట్లకు అనుమతి రావడంతో తాత్కాలికంగా మున్సిపల్ కాంప్లెక్స్‌లో తరగతులు ప్రారంభించాలని నిర్ణయించారు. తర్వాత జగిత్యాల ఏరియా ఆస్పత్రి పైఅంతస్తును ఎంచుకున్నారు. ఇక్కడ వసతులు, పరికరాలు, గ్రంథాలయం కోసం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ రూ.4.50 లక్షలు కేటాయించింది. ఏర్పాట్లను ఇండియన్ నర్సింగ్ యూనివర్సిటీ బృందంతోపాటు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి వచ్చిన బృందం కూడా సందర్శించింది. రికార్డులు, వసతులు, బోధన సిబ్బంది బాగుం దన్నారు. ఇక మిగిలింది అడ్మిషన్లు తీసుకోవడమే.
ఆదిలోనే అడ్డంకులు
నర్సింగ్ కళాశాలకు ఏటా ఆగస్టు రెండోవారంలో అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలవుతుంది. బైపీసీ చేసిన అమ్మాయిలు నాలుగేళ్ల కోర్సులో చేరేందుకు అవకాశం ఉంటుంది. ఇంటర్మీడియెట్ బైపీసీలో వచ్చిన మార్కులను బట్టి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సీట్లను భర్తీ చేస్తుంది. తీరా నోటిఫికేషన్ విడుదలయ్యే సమయానికి సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనలు చోటుచేసుకోవడం.. అందులో ఎన్టీఆర్ యూనివర్సిటీ సిబ్బంది కూడా భాగస్వాములు కావడంతో అడ్మిషన్ల ప్రక్రియ నోచుకోవడం లేదు. దీంతో ఈ ప్రాంత విద్యార్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
నోటిఫికేషన్ రావడమే ఆలస్యం
- విద్యావతి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్
నర్సింగ్ కళాశాలకు అన్ని అనుమతులు వచ్చాయి. బోధన సిబ్బంది కూడా ఉన్నారు. ఈ నెలలో అడ్మిషన్ నోటిఫికేషన్ వెలువడాలి. సీమాంధ్రలో ఉద్యోగుల సమ్మెతో నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుందో తెలియదు. అడ్మిషన్లు జరిగితే కళాశాలను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాం.
ఎదురుచూపులు..!
Published Wed, Aug 21 2013 2:23 AM | Last Updated on Fri, Aug 17 2018 3:08 PM
Advertisement
Advertisement