జలయజ్ఞం.. సస్యశ్యామలం | Jalayagnam Irrigation Projects In Kurnool District | Sakshi
Sakshi News home page

జలయజ్ఞం.. సస్యశ్యామలం

Published Tue, Dec 31 2019 10:10 AM | Last Updated on Tue, Dec 31 2019 10:10 AM

Jalayagnam Irrigation Projects In Kurnool District - Sakshi

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌

సాక్షి, కర్నూలు: కరువుకు చిరునామా రాయలసీమ. ఏటా దుర్భిక్షం. 19వ శతాబ్దం వరకు సీమ రైతుల గురించి పట్టించుకునే నాథుడే లేరు. ఇందుకు శ్రీశైలం నుంచి సీమ జిల్లాలకు వాడుకున్న నీటి గణాంకాలే సాక్ష్యం. 19వ శతాబ్దంలో కేవలం 119 టీఎంసీల నీరు మాత్రమే వాడుకున్నారు. ఇందులో కూడా సగం వరకు చెన్నైకి తరలించారు. 20 శతాబ్దంలోకి అడుగు పెట్టిన తరువాత  మహానేత వైఎస్‌ఆర్‌ చేపట్టిన జలయజ్ఞం ఫలాలు వరుణుడు రాసిన కరువు శాసనాన్ని తుడిచి వేస్తున్నాయి. జిల్లాలో రెండు దశబ్దాల కాలంలో కొత్త ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు, సాగునీటి కాలువల విస్తరణతో సుమారుగా 4.25 లక్షల ఎకరాల ఆయకట్టు పెరిగినట్లు ఇంజినీరింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి తరలించిన నీటితో రెండు దశాబ్దాల్లో తెలుగుగంగా కింద 95 వేలు, ఎస్‌ఆర్‌బీసీ కింద 56 వేలు, హంద్రీనీవాతో 80 వేల ఎకరాలు, జీఆర్‌పీ కింద 45 వేల ఎకరాలు, లిఫ్ట్‌ల వల్ల 95 వేల ఎకరాలు, సిద్ధాపురం కింద 20 వేలు, పులికనుమ కింద 26 వేలు, పులకుర్తి కింద 9 వేల ఎకరాల ఆయకట్టు అదనంగా పెరిగినట్లు ఇంజినీర్లు అంచనాలు వేస్తున్నారు.

2004లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ఆర్‌ చొరవతోనే జలయజ్ఞం పనులు శరవేగంగా సాగాయి. పోతిరెడ్డిపాడు, ఎస్‌ఆర్‌బీసీ విస్తరణ, గాలేరు–నగరి, అవుకు రిజర్వాయర్, గోరుకల్లు రిజర్వాయర్, సిద్ధాపురం ఎత్తిపోతల పథకంతో పాటు, హంద్రీనీవా సుజల స్రవంతి, గురురాఘవేంద్ర ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన లిఫ్ట్‌లు, పులికనుమ, పులకుర్తి స్కీమ్‌లు, తుంగభద్ర నది తీరంలో ఏర్పాటు చేసిన లిఫ్ట్‌లు, ముచ్చుమర్రి ఎత్తిపోతలతో 20వ శతాబ్దంలో కరువును తరుముతున్నాయి. కొత్త ప్రాజెక్టులతో జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాలకు పోతిరెడ్డిపాడు ద్వారా విస్తరణ తరువాత నుంచి ఇప్పటి వరకు 1,245 టీఎంసీలు, హంద్రీనీవా నుంచి 170 టీఎంసీలు, ముచ్చుమర్రి నుంచి 10 టీఎంసీలు, లిఫ్ట్‌ల నుంచి 50 టీఎంసీల నీటిని అదనంగా వినియోగించుకోని జిల్లాలో దాదాపు 5 లక్షల ఎకరాల ఆయకట్టు అభివృద్ధి చెందింది.

అవుకు టన్నెల్‌ 

శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ను వినియోగించుకునేందుకు 2006లో పోతిరెడ్డిపాటు హెడ్‌ రెగ్యులేటర్‌ను విస్తర్ణను 44 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు. దీని ద్వారా 30 రోజుల్లో 102 టీఎంసీల నీరు తీసుకోవాలని లక్ష్యంగా పనులు మొద లు పెట్టారు. ఇందులో ఎస్‌ఆర్‌ఎంసీ (శ్రీశైలం కుడి ప్రధాన కాలువ విస్తరణ)ని 
బానకచర్ల కాంప్లెక్స్‌ వరకు విస్తరించడంతో సీమలోని ప్రాజెక్టులకు నీటి తరలింపునకు మార్గం సుగమమైంది.  అవుకు రిజర్వాయర్‌ లో నీటి నిల్వ సామర్థ్యం పెంచారు. కృష్ణానీటిని కేసీ కాలువకు ప్రత్యామ్నాయంగా అందించేందుకు 2008లో ముచ్చుమర్రి ఎత్తిపోతలకు శ్రీకారం చూట్టారు. గతేడాది నుంచి ఆయకట్టు రైతులకు అందుబాటులోకి వచ్చింది. 

హంద్రీ –నీవాతో పెరిగిన భూగర్భ జలాలు 
రాయలసీమ జిల్లాలకు తాగు, సాగునీరు అందించే హంద్రీనీవా సుజల స్రవంతిని 2005లో ప్రారంభించారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలో 6 లక్షల ఎకరాలకు సాగు, 40 లక్షల మందికి తాగు నీటి అవసరాలు తీర్చాలి. జిల్లాలో 80 వేల ఎకరాలకు సాగు నీరు అందిచాల్సి ఉంది. ఆ కాల్వతో జిల్లాలో చాలా చోట్ల భూగర్భ జలాలు పెరిగి ఎండిన బోర్లలోకి నీరొచ్చింది. పంట కాల్వల పనులు పూర్తి కావాల్సి ఉంది. 68 చెరువులకు నీరు ఇచ్చేందుకు చేపట్టిన పనులు జరుగుతున్నాయి.  

కొత్త ప్రాజెక్టులకు ప్రణాళిక 
జిల్లాలో తుంగభద్ర జలాలను వినియోగించి పశ్చిమ పల్లెను సస్యశ్యామం చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తుంగభద్రనదిపై గుండ్రేవుల ప్రాజెక్టు, ఆర్డీఎస్‌ కుడి కాలువ, హగేరి నదిపై వేదావతి ప్రాజెక్ట్‌ నిర్మించేందుకు చర్యలు చేపట్టారు.    

ఆయకట్టుకు జీవం  
తెలుగుగంగ ప్రాజెక్టులో అసంపూర్తిగా ఉన్న ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీలను, లైనింగ్‌ పనులు చేసేందుకు 2006లో 4460.64 కోట్లు అంచనా వ్యయాన్ని 2007లో ఖరారు చేస్తూ వైఎస్‌ఆర్‌ అనుమతులు ఇచ్చారు. 2018 మార్చి నాటికి 95 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన 5 శాతం పనులను పూర్తి చేసేందుకు అంచనాలను 6671.62 కోట్లకు పెంచేసి 2018 మార్చి9న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కాల్వ కింద ఆయకట్టు స్థీరికరించడంతో జిల్లాలో లక్ష ఎకరాలు అదనంగా ఆయకట్టు పెరిగింది.   

  • ఆత్మకూరు మండలంలో సిద్ధాపురం ఎత్తిపోతలకు 2006 ఏప్రిల్‌ 20న మహానేత శంకుస్థాపన చేయగా, గత ఏడాది పూర్తయింది. 
  • కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం ప్రాంతాల్లోని 50 వేల ఎకరాలకు సాగు నీరు ఇచ్చేందుకు 2004లో వైఎస్‌ఆర్‌ గురురాఘవేంద్ర లిఫ్ట్‌తో పాటు, మరో ఆరు ఎత్తిపోతల పథకాలను, సుగూరు చెరువును పూర్తి చేశారు. 261.19 కోట్లతో పులికనుమ రిజర్వాయర్‌కు శ్రీకారం చూట్టారు. ఇది పూర్తయితే గూడూరు, కోడుమూరు, సి. బెళగల్,  కల్లూరు, మండలాల్లో  9823 ఎకరాల ఆయకట్టుకు నీరందనుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement