
సాక్షి, కడప: దివ్య (సామాజిక బాధ్యతా రీత్యా పేరు మార్చాం) వయస్సు 19 ఏళ్లు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని ఓ పల్లెకు చెందిన ఆమె తన తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె. తల్లిదండ్రులు కూలీ చేసుకుంటూ తమ స్థోమత కొద్ది అమ్మాయిని చదివిస్తున్నారు. ప్రస్తుతం ఆమె జమ్మలమడుగు డివిజన్‌లోని ఓ ప్రైవేటు నర్సింగ్ కళాశాలలో జీఎన్‌ఎం కోర్సు చదువుతోంది. ఈ నెల 1 నుంచి పది రోజులపాటు కళాశాలకు సెలవు ప్రకటించడంతో అమ్మాయి 1వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు ఊరికి వెళుతున్నట్లు కళాశాలలో సంతకం చేసి బయటికి వచ్చింది.
సాయంత్రమైనా ఆమె ఊరు చేరలేదు. అమ్మాయి ఆచూకీ కోసం ఆమె తండ్రి బంధువులను ఆరా తీశారు. స్నేహితులకు ఫోన్ చేశారు. మీ అమ్మాయి కళాశాల బయటికి రాగానే ఎవరో ముగ్గురు అబ్బాయిలు ఆటోలో వచ్చి తీసుకెళ్లారని ఓ స్నేహితురాలు చెప్పడంతో 2వ తేదీ ఆదివారం ఉదయాన్నే అమ్మాయి తల్లిదండ్రులు జమ్మలమడుగు అర్బన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పది రోజులు దాటింది. అమ్మాయి ఆచూకీ కోసం పోలీసులు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. దర్యాప్తు మాట అటుం చితే కనీసం ఆమె సొంత ఊరి వైపు కూడా కన్నెత్తి చూడలేదంటే అమ్మాయిల అదృశ్యాల పట్ల జమ్మలమడుగు పోలీసులు ఏ మేరకు శ్రద్ధ కలిగి ఉన్నారో ఇట్టే అర్థమవుతోంది.
ఆ ఒక్క కారణంతోనే......
అమ్మాయి తన గ్రామానికి చెందిన మరో అబ్బాయితో కలిసి వెళ్లిందని..వారిద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారని బయట ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని అమ్మాయి తండ్రి కూడా ధ్రువీకరించారని పోలీసులు చెబుతున్నారు. అయితే అమ్మాయి ఇష్టపూర్వకంగానే వెళ్లిందా? లేక బలవంతంగా తీసుకెళ్లారా? బెదిరించి ఇంతకాలం తమ వద్దే ఉంచుకున్నారా? అన్న విషయాలపై పోలీసులు కనీసం ఆరా కూడా తీయలేదు.
అమ్మాయి అదృశ్యం కేసులో జమ్మలమడుగు పోలీసులు ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ‘సాక్షి’పరిశీలించగా ఒకే ఒక్క అంశం స్పష్టంగా కనిపించింది. ఫిర్యాదు చేసిన అమ్మాయి తండ్రి పేదవాడు..పలుకుబడి లేని వాడు.....ఇంతవరకు ఏ ఒక్క నాయకుడితో కూడా ఫోన్ చేయించలేకపోయారు....ఈ ఒక్క కారణంతోనే అమ్మాయి అదృశ్యంపై పోలీసులు కనీస దర్యాప్తు కూడా చేపట్టలేదన్నది స్పష్టంగా తెలుస్తోంది.
జరగరానిది ఏదైనా జరిగితే.....
ఒక్కగానొక్క కూతురు. 19 ఏళ్లపాటు కంటికి రెప్పలా కాపాడుకున్నారు ఆ తల్లిదండ్రులు. ఇప్పుడు తమను కాదని వెళ్లిపోయింది. (బలవంతంగానో, ఇష్టపూర్వకంగానో తెలియదు) భవిష్యత్తులో ఆ కిడ్నాపర్లు తన బిడ్డను ఏమైనా చేసి తిరిగి ఆ నిందను తనపైనే నెడితే....ఇదీ ఆ కన్న తండ్రి ఆవేదన. ఎలాగూ తన బిడ్డ గడప దాటిపోయింది. ఒకవేళ ఇష్టపూర్వకంగానే వెళ్లి ఉంటే అదే విషయాన్ని పోలీసుల ఎదుట ధ్రువీకరిస్తే అంతే చాలంటున్నారు బాధిత తండ్రి. ఇదే విన్నపాన్ని పోలీసులతో చెబుతామని చివరిసారిగా బుధవారం స్టేషన్‌కు వెళ్లారు.
అయితే పోలీసులు ఈసారి మరీ కటువుగా మాట్లాడారు. ఇదొక్క కేసైనా మాకు? ఇంకేవీ ఉండవా? అంటూ మరోమాటకు ఛాన్సు ఇవ్వకుండా బయటికి పంపించివేశారు. ఏనాడూ పోలీసు గుమ్మం మెట్లక్కని ఆ అభాగ్యుడికి ఇంతకంటే పెద్ద ఆఫీసర్ వద్దకు వెళ్లి తన గోడు వెళ్లబోసుకునే ధైర్యం లేదు. ఆర్థిక స్థోమత లేని, రాజకీయ అండదండలు అసలే లేని ఆ కన్న తండ్రికి ఈ జన్మలో న్యాయం జరగదా? ఏమో జమ్మలమడుగు పోలీసులే జవాబు చెప్పాలి.
కాదు...కూడదంటే పిలిపిస్తాం!
అమ్మాయి అదృశ్యం కేసు విషయమై ‘సాక్షి’జమ్మలమడుగు అర్బన్ ఎస్‌ఐ ధనుంజయుడును వివరణ కోరగా ‘అమ్మా యి, అబ్బాయి ఇష్టపూర్వకంగానే వెళ్లినట్లు మా దృష్టికి వచ్చింది. ఇద్దరూ మేజర్లేనని తెలిసింది. ఇంతవరకు వారిని స్టేషన్‌కు పిలిపించలేదు. అమ్మాయి తండ్రి కాదు....కూడదు..... అని పట్టుబడితే వారిద్దరినీ స్టేషన్‌కు తీసుకు వస్తాం. దీని కెందుకింత రాద్దాంతం’అంటూ సింపుల్‌గా జవాబిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment