
జనజాతర
వెంకటగిరిటౌన్: వెంకటగిరి పోలేరమ్మ జాతరకు గురువారం జనం పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు రావడంతో పట్టణం కిక్కిరిసింది. ఉదయం వర్షం కారణంగా ఓ మోస్తారుగా వచ్చిన జనం 10 గంటల తర్వాత తండోపతండాలుగా రాసాగారు. ఎన్నడూ లేని విధంగా దేవస్థానం నుంచి బజారువీధి మీదుగా ఆంజనేయస్వామి గుడి, మార్కెట్‌వీధి దాటి సుమారు కిలోమీటర్ పైగా ఉచిత దర్శనం క్యూలైన్ నిలిచింది. గ్రామీణుల రాకతో వెంకటగిరి-రాపూరు రోడ్డు, రైల్వేస్టేషన్ రోడ్డులో సందడి నెలకొంది.
భక్తుల జయ జయ ధ్వానాల మధ్య వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతర ఘనంగా ముగిసింది. దండాలమ్మా పోలేరమ్మ అంటూ అమ్మవారిని వేడుకుంటూ భక్త కోటి భక్తి పారవశ్యంలో తరించారు. భక్తుల కోలాహలం, యువకుల కేరింతల మధ్య ఊరేగింపు కనుల పండువగా సాగింది. ఊరేగింపు సమయంలో అమ్మవారిని దర్శించుకోవాలన్న తపన భక్తుల్లో కొట్టొచ్చినట్టు కనిపించింది. బాణసంచా కాల్పుల మధ్య పోలేరమ్మ తల్లి ఊరేగింపు ముందుకు సాగింది. రెండురోజులుగా రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు జాతరకు హాజరయ్యారు. వేకువజామున అమ్మవారిని జీనుగులవారి వీధి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి పోలేరమ్మ గుడి వద్ద ప్రత్యేకంగా నిర్మించిన తాత్కాలిక గుడిలో కొలువుదీర్చారు. సాయంత్రం 5.30 గం టల వరకు అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. సాయంత్రం 4కు దున్నపోతును బలిచ్చాక గ్రామ పొలిమేర్ల వద్ద పొలి కార్యక్రమం జరిగింది.
అశేష జనవాహిని మధ్య నిమజ్జనం
సాయంత్రం అశేష జనవాహిని మధ్య అమ్మవారి నిమజ్జనోత్సవం ప్రారంభమైంది. బజారువీధి, రాజావీధి, శివాలయంవీధుల మీదుగా ఊరేగింపు జరిగింది. పోలేరమ్మను చివరిగా మిద్దెలపై నుంచి పట్టణంలోని మహిళలు, చిన్నారులు దర్శించుకున్నారు. అనంతరం సంప్రదాయబద్ధంగా మల్లమ్మగుడి సమీపంలో అమ్మవారి నిమజ్జనం జరి గింది. పోలేరమ్మ మట్టిని తీసుకునేందుకు భక్తులు పోటీపడ్డారు.
గట్టి బందోబస్తు
జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎస్పీ సెంథిల్ కుమార్ దిశానిర్దేశంలో ఏఎస్పీ రెడ్డి దామోదర్ పర్యవేక్షణలో గూడూరు డీఎస్సీ చౌడేశ్వరి, సీఐ నరసింహరావు, ఎస్‌ఐలు పీవీ నారాయణ, వేణుగోపాల్‌లు బందోబస్తు నిర్వహించారు. నె ల్లూరు డీఆర్ ఉత్తమ్ అధినేత ధనుంజయరెడ్డి అన్నదానం నిర్వహిం చగా వెంకటగిరి స్టేట్‌బ్యాంక్ శాఖ ఆధ్వర్యంలో మంచినీళ్ల ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను నడిపారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు తాండవ చంద్రశేఖర్, కార్వేటి లక్కరాజు, కె.వెంకటరమణయ్య, ఎన్.పాపయ్యనాయుడు, మంచి మహేష్, అనిల్, కె.నరసింహరావు, ఏజీ సాయికిరణ్, చల్లా శివకుమార్, గోల్లగుంట రా ములు ప్రత్యేక చర్యలు చేపట్టారు.