ప్రభుత్వ స్థలంలో కాకుండా గ్రామ టీడీపీ నేతలు సూచించిన ప్రదేశంలో ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమం నిర్వహించడం వివాదాస్పదమైంది.
పార్వతీపురం రూరల్: ప్రభుత్వ స్థలంలో కాకుండా గ్రామ టీడీపీ నేతలు సూచించిన ప్రదేశంలో ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమం నిర్వహించడం వివాదాస్పదమైంది. ఎమ్మార్ నగరంలో పంచాయతీ కార్యాలయం, పాఠశాల భవనాలు, ఎన్నో ఖాళీ ప్రభుత్వ స్థలాలున్నాయి. కానీ టీడీపీ నేతలు సూచించిన సత్యనారాయణస్వామి ఆలయం వద్ద గురువారం ‘జన్మభూమి-మాఊరు’ ఏర్పాటు చేశారు. వేదిక నిండా టీడీపీ నేతలే కూర్చోవడంతో అది పార్టీ కార్యక్రమాన్ని తలపించింది. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా జరుగుతున్న సభకు సర్పంచ్ రొంపిల్లి తిరుపతిరావు, ఎంపీటీసీ బడే రామారావు, వార్డు సభ్యులు, పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున వెళ్లి అధికారులను నిలదీశారు.
ఇకపై ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే చూస్తూ ఊరుకోబోమని, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడమే కాకుండా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రత్యేకాధికారి రాబర్ట్స్ జోక్యం చేసుకొని ఇకపై గ్రామంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమాలను ప్రభుత్వ స్థలాల్లోనే నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అయిన్పటికీ గ్రామస్తులు శాంతించకపోవడంతో అర్ధాంతరంగా సమావేశాన్ని ముగించారు. వెంక ంపేట, ఎమ్మార్‌నగరం, సంగంవలస, బాలగుడబ, వీఆర్ పేట, నర్సిపురం గ్రామాల్లో జన్మభూమి-మా ఊరు కార్యక్రమాలను నిర్వహించారు.