టీడీపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది
ఎమ్మెల్యే కోన రఘుపతి
పిట్టలవానిపాలెం: జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఎమ్మెల్యే కోన రఘుపతి విమర్శించారు. మండల కేంద్రంలోని నీటిపారుదల శాఖ అతిథి గృహంలో సోమవారం వైఎస్సార్‌సీపీ మండల కార్యకర్తల సమావేశాన్ని జడ్పీటీసీ సభ్యుడు చిరసాని నారపరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించకుండా టీడీపీ నాయకులు గందరగోళ పరిస్థితులను సృష్టిస్తున్నారని పేర్కొన్నారు.
నియోజకవర్గంలోని బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని కోరగా ఒక్క మండలాన్నే ప్రకటించారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు కోటలు దాటుతున్నాయని, కార్యక్రమాల అమలు మాత్రం అంతంత మాత్రంగా ఉందని విమర్శించారు. కొన్ని చోట్ల టీడీపీ నాయకులు చేసే ఆగడాలకు అడ్డూఆపూ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి, తాను రాష్ట్ర మంత్రిని కావడాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు షేక్‌బాజి, కర్లపాలెం, బాపట్ల అధ్యక్షులు డి.సీతారామిరెడ్డి, నాయకులు కె.రాఘవరెడ్డి, సయ్యద్‌పీర్, హుస్సేన్ పాల్గొన్నారు.