జన్మభూమి’లో ఎంపీ, ఎమ్మెల్యేల నిలదీత
పీఎన్‌కాలనీ : స్థానికంగా 34వ వార్డులో శనివారం నిర్వహించిన ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు చుక్కెదురైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారంటూ స్థానికులు ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిని నిలదీశారు. దీంతో పాలకులు నివ్వెరపోయారు. టీడీపీ కార్యకర్తలు మాటమార్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. స్థానిక మహిళ పి.కామేశ్వరి తదితరులు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కొక్క హామీని గుర్తు చేస్తూ ప్రజాప్రతినిధులను నిలదీశారు.
రుణమాఫీ, ఆధార్, రేషన్ కార్డులు ఇలా పలు సమస్యలను ప్రస్తావించారు. తొలుత 20వ వార్డులో నిర్వహించిన జన్మభూమిలో ఎంపీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమానికే జన్మభూమి అని అన్నారు. నేరుగా ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే లక్ష్మీదేవి మాట్లాడుతూ టీడీపీ హయాంలోనే అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయన్న నమ్మకం ప్రజల్లో మరింత పెరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పి.వి.రమణ, మున్సిపల్ డీఈ శంకరరావు, టీడీపీ మాజీ కౌన్సిలర్ జి.శివప్రసాద్, నాయకులు కృపాసాగర్, బలివాడ శంకర్, కళావతి, వర్మ తదితరులు పాల్గొన్నారు.