ఉద్యోగాలు చేసి పిల్లల్ని కనడం మానేస్తారేమో:బాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశంపై తాను జపాన్ పర్యటనకు వెళ్లినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సోమవారం ఆయన జపాన్ పర్యటన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆ దేశంలో పలు ప్రైవేటు కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యానని తెలిపారు. జపాన్ లో ఆర్థికంగా పుంజుకుంటున్న ప్రాంతాల్లో తమ బృందం పర్యటించిందని ఆయన అన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల కోసం ఒప్పందం చేసుకున్నామని ఈ సందర్బంగా బాబు తెలిపారు.
దీంతోపాటుగా జపాన్ లో పలు సంస్థల కార్యకలాపాలను అధ్యయనం చేశామన్నారు. అనేక అవాంతరాలను, అడ్డంకులను జపాన్ అధిగమించిందని ఆయన అన్నారు. క్రమశిక్షణ, నిరంతర శ్రమతో జపాన్ గణనీయ అభివృద్ధిని సాధించిందన్నారు. నమ్మకం పెరిగితే జపనీయులు అందిస్తారన్నారు. కొత్త రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యములు అవుతామని జపాన్ కంపెనీలు చెప్పాయన్నారు. అయితే అనేక అంశాల్లో అభివృద్ధి సాధించిన జపాన్ క్రమబద్దీకరణలో మాత్రం విఫలమైందన్నారు. అభివృద్ధితో మహిళలకు ఉద్యోగాలు వస్తాయని బాబు అన్నారు. మహిళలకు ఉద్యోగాలు వస్తే.. ఇగో ప్రాబ్లెల్స్ కూడా వస్తాయన్నారు. అక్కడ నుంచి పెళ్లిళ్లు చేసుకోవడం మానేసి పిల్లల్ని కనడం మానేస్తారని బాబు చమత్కరించారు. తాను గతంలో కుటుంబ నియంత్రణను బాగా ప్రోత్సహించానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
కొత్త రాజధాని నిర్మాణంలో భాగస్వాములు అవుతాయని జపాన్ కంపెనీలు చెప్పాయని బాబు తెలిపారు. నాలుగువేల మెగావాట్ల విద్యుత్ కేంద్రంపై ఎంఓయూ జరిగిందని.. 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి సాఫ్ట్ బ్యాంక్ ముందుకొచ్చిందన్నారు. భారత్ చాలా అనుకూలమైన దేశమని ఆ బ్యాంకు అధిపతి తనతో చెప్పినట్లు ఆయన తెలిపారు. తీరప్రాంతాన్ని లాజిస్టిక్ హబ్ గా తయారుచేస్తామన్నారు. మూడు యూనివర్శిటీల్లో జపనీస్ భాషను ప్రవేశపెడతామన్నారు. తన జపాన్ పర్యటన విజయవంతమైందని బాబు తెలిపారు.