ఏపీ విద్యార్థులు జపనీస్ నేర్చుకోవాల్సిందే!
హైదరాబాద్ : ఇక నుంచి ఏపీ విద్యార్థులు జపనీస్ నేర్చుకోవాల్సిందే. ఏపీ రాజధాని నిర్మాణంలో సహకారంతో పాటు రాష్ట్రంలో జపాన్ పెట్టుబడులు పెట్టనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా జపనీస్ భాషను తప్పనిసరిగా నేర్చుకోవాలని హితబోధ చేస్తున్నారు.
అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు రాబోయే కాలంలో జపనీస్ నేర్చుకోవడం తప్పనిసరి కానుంది. ఎందుకంటే...ఏపీలో పాఠశాల స్థాయి నుంచే జపనీస్ను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. జపాన్ నుంచి రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు రానున్నందున అవకాశాలను అందిపుచ్చుకొనేలా విద్యార్థులను సిద్ధం చేయాలని భావిస్తోంది.
ఇటీవల సీఎం చంద్రబాబు జపాన్కు వెళ్లి అక్కడ ప్రభుత్వ ముఖ్యులతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం జపాన్కు చెందిన ప్రవాస భారతీయుడు రాజీవ్ పాండ్యన్ సీఎంతో భేటీ అయ్యారు. పాఠశాల స్థాయిలో జపనీస్ను ప్రవేశపెట్టే అంశంపై మాట్లాడారు. దీనిపై మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది.