
జయ మంగళం.. నిత్య శుభ మంగళం
భక్తజన పారవశ్యంతో గోదావరి తీరం పులకించింది. మమతానురాగాలను ప్రోది చేసింది. దాతృత్వపు ఔన్నత్యాన్ని చాటింది. అనిర్వచనీయమైన ఆనందాన్ని మిగిల్చింది. పన్నెండు రోజుల పుష్కర పండగలో ఎన్నో అనుభూతులు.. మరెన్నో అనుభవాలు.. అక్కడక్కడా అపశ్రుతులు.. అట్టహాసంగా మొదలైన ఆది పుష్కరాలు పరిసమాప్తమయ్యాయి. జయమంగళం.. నిత్య శుభ మంగళం అంటూ యాత్రికులకు.. భక్త జనులకు వీడ్కోలు పలికాయి. పూలు, పండ్లతో.. పసుపు, కుంకాలతో.. పాలు, పన్నీరుతో.. శ్రీగంధపు ధారతో.. పంచామృతాలతో.. గోదారమ్మను వివిధ రూపాల్లో అర్చించే అవకాశమిచ్చిన పుష్కరుడికి అంతా అంజలి ఘటించారు. గోదావరి తీరం నుంచి భారంగా కదిలారు. పుష్కర విధులు నిర్వర్తించిన ఉద్యోగులు, స్వచ్ఛంద సేవకులు చివరి క్షణాల్లో ఉద్వేగానికి గురయ్యారు. జీవన.. పావన వాహిని గోదారి తల్లి సేవలో తరించామన్న తృప్తితో ఇంటిముఖం పట్టారు.
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పుష్కర సంబరం వైభవంగా ముగిసింది. అంత్య పుష్కర రోజుల్లో మళ్లీ కలుద్దామంటూ పుష్కరుడికి భక్తజనం ఘనంగా వీడ్కోలు పలికింది. పుష్కరాల ముగింపు సంబరాన్ని శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాత్రివేళ ఘాట్లలో దీపార్చన జరిపారు. జిల్లా అంతటా దీపార్చన నిర్వహించాలని ప్రభుత్వం పిలుపునిచ్చినప్పటికీ ప్రధాన ఘాట్లలో మినహా ఎక్కడా దీపోత్సవం జాడ కానరాలేదు. ప్రజలంతా ఇళ్లల్లో దీపాలు వెలిగించాలన్న ప్రభుత్వ పిలుపునకు పెద్దగా స్పందన కానరాలేదు. సాయంత్రం ఆరున్నర తర్వాత కొవ్వూరు గోష్పాద క్షేత్రం లోని ప్రధాన ఘాట్‌లో నదీపూజ చేసి హారతి ఇచ్చారు. అదే సమయంలో కొవ్వూరు వాసులు దీపాలు వెలిగించి బాణసంచా కాల్చారు.
గోష్పాదం ఘాట్‌లో ముస్లింల ప్రార్థనలు
కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో డీసీసీ అధ్యక్షుడు ఎండీ రఫీఉల్లా బేగ్ ఆధ్వర్యంలో ముస్లింలు ప్రార్థనలు చేశా రు. తొలుత పుణ్యస్నానాలు ఆచరించి హిందూ, ముస్లింల ఐక్యత వర్థిల్లాలని కోరుతూ ప్రార్థన జరి పారు. గోష్పాద క్షేత్రంలో రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు, రవాణా శాఖమంత్రి శిద్ధా రాఘవరావు స్నానాలు ఆచరించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి కొవ్వూరు వీఐపీ ఘాట్‌లో పుష్కరస్నానమాచరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి పిండప్రదానం చేశారు. మంత్రి పీతల సుజాత, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ పూనం మాలకొండయ్య ఘాట్లను పరిశీలించారు.
నరసాపురంలో ఎండను సైతం లెక్కచేయక..
మండు వేసవిని తలపించే ఎండను ఏ మాత్రం లెక్కచేయకుండా నరసాపురం పట్టణానికి భక్తులు వెల్లువలా వచ్చారు. వేకువజామునుంచే భక్తుల రాక పోటెత్తింది. రైళ్లు, బస్సులు ఉదయం నుంచే కిటకిటలాడాయి. ఉదయం 8గంటలు దాటిన తర్వాత రద్దీ తీవ్రమైంది. రాత్రి వరకు ఘాట్ల వద్ద ఇదే పరిస్థితి నెల కొంది. పట్టణంలోని అన్ని ప్రధాన వీధులు జనంతో కిక్కిరిశాయి. ఘాట్ల వద్ద నీటిమట్టం పడిపోవడంతో చాలామంది జల్లు స్నానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చివరి రోజు అన్నసమారాధనలు, అల్పాహార పంపిణీలు హోరెత్తాయి. ప్రతి వీధిలోనూ అన్నసమారాధనలు, పులిహోర, మజ్జిగ పంపిణీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు పలుచోట్ల అన్నసమారాధనలను ప్రారంభించారు.
సిద్ధాంతంలోనూ అదే జోరు
పెనుగొండ మండలంలో భక్తుల జోరు చివరి రోజూ కొనసాగింది. సిద్ధాంతంలోని కేదారీ ఘాట్‌లోని అన్ని రేవులు రద్దీగా మారాయి. స్నానాలకు వచ్చినవారు రేవుల్లో దిగడానికి అరగంట సమయం పట్టింది. ఇక్కడ కూడా పోటాపోటీగా అన్నసమారాధనలు జరిగాయి. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పుష్కర విధులు నిర్వహిస్తున్న అధికారులతో కలసి స్నానం చేశారు.
పెరవలిలో భయం భయంగా..
గోదావరి నీటిమట్టం పెరగడంతో భక్తులను రేవుల్లోకి అనుమతించలేదు. దీంతో భక్తులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు.అన్ని ఘాట్లు భక్తులతో పోటెత్తాయి. ఎండ, ఉక్కబోతతో యాత్రికులు ఇబ్బందులు పడ్డారు. నిడదవోలు మండలంలోనూ చివరి రోజున యాత్రికుల సంఖ్య రెట్టింపయింది. పెండ్యాల, పురుషోత్తపల్లి ఘాట్లలో మధ్యాహ్నం 12గంటల వరకు ఇసుకవేస్తే రాలనంతగా జనం కనిపించారు.
పోలవరంలో తగ్గిన రద్దీ
జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఒక పరిస్థితి అయితే పోలవరంలో మాత్రం భక్తుల సంఖ్య తగ్గింది. లాంచీల రాకపోకలు నిలిచిపోవడంతో పట్టిసీమ క్షేత్రాన్ని దర్శించుకునే వీలులేక భక్తుల పట్టిసీమ రేవుకు రాలేదు. ఎండ కారణంగా పిండ ప్రదానాలు చేసుకునేవారు అవస్థలు పడ్డారు. పోలవరం మండలంలో కూడా యాత్రికులకు అన్న సమారాధనలు నిర్వహించి భోజనాలు పెట్టారు. మంత్రి పీతల సుజాత ఘాట్లను పరిశీలించారు.