జయశ్రీ వైష్ణవి వర్మకు స్వీటు తిన్పిస్తున్న తండ్రి కేఎల్‌ఎన్ రాజు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : కర్నూలుకు చెందిన కె.జయశ్రీ వైష్ణవి వర్మ ఉత్తమ ర్యాంకులకు కేరాఫ్‌గా మారింది. పోటీ పరీక్ష ఏదైనా సరే మంచి ర్యాంకుతో సత్తా చాటుతోంది. ఇప్పటికే ఏపీ ఎంసెట్, నీట్, జిప్‌మర్‌లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన జయశ్రీ ఆదివారం విడుదలైన తెలంగాణ ఎంసెట్‌లోనూ రాష్ట్రస్థాయిలో 47వ ర్యాంకుతో సత్తా చాటింది. మెడికల్ విభాగంలో 142 మార్కులు సాధించి.. ఈ ర్యాంకును కైవసం చేసుకుంది. వైద్యురాలు కావాలన్న లక్ష్యం, కఠోర శ్రమ, తల్లిదండ్రుల తోడ్పాటు, అధ్యాపకుల సహకారం వల్లే ప్రతిభ చూపుతున్నట్లు జయశ్రీ చెబుతోంది.
నాలుగు పోటీ పరీక్షల్లో టాప్ ర్యాంకు
జయశ్రీ వైష్ణవి వర్మ ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసింది. తండ్రి కేఎల్‌ఎన్‌రాజు వైద్యుడు. ఆయన కల్లూరు మండలంపర్ల రూరల్ హెల్త్ సెంటర్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. తండ్రి స్ఫూర్తితో వైద్యురాలు కావాలన్న జీవిత లక్ష్యంతో జయశ్రీ శ్రమించింది. రెండేళ్ల పాటు పండుగలు, ఇతరత్రా కార్యక్రమాలకు సైతం దూరంగా ఉండి చదివింది. ఫలితంగా ఇంటర్‌లో 10/10 పాయింట్లతో ఉత్తీర్ణత సాధించింది. ఏపీ ఎంసెట్‌లో రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంకు, నీట్‌లో ఆలిండియా స్థాయిలో 104వ ర్యాంకు, జిప్‌మర్‌లో 87వ ర్యాంకుతో సత్తా చాటింది. ఇప్పుడు టీఎస్ ఎంసెట్‌లోనూ 47వ ర్యాంకు సాధించడంతో ఆమె ప్రతిభను పలువురు మెచ్చుకుంటున్నారు.
హర్షితకు 75వ ర్యాంకు
జిల్లాకు చెందిన మరో విద్యార్థిని హర్షితకు టీఎస్ ఎంసెట్‌లో 75వ ర్యాంకు వచ్చింది. మొత్తం 139 మార్కులతో ఈ ర్యాంకును కైవసం చేసుకుంది. ఈమె నీట్ పరీక్షలోనూ ఆలిండియా స్థాయిలో 3,747 ర్యాంకు సాధించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment