ముందు రోజు ఆసుపత్రిలో కిమో థెరపీ..
మరుసటి రోజు పట్టుదలతో
పరీక్ష కేంద్రానికి.. క్యాన్సర్ బాధపెడుతున్నా
చలించని ఇంటర్ విద్యార్థి
పెందుర్తి : రొంగలి హేమశంకర్ ప్రసాద్. పదో తరగతి పరీక్షలో 9.8 పాయింట్లు... ఫస్ట్ ఇంటర్ బైపీసీలో 440 మార్కులకు 418 (95 శాతం).. ఈ ఏడాది ద్వితీయ సంవత్సరం పరీక్షకు అదే స్థాయిలో సన్నద్ధమవుతున్న తరుణంలో విధికి కన్నుకుట్టింది. పరీక్షలకు కొద్ది కాలం ముందు మాయదారి రోగాన్ని ఉసిగొల్పింది. బోన్ క్యాన్సర్‌తో ఒంట్లో ఓపిక లేకుండా చేసింది. పరీక్షలకు శ్రద్ధగా చదవాల్సిన సమయంలో వైద్య పరీక్షలు చేయించుకునే దుస్థితిని కల్పించింది. పరీక్షల ముందు ఆసుపత్రి పాలు చేసింది. అయినా అతడి సంకల్పం సడల్లేదు.. పట్టుదల పిసరంత కరగలేదు.. విధిని సవాల్ చేస్తూ పరీక్షకు హాజరయ్యాడు. పూర్తి సమయం అందరితో కూర్చోని చక్కగా పరీక్ష రాశాడు.
నిన్నటి వరకు ఆసుపత్రిలో..
వేపగుంటకు చెందిన హేమశంకర్ ప్రసాద్ తొలి నుంచి చదువులో ముందంజలో ఉండేవాడు. తల్లిదండ్రులు సింహాచలం, దివ్య ఆశలకు అనుగుణంగా ఉన్నత లక్ష్యం వైపు నడుస్తున్నాడు. అయితే అనుకోని విధంగా కొన్ని నెలల నుంచి ప్రసాద్ ఆరోగ్యం దిగజారుతూ వచ్చింది. ఎన్ని ఆసుపత్రులు తిప్పినా ఆరోగ్యం కుదుటపడలేదు. చివరకు నడవలేని పరిస్థితి వచ్చేసరికి ఆందోళనకు గురైన తల్లిదండ్రులు నగరంలో క్యాన్సర్ ఆసుపత్రిలో చూపించగా గత నెల పరీక్షలు నిర్వహించిన వైద్యులు బోన్ క్యాన్సర్‌గా నిర్థారించారు. వెనువెంటనే వైద్యం కూడా ప్రారంభించారు. ఈ క్రమంలో మంగళవారం ఆసుపత్రిలో కిమో థెరపీ చేయించుకున్నాడు. అదే రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన ప్రసాద్ చదువులో నిమగ్నమైపోయాడు. తల్లిదండ్రులు, బంధువులు ఈసారికి విశ్రాంతి తీసుకోమన్నా సంకల్పంతో పరీక్షకు హాజరయ్యాడు. ప్రసాద్ ఇంటర్ పరీక్షతోపాటు విధి పెట్టిన పరీక్షలో కూడా విజయం సాధించాలని ఆకాంక్షిద్దాం.
నీ సంకల్పానికి జోహార్..
Published Thu, Mar 3 2016 11:58 PM | Last Updated on Sun, Sep 3 2017 6:55 PM
Advertisement
Advertisement