ఇంటర్మీడియెట్ పరీక్షలు.. 70 ‘డే’స్ ప్లాన్ | Intermediate exams .. 70 days Plan... | Sakshi
Sakshi News home page

ఇంటర్మీడియెట్ పరీక్షలు.. 70 ‘డే’స్ ప్లాన్

Published Sun, Dec 28 2014 11:44 PM | Last Updated on Sat, Sep 2 2017 6:53 PM

Intermediate exams .. 70 days Plan...

ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో మార్చి 9 నుంచి 27 వరకు; ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 11 నుంచి 31వ తేదీ వరకు పరీక్షల నిర్వహణకు రంగం సిద్ధమైంది. దీంతో విద్యార్థులు తమ ప్రిపరేషన్‌కు పదును పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. గ్రూప్ ఏదైనా.. ప్రథమ సంవత్సరమైనా లేదా ద్వితీయ సంవత్సరమైనా సాధ్యమైనన్ని ఎక్కువ మార్కులు సాధించడం తప్పనిసరిగా మారింది. ఇంటర్మీడియెట్‌లో పొందిన మార్కులకు ఆయా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో వెయిటేజీ ఇస్తుండటం; ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్మీడియెట్ మార్కులు కీలకంగా మారుతుండటమే ఇందుకు కారణం. ఇప్పటి నుంచి విద్యార్థులకు అందుబాటులో ఉన్న 70 రోజుల సమయంలో అనుసరించాల్సిన ప్రిపరేషన్ ప్రణాళికలపై గ్రూప్‌ల వారీగా నిపుణులు, ఇంటర్మీడియెట్- 2014 టాపర్స్ అందిస్తున్న సలహాలు, సూచనలు..
 
 
ఎంపీసీ

ఎంపీసీ.. జేఈఈ మెయిన్‌లో ఇంటర్మీడియెట్ మార్కులకు 40 శాతం వెయిటేజీ; అడ్వాన్స్‌డ్‌లోనూ టాప్-20 పర్సంటైల్ విధానం.. ఎంపీసీ విద్యార్థుల కోణంలో ఇంటర్మీడియెట్ మార్కులకు ప్రాధాన్యత లభిస్తోంది.
 
మ్యాథమెటిక్స్.. డిస్క్రిప్టివ్ అప్రోచ్

ఎంపీసీ విద్యార్థులు ఇప్పటికే దాదాపు సిలబస్ పూర్తి చేసి ఉంటారు. ప్రస్తుతమున్న సమయంలో స్వల్ప సమాధాన ప్రశ్నలపై బాగా దృష్టిసారించాలి. వీటిని కూడా కేవలం ప్రశ్న- సమాధానంలా కాకుండా డిస్క్రిప్టివ్ అప్రోచ్‌తో అధ్యయనం చేయాలి. అదే విధంగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు షార్ట్ ఆన్సర్ కొశ్చన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడే జేఈఈ, ఎంసెట్ తదితర పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకోవాలి. ఆయా సిలబస్‌లకు అనుగుణంగా ఆబ్జెక్టివ్ ప్రశ్నలు-సమాధానాల రూపంలో ప్రిపరేషన్ కొనసాగించాలి.

‘ఇంటర్మీడియెట్ సిలబస్ పూర్తి చేసేశాం కదా.. పోటీ పరీక్షల ప్రిపరేషన్‌కు ప్రాధాన్యమిద్దాం’ అనే ధోరణి సరికాదు. ఎందుకంటే ప్రవేశ పరీక్షల్లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఉంది. కాబట్టి ఈ వెయిటేజీని దృష్టిలో పెట్టుకుని ఆ మేరకు ఇంటర్ ప్రిపరేషన్‌కు ప్రాధాన్యమివ్వాలి. ఇప్పటి నుంచి దాదాపు 90 శాతం సమయాన్ని గ్రూప్ సబ్జెక్ట్‌ల ప్రిపరేషన్‌కు కేటాయించాలి. ఫిబ్రవరి మధ్య నుంచి పూర్తిగా ఇంటర్మీడియెట్ సబ్జెక్టులనే చదవాలి. తెలుగు అకాడమీ పుస్తకాల్లోని అన్ని ప్రాబ్లమ్స్‌ను సాల్వ్ చేస్తూ ప్రాక్టీస్‌కు ప్రాధాన్వమివ్వాలి.

వీక్లీ, మంత్లీ టెస్ట్‌లు రాయడం తప్పనిసరి. అదేవిధంగా కనీసం రెండు ప్రీ-ఫైనల్ ఎగ్జామ్స్‌కు హాజరవ్వాలి. సిలబస్ ప్రిపరేషన్ క్రమంలో అంశాల వారీగా లభిస్తున్న వెయిటేజీ ఆధారంగా సమయ ప్రాధాన్యత ఇవ్వాలి. ద్వితీయ సంవత్సరం మ్యాథమెటిక్స్‌కు సంబంధించి ద్విపద సిద్ధాంతం; ప్రస్తారాలు-సంయోగాలు, సంభావ్యత; వృత్తాలు; సమాకలనులు; నిశ్చిత సమాకలనులు; అవకలన సమీకరణాలు; డిమూవర్స్ సిద్ధాంతం, వర్గ సమీకరణాలు, పరావలయం వంటి అంశాలను బాగా పునశ్చరణ చేయాలి. మొదటి సంవత్సరం విద్యార్థులు వెక్టార్ అల్జీబ్రా; మాత్రికలు, సరళరేఖలు, సరళరేఖ యుగ్మాలు, అవకలనాలు, అప్లికేషన్స్ అండ్ డెరివేషన్స్‌కు ఎక్కువ సమయం కేటాయించాలి.
 
ఫిజిక్స్.. అతి స్వల్ప సమాధాన ప్రశ్నలపై దృష్టి
విద్యార్థులు జనవరిలో స్వల్ప, అతి స్వల్ప సమాధాన ప్రశ్నల సాధనకు ఎక్కువ కృషి చేయాలి. ఇప్పటికే సిలబస్ మొత్తం పూర్తి చేసుకుని ఉంటారు కాబట్టి.. ఫిబ్రవరిని పూర్తిగా రివిజన్‌కు, ప్రాక్టికల్స్‌లో నైపుణ్యం సాధించడానికి కేటాయించాలి. ఫిజిక్స్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి..  మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నటిజం; కరెంట్ ఎలక్ట్రిసిటీ; ఆప్టికల్ ఇన్‌స్ట్రుమెంట్స్; పరమాణువు, వేవ్స్; సెమీ కండక్టర్ ఎలిమెంట్స్ వంటి అంశాల్లో పట్టు సాధించేలా పునశ్చరణ చేయాలి.

ప్రథమ సంవత్సరం విద్యార్థులు..  రొటేటరీ మోషన్; యూనివర్సల్ గ్రావిటేషన్ లా; ఎస్కేప్ వెలాసిటీ; సింపుల్ హార్మోనిక్ మోషన్; సర్ఫేస్ టెన్షన్, థర్మో డైనమిక్స్ వంటి అంశాలకు ఎక్కువ సమయం కేటాయించాలి. ఫిజిక్స్‌లో దీర్ఘ సమాధాన ప్రశ్నలను సాధన చేసేటప్పుడు అంచెలవారీ పరిష్కార విధానాన్ని అనుసరించాలి. ఫలితంగా సదరు సమస్యకు సంబంధించి ప్రాథమిక భావనలపైనా పట్టు సాధించేందుకు ఆస్కారం లభిస్తుంది.
 
కెమిస్ట్రీ.. ముఖ్యాంశాలు నోట్ చేసుకుంటూ
కెమిస్ట్రీ ప్రిపరేషన్ విషయంలో ప్రస్తుత సమయంలో కలిసొచ్చే విధానం.. ముఖ్యాంశాలను నోట్ చేసుకోవడం. దీర్ఘ సమాధాన ప్రశ్నలు, నాలుగు మార్కుల ప్రశ్నలను ఎక్కువగా సాధన చేయాలి. వీటికి సంబంధించి గతంలో అడిగిన ప్రశ్నలను రివైజ్ చేయడం; మోడల్ టెస్ట్‌లకు హాజరవడం ఉపయుక్తంగా ఉంటుంది. విద్యార్థులు జనవరి చివరి నాటికి సబ్జెక్ట్ ప్రిపరేషన్‌ను పూర్తిచేసుకుని, ఫిబ్రవరి మొత్తాన్ని రివిజన్‌కు కేటాయించే విధంగా సమయ ప్రణాళిక రూపొందించుకోవాలి.

ద్వితీయ సంవత్సరం విద్యార్థులు.. ఆయా చాప్టర్లకు లభిస్తున్న వెయిటేజీ ఆధారంగా విద్యుత్ రసాయన శాస్త్రం; పి-బ్లాక్ మూలకాలు, డి, ఎఫ్-బ్లాక్ మూలకాలు, లోహ శాస్త్రం; సాలిడ్ స్టేట్ వంటి అంశాలకు ఎక్కువ సమయం కేటాయించాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీలోని అన్ని ముఖ్యాంశాలతో సొంత నోట్స్ రూపొందించుకోవడం మేలు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు.. కర్బన రసాయన శాస్త్రం; ఆవర్తన పట్టిక; పరమాణు నిర్మాణం; రసాయన బంధం అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి రోజు ఒక చాప్టర్ పూర్తి చేసుకునేలా అధ్యయనం చేయాలి.
 
బైపీసీ

బైపీసీలో ఎక్కువ మంది విద్యార్థుల టార్గెట్‌గా నిలుస్తున్న ఎంసెట్‌లో అడిగే ప్రశ్నలన్నీ ఇంటర్మీడియెట్ సిలబస్ ఆధారితమే.
 
బోటనీ.. అనలిటికల్ అప్రోచ్
విద్యార్థులు బోటనీ సబ్జెక్ట్‌ను విశ్లేషణాత్మక దృక్పథంతో చదవాలి. ప్రశ్న-సమాధానం అనే కోణంలో కాకుండా.. ఒక ప్రశ్నకు సమాధానం సాధించే క్రమంలో ఇమిడి ఉన్న అనువర్తిత అంశాలను నిజ జీవితంలోని పరిస్థితులతో బేరీజు వేస్తూ సాగాలి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొక్కల శరీర ధర్మశాస్త్రం; బయోటెక్నాలజీ; మైక్రోబ్స్, అణు జీవశాస్త్రం యూనిట్లకు ప్రాధాన్యం ఇవ్వాలి.

బోటనీకి సంబంధించి బాగా కలిసొచ్చే అంశం.. గ్రాఫికల్ ప్రజంటేషన్‌పై అవగాహన. కాబట్టి ఫ్లో చార్ట్‌లు, డయాగ్రమ్స్ వేయడం ప్రాక్టీస్ చేయాలి. మొదటి సంవత్సరం విద్యార్థులు.. మొక్కల నిర్మాణాత్మక సంవిధానం-స్వరూప శాస్త్రం; జీవ ప్రపంచంలో వైవిధ్యం; కణ నిర్మాణం, విధులు; మొక్కల అంతర్ నిర్మాణ సంవిధానం, మొక్కల్లో ప్రత్యుత్పత్తి యూనిట్లపై ఎక్కువ దృష్టిపెట్టాలి. దీనికి సంబంధించి డయాగ్రమ్స్ వేయడం బాగా సాధన చేయాలి.
 
జువాలజీ.. ఇలా
జువాలజీకి సంబంధించి సమయపాలన ఎంతో కీలకం. ఆయా యూనిట్లకు లభిస్తున్న వెయిటేజీకి అనుగుణంగా ప్రిపరేషన్‌కు సమయం కేటాయించుకోవాలి. జనవరి చివరి నాటికి సిలబస్ పూర్తి చేసుకోవాలి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు.. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ప్రత్యుత్పత్తి - సంబంధిత ఆరోగ్యం; అంతస్రావక వ్యవస్థ, నాడీ నియంత్రణ-సమన్వయం; శరీర ద్రవాలు, ప్రసరణ, విసర్జక పదార్థాలు; జన్యు శాస్త్రాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రథమ సంవత్సరం విద్యార్థులు.. జంతుదేహ నిర్మాణం; గమనం, ప్రత్యుత్పత్తి; జీవావరణం; పర్యావరణం; బొద్దింక జీవ వ్యవస్థ వంటి అంశాలను క్షుణ్నంగా చదవాలి.

జువాలజీలో మార్కుల సాధనకు గ్రాఫికల్ ప్రజంటేషన్ చాలా అవసరం. కాబట్టి డయాగ్రమ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పటివరకు ఏమాత్రం దృష్టిపెట్టని అంశాలకు ఇప్పుడు ఎక్కువ సమయం కేటాయించడం సరికాదు. దీనివల్ల ఒత్తిడికి గురవడం తప్పితే అదనపు ప్రయోజనం ఉండదు. కాబట్టి బాగా ముఖ్యమైనవి, ఇప్పటివరకు చదవనివి అని భావించిన అంశాల ప్రిపరేషన్‌ను జనవరి చివరి నాటికి పూర్తి చేసుకోవడం ఉపయుక్తం.
 
ఫిజిక్స్, కెమిస్ట్రీ
ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ, బైపీసీ గ్రూప్‌లు రెండింటిలోనూ ఉండే సబ్జెక్ట్‌లు.. ఫిజిక్స్, కెమిస్ట్రీలు. బైపీసీ విద్యార్థుల్లో ఎక్కువ మంది ఈ సబ్జెక్టుల ప్రిపరేషన్‌లో ఆందోళన చెందుతుంటారు. ముఖ్యంగా ఫిజిక్స్‌కు సంబంధించి ఎంతో ఇబ్బంది ఎదుర్కొంటారు. దీనివల్ల తుది ఫలితాల్లో నిరాశకు గురవుతున్న వారెందరో! ఫిజిక్స్‌ను నిజ జీవిత పరిస్థితులతో అన్వయించుకుంటూ చదివితే సులభంగా అర్థమవుతుంది. ఉదాహరణకు సర్ఫేస్ టెన్షన్ అంశాన్ని నిత్య జీవితంలో పరిస్థితులతో అన్వయించుకోవడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇలాంటి అప్లికేషన్ అప్రోచ్‌తో ఫిజిక్స్‌ను తేలిగ్గానే గట్టెక్కొచ్చు.

ఫిజిక్స్‌కు సంబంధించి ప్రథమ సంవత్సరం విద్యార్థులు లిక్విడ్, గ్యాస్, కైనటిక్ గ్యాస్ థియరీ, రొటేటరీ మోషన్, యాంగులర్ మూమెంట్, యూనివర్సల్ గ్రావిటేషన్ లా, ఆర్బిటాల్ వెలాసిటీ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు వేవ్ మోషన్; సెమీ కండక్టర్ ఎలిమెంట్స్; మూవింగ్ ఛార్జెస్-మ్యాగ్నటిజం; విద్యుదయస్కాంత ప్రేరణ అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి.  

కెమిస్ట్రీలో మొదటి సంవత్సరంలో ఆవర్తన పట్టిక; కర్బన రసాయన శాస్త్రం; రసాయన బంధం; పరమాణు నిర్మాణం అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. వీటిలోని సమస్యలను సాధన చేస్తూనే వీలైతే సినాప్సిస్ రూపొందించుకుంటే రివిజన్‌కు ఉపయుక్తంగా ఉంటుంది. ద్వితీయ సంవత్సరంలో పి-బ్లాక్ ఎలిమెంట్స్; ఆర్గానిక్ కెమిస్ట్రీ; విద్యుత్ రసాయన శాస్త్రం; కెమికల్ కైనటిక్స్‌లోని దీర్ఘ సమాధాన ప్రశ్నలు, నాలుగు మార్కుల ప్రశ్నల ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
 
సీఈసీ

సీఈసీ.. సంప్రదాయ బీకాం డిగ్రీ మొదలు కామర్స్ ప్రొఫెషనల్ కోర్సులుగా పేరొందిన సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యుఏ వంటి కోర్సుల సిలబస్‌లకు సంబంధించి ప్రాథమిక భావనలపై అవగాహన కల్పించే గ్రూప్. సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్ట్‌ల సమ్మేళనంగా ఉండే సీఈసీ గ్రూప్‌నకు ప్రాధాన్యం పెరుగుతోంది. కారణం.. పలు ప్రొఫెషనల్ కోర్సులకు ఈ గ్రూప్ సబ్జెక్ట్‌లు బేసిక్స్‌గా ఉపయోగపడుతుండటమే. ఇదే సమయంలో మూడు సబ్జెక్ట్‌లు కూడా విస్తృతంగా, గణాంకాల పరిజ్ఞానం అవసరమైన రీతిలో ఉంటాయి. కాబట్టి విద్యార్థులు విశ్లేషణాత్మకంగా, తులనాత్మకంగా ప్రిపరేషన్ సాగించాల్సి ఉంటుంది.

సివిక్స్, ఎకనామిక్స్‌కు విశ్లేషణ ఎంతో అవసరం. కామర్స్ సబ్జెక్ట్ విషయంలో తులనాత్మక అధ్యయనం మేలు చేస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో విద్యార్థులు సబ్జెక్ట్‌ల ప్రిపరేషన్‌ను జనవరి చివరి వారానికల్లా పూర్తిచేసుకోవాలి. ఆ తర్వాత సమయాన్ని ప్రాక్టీస్‌కు, రివిజన్‌కు కేటాయించాలి. సైన్స్ విద్యార్థులతో పోల్చితే సీఈసీ విద్యార్థులకు సమయం పరంగా కలిసొచ్చే అంశం.. ప్రాక్టికల్స్ లేకపోవడం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆయా సబ్జెక్ట్‌లకు లభిస్తున్న వెయిటేజీ ఆధారంగా సమయ ప్రణాళికను రూపొందించుకోవాలి.
 
సివిక్స్‌కు ఇలా
భారత రాజ్యాంగం- శాఖలు- రాజ్యాంగ సంస్థలు తదితర అంశాలతో ఉండే సివిక్స్‌లో మంచి మార్కులు సాధించాలంటే.. రాజ్యాంగం, సమకాలీన రాజకీయ అంశాలపై అవగాహన ఎంతో అవసరం. సివిక్స్ మొదటి సంవత్సరానికి సంబంధించి.. రాజ్యాంగం స్వభావం, తీరుతెన్నులపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలి. ఆయా అంశాలకు సంబంధించి నిర్వచనాలు షార్ట్ నోట్స్ రూపంలో పొందుపర్చుకుంటే రివిజన్ సమయంలో లాభిస్తుంది. ముఖ్యంగా వ్యాసరూప సమాధాన ప్రశ్నలు చదివేటప్పుడే అందులో పేర్కొన్న నిర్వచనాలను ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి.

ఇది షార్ట్ ఆన్సర్ కొశ్చన్స్‌కు కూడా ఉపయోగపడుతుంది. ద్వితీయ సంవత్సరం సివిక్స్‌లో భారత రాజ్యాంగం, ప్రభుత్వం, పరిపాలన అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలు. విద్యార్థులు రాజ్యాంగ సంస్థల(పార్లమెంట్, సర్వీస్ కమిషన్‌లు తదితర) గురించి పూర్తి అవగాహన పెంచుకోవాలి. ఇప్పటివరకు వీటిపై దృష్టి పెట్టని విద్యార్థులు కూడా కొద్ది రోజులు ఏకాగ్రతతో చదివితే సులభంగా అర్థమవుతుంది. కాబట్టి ఆందోళన చెందక్కర్లేదు.
 
కామర్స్‌లో మంచి మార్కులకు ప్రాక్టీస్
కామర్స్‌లో మంచి మార్కుల సాధనకు ప్రాక్టీస్ ఒక్కటే ఏకైక మార్గం. పార్ట్-1 (వాణిజ్య శాస్త్రం), పార్ట్-2 (వ్యాపార గణాంక శాస్త్రం)గా 50 మార్కులు చొప్పున మొత్తం వంద మార్కులకు పరీక్ష జరుగుతుంది. మొదటి సంవత్సరం విద్యార్థులు పార్ట్-1కు సంబంధించి వ్యాపారం-భావనలు, స్వరూపాలు, వ్యవస్థాపన-వ్యవస్థాపకులు తదితర అంశాలపై దృష్టిపెట్టాలి. వ్యాపార పరమైన సమకాలీన అంశాలపై అవగాహన ఉన్న విద్యార్థులకు పార్ట్-1 సులభంగానే ఉంటుంది.

ఇతర విద్యార్థులు కూడా కొద్దిపాటి శ్రమతో మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చు. అకాడమీ పుస్తకాల్లో పేర్కొన్న అంశాలను సునిశితంగా అధ్యయనం చేయాలి. సిలబస్‌కు అనుగుణంగా ఆయా అంశాల ప్రాథమిక భావనలు-నిత్య జీవితంలో వాటి అనువర్తనాలను తెలుసుకుంటే 90 శాతం మార్కులు సాధించొచ్చు. పార్ట్-2గా పేర్కొన్న వ్యాపార గణాంక శాస్త్రంలో మెరుగైన మార్కుల కోసం సిలబస్‌లోని అంశాలపై పట్టు సాధించాలి. దాంతోపాటు కంప్యుటేషనల్ నైపుణ్యాలు, తులనాత్మక అధ్యయన నైపుణ్యం పెంచుకోవాలి.

ఫైనల్ అకౌంట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ షీట్, బ్యాంకింగ్ రీకన్సిలియేషన్ సిస్టమ్‌లపై ఎక్కువ దృష్టి సారించాలి. వీటిపై పట్టు కోసం ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలి. కామర్స్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు.. పార్ట్-1గా పేర్కొనే థియరీ ఆధారిత వాణిజ్య శాస్త్రం కోసం మార్కెటింగ్, వ్యాపారం, స్టాక్ ఎక్స్ఛేంజ్ కార్యకలాపాలు, కంప్యూటర్ అవగాహనలో ముందుండాలి. పార్ట్-2గా పేర్కొనే వ్యాపార గణాంక శాస్త్రానికి సంబంధించి ట్రేడింగ్, కన్‌సైన్‌మెంట్, నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ తదితర అంశాలపై పట్టు సాధించాలి. మొత్తంమీద కామర్స్ సబ్జెక్ట్‌లోని అంశాల్లో నైపుణ్యం దిశగా.. ప్రిపరేషన్ సమయంలోనే ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. కేవలం రీడింగ్‌కు పరిమితమవడం సరికాదు. ప్రాక్టీస్ చేస్తూనే ముఖ్యమైన భావనలను నిర్వచనాల రూపంలో గుర్తుంచుకోవాలి.
 
ఎకనామిక్స్
‘చాలా విస్తృతం.. సంక్లిష్టం’ అని భావించే ఎకనామిక్స్ (అర్థశాస్త్రం)లోనూ మెరుగైన మార్కులు పొందేందుకు ఎన్నో మార్గాలున్నాయి. సబ్జెక్ట్‌లోని అంశాల మూల భావనలను వాస్తవ పరిస్థితులకు అన్వయిస్తూ చదవడం ద్వారా ఆసక్తిని పెంపొందించుకోవచ్చు. ఇది సబ్జెక్ట్‌పై అవగాహన కల్పించడంతోపాటు మంచి మార్కుల సాధనకు దోహదం చేస్తుంది. మొదటి సంవత్సరం విద్యార్థులు.. ఆర్థిక భావనలు, ఆర్థిక సూత్రాలు- వాటి నిర్వచనాలు, పట్టికలు, రేఖా పటాలు, ప్రమేయాలు, ప్రాముఖ్యత తదితర అంశాలను అనునిత్యం చదవాలి. వీటితోపాటు బ్యాంకింగ్-ద్రవ్యోల్బణం, జాతీయాదాయం వంటివి కీలక అంశాలు.

వీటి విషయంలో గ్రాఫికల్ అవేర్‌నెస్ కూడా మెరుగైన మార్కులకు దోహదం చేస్తుంది. కాబట్టి విద్యార్థులు రీడింగ్‌తోపాటు ప్రాక్టీస్ ఓరియెంటేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు... ఆర్థిక సమస్యలు-కారణాలు-నివారణ చర్యలు, గణాంక వివరాలపై దృష్టిపెట్టాలి. మార్కుల పరంగా ఎక్కువ వెయిటేజీ ఉన్న జాతీయాదాయం, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, నూతన ఆర్థిక సంస్కరణలను ప్రధానంగా చదవాలి. ప్రతి అంశాన్ని చదివేటప్పుడు దాని మూల భావనలు, సదరు అంశంలో సమకాలీన సమస్యలు-నివారణ మార్గాలపై అవగాహన పెంచుకోవాలి. దాంతోపాటు సినాప్సిస్ రూపంలో షార్ట్‌నోట్స్ రూపొందించుకుంటే స్వల్ప సమాధాన ప్రశ్నలకు కూడా సంసిద్ధత లభిస్తుంది.
 
కామన్ టిప్స్ ఫర్ త్రీ గ్రూప్స్
ఎంపీసీ, బైపీసీ, సీఈసీ.. మూడు ప్రధాన గ్రూప్‌ల విద్యార్థులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో పాటించాల్సిన వ్యూహాలు..
 
జనవరి చివరి వారానికి సిలబస్ పూర్తి చేసుకోవాలి.
ఫిబ్రవరి నుంచి పూర్తిగా రివిజన్‌కు కేటాయించాలి.
ప్రాక్టికల్స్ ఉండే ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు జనవరి మూడో వారానికే సిలబస్ పూర్తి చేసుకుని తర్వాత ప్రాక్టికల్స్‌పై దృష్టి పెట్టడం మంచిది.
ప్రస్తుత సమయంలో కొత్త అంశాలను చదవడం సరికాదు. ఒకవేళ బాగా ముఖ్యమైన అంశాలు అనుకుంటే వాటిని జనవరి పదిహేనో తేదీలోపు పూర్తి చేయడం మంచిది.
ఏ సబ్జెక్ట్ అయినా షార్ట్ ఆన్సర్ కొశ్చన్స్ అన్నింటికీ సమాధానం ఇచ్చేలా సంసిద్ధత పొందాలి. లాంగ్ ఆన్సర్ కొశ్చన్స్‌ను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే వాటి నుంచి అడిగే అవకాశం ఉన్న షార్ట్ ఆన్సర్ కొశ్చన్స్‌కు సంబంధించిన అంశాలు (ఉదా: నిర్వచనాలు, ఫార్ములాలు, భావనలు తదితర) గుర్తించి నోట్స్ రూపంలో రాసుకోవాలి.
జేఈఈ, ఎంసెట్ వంటి పరీక్షలకు కూడా పోటీ పడుతున్న విద్యార్థులు వాటి ప్రిపరేషన్‌ను డిసెంబర్ నెలాఖరుకు పూర్తి చేసి.. తర్వాత సమయం మొత్తం ఇంటర్మీడియెట్ ప్రిపరేషన్‌కు కేటాయించాలి.
విద్యార్థులు క్లాస్‌రూం లెక్చర్‌కు అదనంగా ప్రతి రోజు కనీసం ఆరు నుంచి ఏడు గంటల స్వీయ ప్రిపరేషన్‌కు కేటాయించాలి.
ఈ సమయంలో ప్రాక్టికల్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌లకు 40 శాతం; థియరీ సబ్జెక్ట్‌లకు 30 శాతం చొప్పున కేటాయించడం వల్ల అన్ని అంశాలు పూర్తి చేసుకునే వీలు లభిస్తుంది. ఏ సబ్జెక్ట్‌కు ఎంత సమయం కేటాయించాలనేది ఆయా అభ్యర్థుల సామర్థ్యంపైన కూడా ఆధారపడి ఉంటుంది.
అభ్యర్థులు తమకు అనుకూలంగా ఉండే మెమొరీ టిప్స్ (విజువల్ ఇమాజినేషన్; షార్ట్ నోట్స్)ను పాటించడం మేలు.
కేవలం రీడింగ్‌కే పరిమితం కాకుండా కచ్చితంగా పెన్/పేపర్ ప్రాక్టీస్ అవసరం.
కనీసం రెండు ప్రీ-ఫైనల్స్‌కు హాజరుకావాలి. ఈ ప్రక్రియ జనవరిలోపు పూర్తి చేసుకుంటే తమలోని లోపాలు, బలహీనతలపై స్పష్టత ఏర్పడుతుంది. ఫలితంగా తర్వాత అందుబాటులో ఉన్న నెల రోజుల వ్యవధిలో సదరు అంశాల్లో ఏ విధంగా రాణించాలనే అవగాహన పొందొచ్చు.
 
అన్ని చాప్టర్లపై అవగాహన
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో బైపీసీ విద్యార్థులు అన్ని చాప్టర్లపై అవగాహన పెంపొందించుకునే విధంగా చదవాలి. ఇప్పటికే సిలబస్ పూర్తయి ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని అధిక శాతం రివిజన్‌కు కేటాయించాలి. బైపీసీలో చాలా మంది విద్యార్థులు ఫిజిక్స్ అంటే భయంతో చాయిస్‌ను దృష్టిలో పెట్టుకుని కొన్ని అంశాలను చదవరు. కానీ ఎంసెట్‌లో ఇంటర్మీడియెట్ సిలబస్‌లోని అన్ని అంశాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఆయా అంశాల్లో కనీసం ప్రాథమిక భావనలపైనైనా పట్టు సాధించేందుకు కృషి చేయాలి. వ్యక్తిగతంగా నిర్దిష్ట టైం టేబుల్‌ను రూపొందించుకుని దాన్ని అనుసరిస్తూ ప్రిపరేషన్ సాగించాలి. మోడల్ టెస్ట్‌లు, ప్రీ-ఫైనల్ టెస్ట్‌లు, షార్ట్ ఆన్సర్ కొశ్చన్స్‌పై అవగాహన అదనపు ప్రయోజకాలుగా నిలుస్తాయి.
 - ఎం. రిషిత, బైపీసీ టాపర్ (989 మార్కులు)
 
ప్రాక్టీస్.. ప్రాక్టీస్..
ఎంపీసీ విద్యార్థులు రెండు నెలల సమయంలో స్వీయ ప్రాక్టీస్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పటి వరకు క్లాస్‌రూంలో విన్న అంశాలకు సంబంధించిన ప్రశ్నలు, సమస్యలను వీలైనన్ని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయాలి. ఈ క్రమంలో కేవలం మ్యాథమెటిక్స్‌కే పరిమితం కాకుండా ఫిజిక్స్‌కు కూడా ప్రాధాన్యమివ్వాలి. రివిజన్ కోణంలో విద్యార్థులు తమకు అనుకూలమైన టెక్నిక్స్‌ను (షార్ట్ నోట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోవడం, ముఖ్యమైన ఫార్ములాలను పట్టిక రూపంలో పొందుపర్చుకోవడం) పాటిస్తే రెండు నెలల సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో ఎంట్రన్స్ టెస్ట్‌ల ఆలోచనను దరి చేరనీయకూడదు.    
 - నిఖిల్, ఎంపీసీ టాపర్ (994 మార్కులు)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement