‘ఉమ్మడి’ భద్రతకు 5,500మంది పోలీసులు | Joint' the security of 5,500 police | Sakshi
Sakshi News home page

‘ఉమ్మడి’ భద్రతకు 5,500మంది పోలీసులు

Published Sun, May 25 2014 12:47 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM

Joint' the security of 5,500 police

గవర్నర్‌కు డీజీపీ ప్రతిపాదనలు
 
 హైదరాబాద్: తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలకు  పదేళ్లు ఉమ్మడి రాజధాని కాబోతున్న  హైదరాబాద్ నగర భద్రతకోసం అదనంగా 5,500మంది పోలీసు సిబ్బంది కావాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చారు. డీజీపీ బి ప్రసాదరావు ఈ మేరకు గవర్నర్ నరసింహన్‌కు ఒక ప్రతిపాదన పంపారు. అదే సమయంలో మరో రెండు ఏఆర్ బెటాలియన్లు అదనంగా అవసరమని పేర్కొంటూ హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ కూడా మరో ప్రతిపాదన డీజీపీకి పంపించారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ  పరిధిని  హైదరాబాద్ రాజధాని పరిధిలోకి  తీసుకు రావడంతో హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లలో దాదాపు 14వేల మంది పోలీసులున్నారు. మరో రెండు  బెటాలియన్ల కేంద్ర పారామిలటరీ బలగాలు  అందుబాటులో ఉన్నా యి. అయితే, రెండురాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల రక్షణతో పాటు  సచివాలయంలో  ఇద్దరు  సీఎంల బ్లాక్‌ల భద్రత, ముఖ్యమంత్రుల నివాసాల భద్రత కోసం ఎక్కువ భాగం సిబ్బంది వినియోగమతారని అధికారులు తేల్చారు.

ఆందోళనలు, గణేశ్ నిమజ్జనోత్సవం, బోనాలు వంటి ఉత్సవాలకు అదనపు పోలీసు బలగాలను ఇతర జిల్లాలనుంచి  తరలించేవారు.  విభజన తర్వాత  జిల్లాల నుంచి అదనపు పోలీసుసిబ్బంది రప్పించడం కష్టమేనని, నగరంలో రెండు అసెంబ్లీలు, రెండు శాసన మండలుల నిర్వహణలో అవసరమైన  భద్రత ఏర్పాటు కూడా నగర పోలీసులకు కత్తిమీద సామేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులోని  పోలీసు సిబ్బంది అవసరాలకు ఏమాత్రం సరిపోరని, అదనంగా 5500 మంది  పోలీసులు సివిల్, ఏఆర్,  విభాగాలకు  సంబంధించి అవసరమవుతారని నగర పోలీసు కమిషనర్ ప్రతిపాదించారు. మరో రెండు సాయుధ రిజర్వు బెటాలియన్లు అదనంగా అవసరమని మరో ప్రతిపాదనను  పంపించారు. రెండు ప్రతిపాదనలను డీజీపీ గవర్నర్‌కు పంపించారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement