మంజూరు చేసిన నిధులు రద్దు చేస్తారా?
జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే కలమట ఆగ్రహం
నిధుల కేటాయింపు విషయంలో జడ్పీచైర్‌పర్సన్ వ్యాఖ్యలపై నిరసన
పోడియం ముందు బైఠాయించిన వైఎస్సాఆర్‌సీపీ సభ్యులు
శ్రీకాకుళం :
జిల్లాలో పలు అభివృద్ధి పనులకు, తాగునీటి సమస్య పరిష్కారానికి నిధులు కేటాయించడంలో వివక్ష చూపించడంపై వైఎస్సాఆర్‌సీపీ శాసనసభ్యుడు కలమట వెంకటరమణ తప్పుబట్టారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన నియోజకవర్గమైన పాతపట్నానికి తాగునీటి సమస్య పరిష్కారానికి రూ. 23 లక్షలు కేటాయించి నెల రోజులు తరువాత ఎందుకు రద్దుచేయాల్సి వచ్చిందని ఆయన నిలదీశారు. దీనికి మంత్రి బదులిస్తూ అన్ని నియోజకవర్గాలకు సమానంగా నిధులు కేటాయించాల్సి ఉందని, అయితే పాతపట్నం నియోజకవర్గానికి ఎక్కువ మొత్తం కేటాయించడం వల్ల రద్దు చేయాల్సి వచ్చిందన్నారు.
దీనికి కలమట అభ్యంతరం తెలుపుతూ ఎచ్చెర్ల మండలానికి రూ. 1.26 కోట్లు కేటాయించారని, ఆ నియోజకవర్గానికి రూ. 3 కోట్లు వరకు కేటాయించారన్నారు. ఇంతలో జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి జోక్యం చేసుకుంటూ మీ నియోజకవర్గానికి నిధులు కావాలని మీరు అడుగుతున్నప్పుడు నా నియోజకవర్గానికి, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మండలానికి ఎక్కువ నిధులు కేటాయించడం తప్పా అని ప్రశ్నించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలమట పోడియం వద్దకు వెళ్లి నా నియోజకవర్గ ప్రజలు మీ పరిధిలోనికి రారా అని నిలదీశారు. పోడియం వద్దకు వస్తే బాగోదని చైర్‌పర్సన్ వ్యాఖ్యానించడంతో అభ్యంతరం తెలిపిన వైఎస్సాఆర్‌సీపీ శాసనసభ్యులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పోడియం ఎదుట భైఠాయించారు. ఇక మీదట అలా జరగకుండా మంత్రి సర్దిచెప్పడంతో సభ్యులు శాంతించి వారి స్థానాల్లో కూర్చున్నారు.
గ్రీవెన్స్‌లో ఫిర్యాదులకు స్పందన లేదు: బూర్జ జడ్పీటీసీ
బూర్జ జెడ్పీటీసీ అన్నెపు రామక్రిష్ణ మాట్లాడుతూ సమావేశంలో మంత్రి ఇస్తున్న ఆదేశాలు అమలు కావడం లేదని, మంజూరవుతున్న నిధుల వివరాలు కూడా సభ్యుల దృష్టికి రావడం లేదన్నారు. తాను ఇప్పటివరకు ఓ సమస్య పరిష్కారం కోసం 8 సార్లు కలెక్టర్‌కు గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదన్నారు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ దీనిపై విచారణ జరపాలని ఆదేశించానని చెబుతూ ఆ వివరాలు తెలపాల్సిందిగా ఇంజినీరింగ్ అధికారులను కోరారు. దీనికి వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో కలెక్టర్‌తోపాటు మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజాం శాసనసభ్యుడు కంబాల జోగులు మాట్లాడుతూ కొన్ని ప్రాంతాల్లో విత్తనాల బస్తాల్లో ధాన్యానికి బదులు బియ్యం ఉన్నాయని చెప్పగా అధికారులతోపాటు మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేసి పరిశీలన జరపాలని వ్యవసాయశాఖ జేడీని ఆదేశించారు. నందిగాం జెడ్పీటీసీ బాలక్రిష్ణ మాట్లాడుతూ రైతులకు రవాణా చార్జీలు చెల్లించడంలేదని అనగా ఈ వ్యవహారంలో రూ. 16 కోట్లకు పైగా అవినీతి జరిగిందని పాతపట్నం ఎమ్మెల్యే కలమట చెప్పారు. దీనిపై విచారణ జరుగుతోందని మంత్రి సమాధానమిచ్చారు.
కోకోనట్ బోర్డు ఎరువుల సరఫరాలో అవినీతి
కొచ్చిన్ కోకోనట్ బోర్డు జిల్లాలో సరఫరా చేస్తున్న ఎరువులు నాసిరకం అని కో-ఆప్షన్ సభ్యుడు సదానంద రౌళో ఆరోపించారు. అసలు బోర్డు ద్వారా ఎరువులు సరఫరా అవుతున్న విషయం తమకు తెలియదని మంత్రి అనగా ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు. దీనిపై విచారణ చేపట్టాలని కలెక్టర్ లక్ష్మీనరసింహం జేడీని ఆదేశించారు. మహేంద్రతనయ నదిపై ఒడిశా రాష్ట్ర ఓ ప్రాజెక్టును నిర్మిస్తోందని, ఇది పూర్తయితే పాతపట్నం నియోజకవర్గంతోపాటు అప్‌షోర్‌కు తీవ్ర నష్టం కలుగుతుందని ఎమ్మెల్యే కలమట చెప్పారు. దీనిపై సీడబ్యుసీతోను చర్చిస్తున్నామని, అసెంబ్లీలో కూడా ప్రస్తావించామని మంత్రి చెప్పారు.
వంశధార నిర్వాసితులకు నష్టాన్ని పంపిణీ చేయడంలో ఏడవసారి సర్వే జరుపుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదని కలమట అనగా ఈ వ్యవహారంలో గతంలో ఎంతో అవినీతి జరిగిందని, వాటిని కప్పిపుచ్చుకునేందుకు కొందరు రికార్డులు మాయం చేశారని కలెక్టర్, మంత్రి అన్నారు. 40 ఎస్టీ కుటుంబాలు జంపరకోట నిర్వాసితులు, బడ్డుమాసింగిలో నిర్మించుకున్న కాలనీలో తాగునీరు, విద్యుత్తు, పాఠశాలలు, కమ్యూనిటీ భవనం మంజూరు చేయాలని పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి తెలపగా, త్వరితగతిన ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు. వైద్య ఆరోగ్యశాఖాధికారులు గ్రామీణ ప్రజలకు ఆసుపత్రి ప్రసవాలపైన, ఎపిడమిక్ సీజన్‌లో కలరా, డయేరియా ప్రబలకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపైన క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా అవగాహన కలిగించాలని జెడ్పీ చైర్‌పర్సన్ ధనలక్ష్మి తెలిపారు.
రాజాం మండలం కంచరాంలో పీహెచ్‌సీలో శాశ్వత ప్రాతిపదికన ఏఎన్‌ఎం పోస్టులు భర్తీ చేయాలని ఎమ్మెల్యే కంబాల జోగులు కోరారు. నిబంధనలను అనుసరించి చర్యలు చేపట్టనున్నట్లు చైర్మన్ తెలిపారు. నూతన శాసనమండలి సభ్యురాలు కావలి ప్రతిభా భారతి జిల్లా పరిషత్ మూడవ కమిటీ సభ్యురాలుగా నియమించడానికి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. జిల్లాలోని 595 పాఠశాలల్లో టాయ్‌లెట్ల నిర్మాణానికి పవర్ కార్పొరేషన్ వారు రూ. 10 కోట్ల 42 లక్షలు అందించారని, ఆగస్టు 15 నాటికి పూర్తి స్థాయిలో నిర్మిస్తామని జిల్లా కలెక్టర్ పి.ల క్ష్మీనరసింహం తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీలు ప్రతిభాభారతి, గాదె శ్రీనివాసులనాయుడు, పీరుకట్ల విశ్వప్రసాద్, ఎంవీఎస్ శర్మ, శాసనసభ్యులు గుండ లక్ష్మీదేవి, సంయుక్త కలెక్టర్ వివేక్‌యాదవ్, జెడ్పీ సీఈఓ జె.వసంతరావు, జిల్లా అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఎందుకీ వివక్ష?
Published Sun, Jul 12 2015 1:15 AM | Last Updated on Sat, Sep 29 2018 5:21 PM
Advertisement
Advertisement